
కాంగ్రెస్ పై తిరుగుబాటుతో సొంతంగా పార్టీ ప్రారంభించి, ఏపీలో కాంగ్రెస్ ఉనికి లేకుండా చేసి, ఐదేళ్లపాటు అధికారంలో కొనసాగిన వైసిపి అధినేత వైఎస్ జగన్ మోహన్ రెడ్డి తాజాగా కాంగ్రెస్ నేతృత్వంలోని ఇండియా కూటమికి దగ్గరవుతున్నారనే కధనాలు వెలువడుతున్నాయి.
గత పదేళ్లుగా కేంద్రంలో బిజెపికి ప్రత్యక్షంగానో, పరోక్షంగానే సన్నిహితంగా వ్యవహరించిన జగన్ తాజా రాజకీయ పరిస్థితులలో కేంద్రంలో నరేంద్ర మోదీ ప్రభుత్వంకు కీలక మద్దతుదారునిగా టిడిపి అధినేత చంద్రబాబు నాయుడు ఉండే పరిస్థితి ఏర్పడటంతో రాజకీయంగా తన దారి చూసుకొనే ప్రయత్నం చేస్తున్నట్లు పలువురు భావిస్తున్నారు.
ఆంధ్ర ప్రదేశ్ లో తమ పార్టీ కార్యకర్తలపై అధికార టిడిపి హత్యారాజకీయాలకు పాల్పడుతున్నట్లు ఆరోపిస్తూ, రాష్ట్రంలో రాష్ట్రపతి పాలన విధించాలని కోరుతూ ఈ నెల 24న ఢిల్లీలో జగన్ చేపట్టిన ధర్నాలో 9 పార్టీలకు చెందిన ప్రతినిధులు పాల్గొని సంఘీభావం ప్రకటించడం ప్రాధాన్యత సంతరింప చేసుకుంది. ఈ పార్టీలలో అన్నాడీఎంకే మినహా మిగిలిన పార్టీలు అన్ని ఇండియా కూటమిలో భాగస్వామి పార్టీలే కావడం గమనార్హం.
అయితే కాంగ్రెస్ ప్రతినిధులు ఎవ్వరూ పాల్గొనలేదు. ఉత్తర ప్రదేశ్ మాజీ ముఖ్యమంత్రి సమాజావాది పార్టీ అధినేత అఖిలేష్ యాదవ్ మాత్రమే ప్రధాన ఆకర్షణగా నిలిచారు. కుటుంభ కలహాల కారణంగా రాజకీయ ప్రత్యర్థిగా మారిన సోదరి వైఎస్ షర్మిల ఎపిసిసి అధ్యక్షురాలిగా ఉంటూ ఉండడంతో కాంగ్రెస్ కు దగ్గరవడం జగన్ కు ఇబ్బందికరంగా మారే అవకాశం ఉంది.
అయితే ఏపీలో రాజకీయ ఉనికి కోసం ఆరాటపడుతున్న కాంగ్రెస్ జగన్ వంటి నేత దగ్గరవుతుంటే షర్మిలను పక్కకు నెట్టేందుకు వెనుకాడే అవకాశం ఉండకపోవచ్చు. పైగా, ఏపీ ప్రభుత్వం కూటమిలో టిడిపితో పాటు జనసేన, బిజెపి నేతలు సహితం జగన్ పాలనలో జరిగిన అక్రమాలపై గొంత్తెతూ ఉండటంతో రాజకీయంగా ఓ నీడకోసం జగన్ ప్రయత్నం చేస్తున్నారనే ప్రచారం జరుగుతుంది.
జగన్కు ఢిల్లీ స్థాయిలో ఓ పునరావాసం కావాలని, అదే సమయంలో ఇండియా కూటమికి కూడా పార్టీల అవసరం ఉందని పేర్కొంటూ ఇండియా కూటమికి జగన్ దగ్గరయ్యే అవకాశాలు ఎక్కువగా ఉన్నాయని ఏపీ అసెంబ్లీ లాబీల్లో మాజీ ఆర్ధిక మంత్రి యనమల రామకృష్ణుడు, మాజీ మంత్రి సోమిరెడ్డి చంద్రమోహన్ రెడ్డి విడివిడిగా మీడియాతో మాట్లాడుతూ అభిప్రాయం వ్యక్తం చేశారు.
అయితే, ఏపీలో ఉనికిలో లేని ఇండియా కూటమిలో చేరేంత ధైర్యం జగన్‌కు ఉందా? అని ప్రశ్నిస్తూ అంత సాహసం చేస్తాడని అనుకోవడం లేదని బిజెపి శాసనసభాపక్ష నేత విష్ణు కుమార్ రాజు పేర్కొన్నారు. అయితే ఈ పరిణామాలను బిజెపి అగ్రనాయకత్వం సహితం గమనిస్తున్నట్లు తెలుస్తున్నది. ఢిల్లీలో ధర్నా అనంతరం రాష్ట్రపతి, కేంద్ర హోమ్ మంత్రి, మరికొందరు కేంద్ర మంత్రులను కలిసేందుకు జగన్ చేసిన ప్రయత్నాలు ఫలించకపోవడం గమనార్హం.
రెండు రోజులపాటు ఢిల్లీలో వేచిఉన్నప్పటికీ కేంద్ర ప్రభుత్వంలో ఎవ్వరిని కలవలేకపోయారు. గతంలో జగన్ కు ఎప్పుడూ అటువంటి పరిస్థితి ఏర్పడలేదు. జగన్ ఎప్పుడూ ఎన్డీయేలో భాగస్వామి కానప్పటికీ రాజకీయాలకు అతీతంగా ఏపీ ప్రయోజనలమేరకు జగన్ తో కేంద్ర ప్రభుత్వం మంచి సంబంధాలని కొనసాగించింది. పార్లమెంట్ లో పలు బిల్లుల విషయంలో జగన్ సహితం బిజెపికి మద్దతుగా ఉంటూ వచ్చారు.
ఇప్పుడు మారిన పరిస్థితుల్లో ఢిల్లీలో ఎవరినీ కలవకుండానే జగన్ విజయవాడ బాట పట్టాల్సి వచ్చింది. పైగా, వైసీపీకి చెందిన పలువురు కీలక నేతలు బీజేపీలో చేరేందుకు ప్రయత్నాలు కూడా చేస్తున్నారు. మరొకొందరు నేతలు టిడిపి, జనసేనలలో చేరేందుకు ప్రయత్నాలు చేస్తున్నారు. ఈ విషయంలో ఇతర పార్టీలకు ఇబ్బంది లేనివారిని చేర్చుకోవాలని కూటమిలోని మూడు పార్టీలు నిర్ణయించాయి.
More Stories
గాంధీజీ శాంతి, సహనం, సత్యం సందేశం మానవాళికి ప్రేరణ
మాలవీయ మిషన్ పేద విద్యార్థులకు ఆర్థిక సహాయం
సుంకాల యుద్ధం మధ్య స్వదేశీ, స్వావలంబనలకై భగవత్ పిలుపు