అంజలి బిర్లాకు వ్యతిరేకంగా పోస్ట్‌లు తొలగించండి

అంజలి బిర్లాకు వ్యతిరేకంగా పోస్ట్‌లు తొలగించండి
లోక్‌సభ స్పీకర్ ఓం బిర్లా కుమార్తె అంజలి బిర్లా ప్రతిష్టకు భంగం కలిగేంచేలా సోషల్ మీడియాలో వైరలవుతున్న పోస్ట్‌లను తొలగించాలని ఎక్స్ కార్పొరేషన్‌తోపాటు గూగుల్ ఇంటర్నేషనల్ కంపెనీని ఢిల్లీ హైకోర్టు మంగళవారం ఆదేశించింది. అందుకు సంబంధించిన పోస్ట్‌లను 24 గంటల్లోగా సోషల్ మీడియా నుంచి తొలగించాలని ఆ యా కంపెనీలకు జారీ చేసిన ఆదేశాల్లో ఢిల్లీ హైకోర్టు స్పష్టం చేసింది. 
 
ఓ వేళ ఆ యా పోస్టులను తొలగించకుండా చర్యలు తీసుకుంటామని ఈ సందర్భంగా స్పష్టం చేసింది.  అయితే ఈ అంశంపై ఎక్స్ కార్పొరేషన్‌, గూగుల్ ఇంటర్నేషనల్ కంపెనీలతోపాటు కేంద్ర హోం మంత్రిత్వ శాఖలోని ఎలక్ట్రానిక్స్ అండ్ ఇన్ఫర్మేషన్ టెక్నాలజీ సైతం నాలుగు వారాల్లో స్పందించాలని ఢిల్లీ హైకోర్టు సూచించింది. 
 
యూపీఎస్సీ పరీక్షల్లో ఉత్తీర్ణత కావడం కోసం తండ్రి, లోక్‌సభ స్పీకర్ ఓం బిర్లా పరపతిని ఆయన కుమార్తె అంజలి బిర్లా ఉపయోంచుకొందంటూ సోషల్ మీడియాలో పోస్టులు వైరలవుతున్నాయి. అంజలి ఇలా యూపీఎస్సీ పరీక్షలకు హాజరై.. అలా సర్వీస్‌లో జాయిన్ అయిందంటూ విమర్శలు సోషల్ మీడియలో వెల్లువెత్తుతున్నాయి. 
 
ఈ నేపథ్యంలో ఢిల్లీ హైకోర్టును అంజలీ బిర్లా ఆశ్రయించింది. దీంతో మంగళవారం ఢిల్లీ హైకోర్టు కీలక ఆదేశాలు జారీ చేసింది.  2019లో అంజలి బిర్లా యూపీఎస్సీ పరీక్షకు హాజరైందని ఆమె తరఫు న్యాయవాది కోర్టుకు తెలిపారు. ఆ క్రమంలో ఆమె ఇండియన్ రైల్వే పర్సనల్ సర్వీస్ (ఐఆర్‌పీఎస్)కు ఎంపికైందని ఆమె తరఫు న్యాయవాది కోర్టుకు స్పష్టం చేశారు.  మరోవైపు 2019 ఎన్నికల్లో మోదీ ప్రభుత్వం వరుసగా రెండోసారి ప్రధానిగా బాధ్యతలు చేపట్టారు. అనంతరం లోక్ సభ స్పీకర్‌గా ఎన్డీయే అభ్యర్థిగా ఓం బిర్లా ఎంపికైన విషయం విధితమే.
తనపై కావాలనే తప్పుగా ప్రచారం చేస్తున్నారని, వాటిని వెంటనే తొలగించాలని అంజలి బిర్లా పిటిషన్​లో పేర్కొన్నారు. ఆ పోస్టులు తన ప్రతిష్ఠను దెబ్బతీసేలా, ప్రజలను తప్పుదోవ పట్టించేలా ఉన్నాయని అంజలి బిర్లా ఆరోపించారు. చాలామంది వ్యక్తులు ఎలాంటి ఆధారాలు లేకున్నా తప్పుడు ప్రచారం చేస్తూ తన వృత్తిని, కుటుంబీకుల ప్రతిష్ఠను దెబ్బతీసేలా కుట్ర చేస్తున్నారని పిటిషన్‌లో ప్రస్తావించారు. ఈ పిటిషన్‌లో ప్రతివాదులుగా కేంద్ర ఎలక్ట్రానిక్స్ అండ్ ఇన్ఫర్మేషన్ టెక్నాలజీ శాఖ, గూగుల్, ఎక్స్, గుర్తుతెలియని సోషల్ మీడియా ఖాతాల నిర్వాహకులను చేర్చారు. ఇటువంటి దుశ్చర్యలకు పాల్పడుతున్న వారందరినీ నిలువరించేలా హైకోర్టు ఆదేశాలు జారీ చేయాలని కోరారు.
ఇటీవలే మహారాష్ట్ర సైబర్ సెల్ ఇన్‌స్పెక్టర్ జనరల్ ఆఫ్ పోలీస్‌కు ఇదే అంశంపై ఫిర్యాదు చేశారు అంజలి. ఆ ఫిర్యాదులో తనపై తప్పుడు ప్రచారం చేస్తున్న ఎక్స్ అకౌంట్ల సమాచారాన్ని సైబర్​ సెల్​కు అందించారు. వారిపై భారత న్యాయ సంహితలోని పలు సెక్షన్ల కింద చర్యలు తీసుకోవాలని కోరారు. ఈ ఫిర్యాదు ఆధారంగా జులై 5న ఎఫ్‌ఐఆర్‌ను నమోదు చేశారు.