మైనింగ్ ప‌న్ను వసూలు చేయడం రాష్ట్రాల హ‌క్కు

మైనింగ్ ప‌న్ను వసూలు చేయడం రాష్ట్రాల హ‌క్కు
మైనింగ్‌పై ప‌న్ను వ‌సూల్ చేసే హ‌క్కు ఆయా రాష్ట్ర ప్ర‌భుత్వాల‌కు కూడా ఉంటుంద‌ని గురువారం సుప్రీంకోర్టు తెలిపింది. 9 మంది స‌భ్యుల రాజ్యాంగ ధ‌ర్మాస‌నం ఈ కేసులో కీల‌క తీర్పును వెలువ‌రించింది. మైనింగ్ ఆప‌రేట‌ర్లు  కేంద్ర ప్ర‌భుత్వానికి ఇస్తున్న రాయాల్టీ ప‌న్ను కాదు అని సుప్రీం ధ‌ర్మాస‌నం తెలిపింది. 
 
ఇక మైనింగ్‌తో పాటు ఖ‌నిజ త‌వ్వ‌కాల కార్య‌క‌లాపాల‌పై ప‌న్ను వ‌సూల్ చేసే హ‌క్కు రాష్ట్రాల‌కు ఉంటుంద‌ని సుప్రీం కోర్టు స్ప‌ష్టం చేసింది. ధ‌ర్మాస‌నంలో సీజేఐ డీవై చంద్ర‌చూడ్‌తో పాటు జ‌స్టిస్ హృషికేశ్ రాయ్‌, అభ‌య్ ఎస్ ఓకా, బీవీ నాగ‌ర్న‌త‌, జేబీ ప‌ర్ధివాలా, మ‌నోజ్ మిశ్రా, ఉజ్వ‌ల్ భుయాన్‌, స‌తీష్ చంద్ర శ‌ర్మ‌, అగ‌స్టిన్ జార్జ్ మాసి, జ‌స్టిస్ నాగ‌రత్న ఉన్నారు.
 
రాష్ట్రాల హ‌క్కుల‌ను స‌మ‌ర్థిస్తూ సుప్రీంలో 8:1 తేడాతో ధ‌ర్మాస‌నం అనుకూల తీర్పునిచ్చింది. జ‌స్టిస్ నాగ‌ర‌త్న ఒక్క‌రే రాష్ట్రాల హ‌క్కుల‌కు వ్య‌తిరేకంగా అభిప్రాయం వ్య‌క్తం చేశారు. 1989లో ఇండియా సిమెంట్ వ‌ర్సెస్ త‌మిళ‌నాడు స‌ర్కారు కేసులోఇచ్చిన తీర్పును తోసిపుచ్చింది. మెజారిటీ న్యాయ‌మూర్తులు చెప్పిన అభిప్రాయాల‌ను జ‌స్టిస్ బీవీ నాగ‌ర్న‌త వ్య‌తిరేకించారు.
 
 సీజేఐ చంద్ర‌చూడ్ తీర్పును చ‌దువుతూ  రాయాల్టీని ప‌న్నుగా చూడ‌లేమ‌ని, ఇండియా సిమెంట్స్ కేసులో రాయాల్టీని ప‌న్నుగా చూప‌డ‌డం స‌రికాదు అని, ప్ర‌భుత్వాన్ని చెల్లించే పేమెంట్స్‌ను ప‌న్నులుగా చూడ‌లేమ‌ని వెల్ల‌డించారు. మైనింగ్ సంబంధిత అంశాల్లో ప‌న్ను విధించే రాష్ట్రాల హ‌క్కుల‌ను కొట్టిపారేయ‌లేమ‌ని ధ‌ర్మాస‌నం అభిప్రాయ‌ప‌డింది.