పారిస్ ఒలింపిక్స్‌కు సర్వం సిద్ధం!

పారిస్ ఒలింపిక్స్‌కు సర్వం సిద్ధం!
ప్రపంచ వ్యాప్తంగా కోట్లాది మంది ఎంతో అతృతతో ఎదురు చూస్తున్న సమయం దగ్గర పడుతోంది. ఫ్రాన్స్ రాజధాని పారిస్ వేదికగా విశ్వ క్రీడలు (ఒలింపిక్స్) మరి కొన్ని రోజుల్లో ఆరంభం కానున్నాయి. ఈ క్రీడలను విజయవంతంగా నిర్వహించేందుకు ఫ్రాన్స్ ప్రభుత్వం కళ్లు చెదిరే ఏర్పాట్లు చేస్తోంది. శుక్రవారం నుంచి ఒలింపిక్స్ జరుగనున్నాయి. ఇక సియోన్ నదిపై ఆరంభోత్సవ వేడుకలను నిర్వహించనున్నారు. 

జులై 26 నుంచి ఆగస్టు 11 వరకు జరిగే ఈ క్రీడల్లో ప్రపంచ వ్యాప్తంగా 206 దేశాలు పోటీపడనున్నాయి. మొత్తం 32 క్రీడాంశాల్లో పోటీలు నిర్వహిస్తున్నారు. ఈ క్రమంలో 329 స్వర్ణాల కోసం క్రీడాకారులు తమ అదృష్టాన్ని పరీక్షించుకోనున్నారు. భారత్‌తో సహా వివిధ దేశాల నుంచి దాదాపు 10, 714 మంది క్రీడాకారులు ఒలింపిక్స్‌లో పాల్గొంటున్నారు. 

కాగా, విశ్వ క్రీడల ఆరంభోత్సవానికి నిర్వాహకులు విభిన్నంగా ప్లాన్ చేశారు. ఆరంభ వేడుకలను అథ్లెటిక్స్ స్టేడియాల్లో కాకుండా చారిత్రక సియోన్ నదిపై నిర్వహించేందుకు ప్రణాళికలు రచించారు. దీనికి సంబంధించిన వీడియోను నిర్వాహకులు విడుదల చేశారు. గతానికి భిన్నంగా ఈసారి ఆరంభ వేడుకలను నది ప్రాంగణంలో నిర్వహించడం విశేషం. 

కాగా, ఒలింపిక్స్ ఆరంభోత్సవ వేడుకలు శుక్రవారం జరుగనున్నాయి. శనివారం నుంచి క్రీడలు ఆరంభమవుతాయి. కాగా, ప్రారంభోత్సవ కార్యక్రమంలో దాదాపు ఆరు వేలకు పైగా అథ్లెట్లు సియోన్ నదిపై ఉన్న ఆస్టరిలిట్జ్ బ్రిడ్జ్ నుంచి చారిత్రక ఈఫిల్ టవర్ వైపుగా బార్జెస్, బోట్లపై దూసుకుపోతారు. ఐదు లక్షలకు పైగా అభిమానులు ఈ ఆరంభ వేడుకలను ప్రత్యక్షంగా చూసేందుకు నిర్వాహకులు భారీ ఏర్పాట్లు చేశారు.

దీనికి సంబంధించిన టికెట్లలన్నీ ఇప్పటికే అమ్ముడు పోయినట్టు తెలిసింది. ఒక్కో టికెట్ ధరను రూ.2.50 లక్షలుగా నిర్ణయించారు.  ఇదిలావుంటే స్టేడియాలతో పోల్చితే సియోన్ నదిపై ప్రారంభోత్సవ వేడుకలను నిర్వహించడం కష్టంతో కూడుకున్న అంశంగా చెప్పాలి. అయితే భిన్నమైన పద్ధతిలో దీన్ని నిర్వహిస్తే అభిమానులను అలరించడం ఖాయమని క్రీడల ప్రధాన నిర్వాహక ప్రతినిధి టోనీ వెల్లడించారు.  మరోవైపు ఆరంభ వేడుకల్లో దాదాపు మూడు వేల మంది డ్యాన్సర్లు, సింగర్లు పాల్గొంటున్నారు. శుక్రవారం రాత్రి ఏడు గంటల నుంచి ఆరంభోత్సవ వేడుకలు జరుగనున్నాయి.

ఇలాఉండగా, ఒలింపిక్స్‌లో పాల్గొనేందుకు అంచెలంచెలుగా పారిస్‌కు వెళ్తున్న భారత బృందంలో మరో 49 మంది క్రీడాకారులు సోమవారం ఫ్రాన్స్‌ రాజధానికి చేరుకున్నారు. టేబుల్‌ టెన్నిస్‌, టెన్నిస్‌, ఆర్చరీ, భారత హాకీ, షూటింగ్‌ జట్లకు చెందిన 39 మంది క్రీడాకారులు ఒలింపిక్‌ గ్రామానికి చేరారు. ఇప్పటికే బాక్సింగ్‌, అథ్లెటిక్స్‌ నుంచి పలువురు తొలి అంచెలోనే పారిస్‌కు వెళ్లారు.