పరీక్షల నిర్వహణలో యూపీఎస్సీ దిద్దుబాటు చర్యలు

పరీక్షల నిర్వహణలో యూపీఎస్సీ దిద్దుబాటు చర్యలు
నీట్‌-యూజీ పరీక్షలో అక్రమాల ఆరోపణలు, ఐఏఎస్‌గా పూజా ఖేద్కర్‌ నియామకంపై వివాదం నేపథ్యంలో యూనియన్‌ పబ్లిక్‌ సర్వీస్‌ కమిషన్‌(యూపీఎస్సీ) పరీక్షల ప్రక్రియలో మార్పులకు సిద్ధమైంది. అధునాతన సాంకేతికతను వినియోగించి అక్రమాలకు తావులేకుండా చూడాలని నిర్ణయించింది.  పరీక్ష నిర్వహణలో ఎన్నో లోపాలున్నాయని ఇటీవలే సుప్రీంకోర్టు సైతం తేల్చి చెప్పింది.
దీంతో దిద్దుబాటు చర్యలకు పూనుకుంది. పరీక్షల నిర్వహణ విధానంలో కీలక మార్పులకు శ్రీకారం చుట్టింది. ఇందులో భాగంగానే పరీక్షల నిర్వహణలో అధునాతన డిజిటల్‌ సాంకేతిక పరిజ్ఞానాన్ని ఉపయోగించాలని నిర్ణయించింది.  అభ్యర్థుల కోసం అత్యాధునిక ఆధార్ అథెంటికేషన్‌, ఫింగర్‌ప్రింట్ తీసుకోవడం, ఫేషియల్ రికగ్నిషన్‌ వంటి చర్యలతో ఎక్కడా ఎలాంటి అవకతవకలు జరగకుండా చూడాలని యోచిస్తోంది.
సీసీ కెమెరాలతో నిఘా పెంచడం, అందుకోసం ఆర్టిఫిషియల్ ఇంటిలిజెన్స్‌ని వినియోగించడం, ఈ-అడ్మిట్ కార్డ్‌లపై క్యూఆర్ కోడ్ స్కానింగ్ వంటి చర్యలు చేపట్టాలని నిర్ణయించింది. అభ్యర్థుల బయోమెట్రిక్‌ను ధ్రువీకరించేందుకు, పరీక్ష సమయంలో అభ్యర్థుల కార్యకలాపాలను పర్యవేక్షించడం ద్వారా మోసాలు, ఒకరికి బదులుగా మరొకరు పరీక్షకు హాజరుకావడం వంటి అక్రమాలను అడ్డుకునేందుకు అధునాతన సాంకేతికతను వినియోగించాలని నిర్ణయించినట్టు టెండర్‌ డాక్యుమెంట్‌లో యూపీఎస్సీ పేర్కొన్నది.
ఈ సాంకేతికతను అందించే ప్రభుత్వ రంగ సంస్థకు పరీక్ష తేదీకి రెండు మూడు వారాల ముందు ఏర్పాట్లు చేసుకునేందుకు పరీక్షా కేంద్రాల వివరాలు, హాజరయ్యే అభ్యర్థుల సంఖ్య వంటి ప్రాథమిక వివరాలు అందిస్తామని యూపీఎస్సీ తెలిపింది. వేలిముద్రతో ధ్రువీకరణ, ఫేషియల్‌ రికగ్నిషన్‌ కోసం అభ్యర్థుల పేర్లు, హాల్‌ టికెట్‌ నెంబరు, ఫొటో వంటి వివరాలను మాత్రం వారం రోజుల ముందు ఇస్తామని తెలిపింది.

పరీక్షలు నిర్వహించిన సమయంలో ఎక్కడా సమస్యలు తలెత్తకుండా కట్టుదిట్టమైన ఏర్పాట్లు చేసేందుకు సిద్ధమవుతోంది. యూపీఎస్సీ ఏటా 14 పరీక్షలు నిర్వహిస్తోంది. ఇందులో సివిల్‌ సర్వీసెస్‌ ఎగ్జామినేషన్ కూడా ఉంది. వీటితో పాటుగా ప్రభుత్వంలో ఉన్నత ఉద్యోగాలకు సంబంధించిన పరీక్షలు, ఇంటర్వ్యూలనూ నిర్వహిస్తోంది. 

యూపీఎస్సీ నిర్వహించే పరీక్షల సమయంలో సాంకేతిక సేవలను అందించేందుకు ప్రభుత్వ రంగ సంస్థలను బిడ్స్‌కు ఆహ్వానిస్తూ టెండర్‌ దాఖలు చేసింది. గత మూడు ఆర్థిక సంవత్సరాల్లో పరీక్షల ఆధారిత ప్రాజెక్టుల ద్వారా కనీసం రూ.100 కోట్లు సగటు టర్నోవర్‌ కలిగి ఉన్న సంస్థలు మాత్రమే బిడ్‌ వేయాలని యూపీఎస్సీ తన టెండర్‌లో స్పష్టం చేసింది. 

అదేవిధంగా, పరీక్షలకు సంబంధించిన షెడ్యూల్‌, ఎగ్జామ్‌ సెంటర్ల జాబితా, ఎంతమంది అభ్యర్థులు పరీక్షకు హాజరవుతారు వంటి వివరాలను పరీక్షకు రెండు లేదా మూడు వారాల ముందు సర్వీస్‌ ప్రొవైడర్లకు అందజేస్తామని పేర్కొంది.