ఇవాళ రాజ్యసభలో ప్రసంగించిన నిర్మలమ్మ బడ్జెట్‌లో ఏ రాష్ట్రాన్నీ విస్మరించలేదని స్పష్టం చేశారు. బడ్జెట్ ప్రసంగంలోనే అన్ని రాష్ట్రాల పేర్లను చెప్పలేమంటూ గట్టి కౌంటర్ ఇచ్చారు. కాంగ్రెస్ నేతృత్వంలోని ప్రతిపక్షాలు ఉద్దేశపూర్వకంగానే ప్రజలను తప్పుదోవ పట్టించే ప్రయత్నం చేస్తున్నారని మండిపడ్డారు.
‘కేంద్రం ప్రవేశపెట్టే ప్రతీ బడ్జెట్‌లో దేశంలోని అన్ని రాష్ట్రాల పేర్లనూ ప్రస్తావించే అవకాశం రాదు. నేను చాలా రాష్ట్రాల పేర్లు చెప్పలేదని, కేవలం రెండు రాష్ట్రాల గురించి మాట్లాడానని మల్లికార్జున ఖర్గేగారు అన్నారు. ఈ దేశంలో కాంగ్రెస్ పార్టీ చాలా కాలం అధికారంలో ఉంది. వాళ్లు చాలా భిన్నమైన బడ్జెట్‌లను సమర్పించారు. ప్రతి బడ్జెట్ ప్రసంగంలోనూ దేశంలోని అన్ని రాష్ట్రాల పేర్లూ ప్రస్తావించే అవకాశం మీకు లభించదని స్పష్టంగా తెలుసు’ అంటూ నిర్మలమ్మ గట్టి కౌంటర్ ఇచ్చారు.
బడ్జెట్ ప్రసంగంలో ఒక నిర్దిష్ట రాష్ట్రం పేరును ప్రస్తావించని మాత్రానా ఆ రాష్ట్రానికి కేంద్రం నిధులు వెళ్లవా? అని ప్రశ్నించారు. ప్రధాన మంత్రి నరేంద్ర మోదీ నేతృత్వంలోని కేంద్ర ప్రభుత్వం మహారాష్ట్రలోని వందవన్‌లో అతి పెద్ద ఓడరేవును ఏర్పాటు చేసేందుకు నిర్ణయం తీసుకుందని గుర్తు చేశారు. కానీ, నిన్నటి తన బడ్జెట్ ప్రసంగంలో మహారాష్ట్ర పేరును ప్రస్తావించలేదని పేర్కొన్నారు.
బడ్జెట్ ప్రసంగంలో మహారాష్ట్ర పేరు చెప్పనుందుకు ఆ రాష్ట్రాన్ని విస్మరించినట్లా? అలా అని ఆ రాష్ట్రం తమను కేంద్ర విస్మరించిందని భావిస్తోందా? అని ప్రశ్నించారు. ఆ ప్రాజెక్టుకు రూ.76 వేల కోట్లు ప్రకటించినట్లు ఈ సందర్భంగా నిర్మలమ్మ స్పష్టం చేశారు. ప్రతిపక్షాలు ఉద్దేశపూర్వకంగా ప్రజలను తప్పుదోవ పట్టించే కుట్రలు చేస్తున్నాయని ఆమె దుయ్యబట్టారు.
కాగా, కేంద్ర బడ్జెట్‌కు వ్యతిరేకంగా సమావేశాలకు ముందు కూటమి పార్టీలకు చెందిన ఎంపీలంతా పార్లమెంట్ వద్దకు చేరుకొని ఆందోళన చేపట్టారు. ప్రభుత్వానికి వ్యతిరేకంగా నినాదాలు చేశారు. ప్రభుత్వాన్ని కాపాడుకునేందుకు ప్రవేశ పెట్టిన బడ్జెట్ ఇది అని ఆరోపించారు. కాంగ్రెస్ అధ్యక్షుడు మల్లికార్జున ఖర్గే, సోనియా గాంధీ, రాహుల్ గాంధీ, సమాజ్ వాదీ పార్టీ అధినేత అఖిలేష్ యాదవ్ సహా కూటమి పార్టీల నేతలంతా నిరసన తెలిపారు.
కేంద్ర బడ్జెట్‌లో చాలా మందికి అన్యాయం జరిగిందని ఈ సందర్భంగా కాంగ్రెస్ అధ్యక్షుడు మల్లికార్జున ఖర్గే ఆరోపించారు. ‘ఇది అన్యాయం. న్యాయం కోసం దీనిపై మేము పోరాడుతాం’ అని తెలిపారు. ఈ మేరకు నేతలంతా ఫ్లకార్డులను ప్రదర్శిస్తూ కేంద్ర ప్రభుత్వానికి వ్యతిరేకంగా నినాదాలు చేశారు.

More Stories
బీహార్ లో అన్ని ఎన్నికల రికార్డ్లను బ్రేక్ చేస్తాం
వందేళ్లైనా జంగల్ రాజ్యాన్ని బిహార్ ప్రజలు మరిచిపోరు
బెంగాల్ లో 1000కి పైగా పౌరసత్వ శిబిరాల ఏర్పాట్లలో బీజేపీ