ఏపీ రాజధానికి కేంద్రం రూ.15వేల కోట్లు

ఏపీ రాజధానికి కేంద్రం రూ.15వేల కోట్లు
 
* ప్రత్యేక నిధుల పట్ల నారా లోకేష్ ధన్యవాదాలు
 
ఆంధ్రప్రదేశ్‌ విభజన హామీలను అమలు చేయడానికి కట్టుబడి ఉన్నట్టు కేంద్ర ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్ పార్లమెంటులో ప్రకటించారు. కేంద్ర బడ్జెట్‌లో ఏపీకి ప్రత్యేక నిధులు కేటాయిస్తున్నట్టు తన బడ్జెట్ ప్రసంగంలో ప్రకటించారు. ఆంధ్రప్రదేశ్ అభివృద్ధికి సంపూర్ణ సహకారం అందిస్తామని హామీ ఇచ్చారు.  విభజన హామీలను నెరవేర్చడానికి తమ ప్రభుత్వం కట్టుబడి ఉందని నిర్మలా సీతారామన్‌ చెప్పారు.
విభజన హామీలు, రాజధాని అవసరాన్ని గుర్తించి ప్రత్యేక ఆర్థిక సాయం అందించనున్నట్టు ప్రకటించారు. విభిన్న ఏజెన్సీల సహకారంతో నిధులు సమకూర్చనున్నట్టు చెప్పారు. ప్రస్తుత ఆర్థిక సంవత్సరంలో ఏపీ రాజధాని నిర్మాణానివకి 15వేల కోట్ల రుపాయలు కేటాయిస్తున్నట్టు చెప్పారు. భవిష్యత్తులో మరిన్ని నిధులు కేటాయిస్తామని చెప్పారు.

పోలవరం ప్రాజెక్టు నిర్మాణాన్ని పూర్తి చేయడానికి కట్టుబడి ఉన్నామని నిర్మలా చెప్పారు. భారతదేశ ఆహారభద్రతకు పోలవరం ముఖ్యమని, పోలవరం ప్రాజెక్టుకు అవసరమైన నిధులను కేటాయిస్తామని ప్రకటించారు. పోలవరం ఏపీకి జీవరేఖ అని, ఇది దేశ ఆహార భద్రతకు కూడా కీలకమని చెప్పారు.

దీంతో పాటు ఏపీలో పారిశ్రామిక అభివృద్ధికోసం విశాఖపట్నం – చెన్నై ఇండస్ట్రియల్ కారిడార్ లోని కొప్పర్తి నోడ్, హైదరాబాద్‌- బెంగుళూరు కారిడార్ లోని ఓర్వకల్ నోడ్ కు అదనపు కేటాయింపులు చేస్తున్నట్టు చెప్పారు.  కొప్పర్తి, ఓర్వకల్లు కారిడార్‌లలో పారిశ్రామిక అభివృద్ధి కోసం విద్యుత్, రోడ్, వాటర్ సదుపాయాల కల్పన కోసం నిధులు కేటాయిస్తామని తెలిపారు. ఇందుకోసం ఏపీకి అదనపు కేటాయింపులు చేస్తున్నట్టు ప్రకటించారు. 

 
రాయలసీమ, ప్రకాశం, ఉత్తరాంధ్రలకు వెనకబడిన ప్రాంతాల అభివృద్ధి నిధులతో ప్రత్యేక సాయం అందిస్తున్నట్లు ప్రకటించారు.  ఈశాన్య రాష్ట్రాల అభివృద్ధికి అమలు చేస్తోన్న పూరోదయ పథకాన్ని ఆంధ్రప్రదేశ్, బిహార్‌లోనూ అమలు చేయనున్నట్టు కేంద్రం వెల్లడించింది. ఇందుకు బడ్జెట్‌లో కేటాయింపులు చేశామని తెలిపింది. ఈ పథకాన్ని ఒడిశా, ఝార్ఖండ్, పశ్చిమ్‌ బెంగాల్‌లోనూ అమలవుతుందని తెలిపారు.
 
‘‘ఆంధ్ర ప్రదేశ్ రాజధాని అమరావతి, జీవనాడి పోలవరం ప్రాజెక్టుల పూర్తి కోసం సంపూర్ణ సహకారం అందిస్తామని ప్రకటించిన కేంద్ర ప్రభుత్వానికి ధన్యవాదాలు’’ అని మంత్రి నారా లోకేష్ తెలిపారు. బడ్జెట్లో రూ.15 వేల కోట్లు కేటాయించి ఆంధ్రప్రదేశ్ పునర్నిర్మాణానికి కట్టుబడిన ఎన్డీఏ ప్రభుత్వానికి రాష్ట్ర ప్రజల తరఫున కృతజ్ఞతలు తెలిపారు.