ఆర్ఎస్ఎస్ పై ఆంక్షల తొలగింపుకు ఐదు దశాబ్దాలు పట్టిందా?

ఆర్ఎస్ఎస్ పై ఆంక్షల తొలగింపుకు ఐదు దశాబ్దాలు పట్టిందా?
* మధ్య ప్రదేశ్ హైకోర్టు విస్మయం!

“రాష్ట్రీయ స్వయంసేవక్ సంఘ్ వంటి అంతర్జాతీయంగా ప్రసిద్ధి చెందిన సంస్థ”ను ప్రభుత్వ అధికారులు పాల్గొనకూడని నిషేధిత సంస్థల జాబితాలో పొరపాటుగా ఉంచడంలో కేంద్ర ప్రభుత్వం తన “తప్పు”ను గ్రహించడానికి ఐదు దశాబ్దాలు పట్టిందని మధ్యప్రదేశ్ హైకోర్టు గురువారం పేర్కొంది. రిటైర్డ్ కేంద్ర ప్రభుత్వ అధికారి, ఇండోర్ నివాసి పురుషోత్తం గుప్తా సెప్టెంబరు 2023లో కోర్టు తలుపులు తట్టి, ఆర్‌ఎస్‌ఎస్‌లో చేరకుండా నిషేధించే నిబంధనలు “తన జీవితంలోని సంధ్యాకాలంలో తన కోరికలను తీర్చుకోవడానికి అవరోధంగా ఉన్నాయి” అని తెలిపారు. 
 
ఆర్‌ఎస్‌ఎస్‌ను ప్రభుత్వ అధికారులు పాల్గొనరాదనే  ఆంక్షలు గల రాజకీయ సంస్థల జాబితా నుండి తొలగించిన కేంద్రం నోటిఫికేషన్ జారీ చేసిన మరుసటి రోజు హైకోర్టుకు తెలుపుతూ జూలై 10న అఫిడవిట్ దాఖలు చేసింది. దానితో ఈ పిటిషన్‌ను త్రోసివేస్తూ, జస్టిస్ ఎస్‌ఏ ధర్మాధికారి, గజేంద్ర సింగ్‌లతో కూడిన ధర్మాసనం విచారం వ్యక్తం చేసింది. 
 
ఆర్ఎస్ఎస్ వంటి అంతర్జాతీయంగా ప్రసిద్ధి చెందిన సంస్థ దేశంలోని నిషేధిత సంస్థల జాబితాలో తప్పుగా ఉంచబడిందని, దాని నుండి తొలగించడం చాలా ముఖ్యమైనదని తన తప్పును అంగీకరించడానికి కేంద్ర ప్రభుత్వంకు ఐదు దశాబ్దాలు పట్టింది” అంటూ విచారం వ్యక్తం చేసింది. “ఈ నిషేధం కారణంగా అనేక విధాలుగా దేశానికి సేవ చేయాలనే అనేక మంది కేంద్ర ప్రభుత్వ ఉద్యోగుల ఆకాంక్షలు ఈ ఐదు దశాబ్దాలలో ఆవిరైపోయాయి. ప్రస్తుత విచారణలలో ఈ కోర్టు దృష్టికి తీసుకువెళ్లినప్పుడే దానిని తొలగించారు” అని బెంచ్ పేర్కొంది. 
 
గుప్తా తన న్యాయవాది మనీష్ నాయర్ ద్వారా దాఖలు చేసిన పిటిషన్‌కు కేంద్ర ప్రభుత్వం తన సమాధానం దాఖలు చేయకపోవడంతో 10 నెలలుగా కేసు పెండింగ్‌లో ఉంచడంపై కోర్టు గతంలో తన అసంతృప్తిని వ్యక్తం చేసింది. మే 22న, సొలిసిటర్ జనరల్ ఆఫ్ ఇండియా తుషార్ మెహతా వర్చువల్‌గా కోర్టుకు హాజరయ్యారు. సమాధానం దాఖలు చేయడానికి సమయం కోరారు.
 
 ప్రత్యుత్తరం దాఖలు చేయడంలో జరిగిన జాప్యంపై న్యాయస్థానం ఇలా చెప్పింది: “బహుశా దేశంలో మత సామరస్యం, లౌకిక స్వభావాన్ని కాపాడేందుకు ప్రభుత్వ ఉద్యోగులను ఆర్ఎస్ఎస్ కార్యకలాపాలలో ప్రభుత్వ ఉద్యోగులు పాల్గొనకుండా ఆంక్షలు విధించిన సమయంలో అప్పటి ప్రభుత్వం వద్ద ఏవిధమైన సమాచారం, అధ్యయనం, సర్వే లేదా నివేదిక  ఉండకపోవచ్చు.”
 
“తన పౌరులపై వారి స్వేచ్ఛను, ప్రాధమిక హక్కులను హరించే విధంగా ప్రభుత్వం ఆంక్షలు విధించే సమయంలో ప్రభుత్వం వద్ద నిర్దుష్టమైన సమాచారం, ఆధారాలు, ఆంక్షలను సమర్ధించుకునే విధంగా తగు వివరాలు ఉండటం తప్పనిసరి” అని హైకోర్టు తేల్చి చెప్పింది. ప్రభుత్వ ఉద్యోగులు చేరేకూడని సంస్థల జాబితా నుండి  ఆర్ఎస్ఎస్ ను తొలగిస్తూ జారీచేసిన ఉత్తరువును ప్రస్తావిస్తూ భవిష్యత్ లో ఈ జాబితాలో ఏపేరునైనా చేర్చే కసరత్తు జరిగే సమయంలో తప్పనిసరిగా తగు ఆలోచన పక్రియ జరగాలని ధర్మాసనం స్పష్టం చేసింది.
 
 “ఆర్‌ఎస్‌ఎస్ – దాని అనుబంధ సంస్థలన్నింటితో పాటు ఒక గొడుగు సంస్థగా – కేంద్ర ప్రభుత్వ ఉద్యోగులు పాల్గొనకుండా నిషేధించాల్సిన అవసరం ఎందుకు ఉందనే దానిపై మద్దతు ఇచ్చే గణాంకాలు, స్పష్టమైన ఆధారాలు, సమాచారంతో నిబంధనలు రూపొందించే అధికారం గల వ్యవస్థ అత్యున్నత స్థాయిలలో తీవ్రమైన సమాలోచనలు జరిపి ఉండాల్సింది” అని అభిప్రాయపడింది. 
 
ధర్మాసనం ఇంకా ఇలా పేర్కొంది: “ప్రభుత్వ యంత్రాంగం వెలుపల జాతీయంగా స్థాపించిన ఏకైక స్వయం ఆధారిత స్వచ్ఛంద సంస్థ ఆర్‌ఎస్‌ఎస్ మాత్రమే అనేది ప్రజలకు తెలిసిన సాధారణ విషయం.  ఇది మత, సామాజిక, విద్య, ఆరోగ్యం వంటి అనేక రాజకీయేతర రంగాలలో పనిచేస్తున్నది  అత్యధిక సభ్యత్వాన్ని కలిగి ఉంది. దాని గొడుగు కింద జరిగే కార్యకలాపాలకు రాజకీయాలతో  ఎటువంటి సంబంధం లేదు”.
 
క్షేత్ర స్థాయిలో ఎటువంటి రాజకీయ అభిలాషలు లేకుండా స్వచ్ఛంద సేవకులు పూర్తిగా సమాజ సేవ కోసం రాజకీయేతర కార్యకలాపాలు చేపట్టవచ్చని హైకోర్టు అభిప్రాయపడింది. ఆర్ఎస్ఎస్ అనుబంధ సంస్థలు రాజకీయాలతో సంబంధంలేని కార్యకలాపాలలో పాల్గొనడాన్ని ఈ సందర్భంగా హైకోర్టు ప్రస్తావించింది. ఉదాహరణకు రాష్ట్రీయ సేవా భారతి ఒక బృందంగా జాతీయవాద ఆలోచనలు, దేశభక్తి భావనతో పనిచేస్తుండటాన్ని తెలిపింది. అదే విధంగా లక్షలాది మంది యువకులు పేదరిక నేపథ్యం నుండి ప్రాథమిక, ఉన్నత విద్యను పొందుతున్న సరస్వతి విద్యా మందిర్ లను ప్రస్తావించింది.