మూడో ప్రమాద హెచ్చరిక అంచున భద్రాచలం వద్ద గోదావరి

మూడో ప్రమాద హెచ్చరిక అంచున భద్రాచలం వద్ద గోదావరి
ఎగువన కురుస్తున్న భారీ వర్షాలతో గోదావరి ఉగ్రరూపం దాల్చింది. భద్రాచలం వద్ద నది ప్రవాహం 50.6 అడుగులకు చేరడంతో సోమవారం రెండో ప్రమాద హెచ్చరికను జారీ చేశారు. భద్రాచలం నుంచి ధవళేశ్వరం వరకు ప్రళయగోదావరిని తలపిస్తోంది. సోమవారం అర్ధరాత్రి నుంచి గోదావరి ప్రవాహం అంతకంతకు పెరుగుతూనే ఉంది.
 
నీటి మట్టం 53 అడుగులకు చేరితే భద్రాచలం మూడో ప్రమాద హెచ్చరిక జారీ చేయనున్నారు. భద్రాచలం వద్ద నాలుగు రోజులుగా క్రమంగా పెరుగుతూ వచ్చిన ప్రవాహం.. సోమవారం అర్ధరాత్రి వరకు 50.6 అడుగులకు చేరింది. వరద ప్రవాహం అంతకంతకూ పెరుగుతుండటంతో అధికారులు అప్రమత్తమయ్యారు. లోతట్టు ప్రాంతాల ప్రజలను సురక్షిత ప్రదేశాలకు తరలించారు.
 
గోదావరం ఉధృతితొ దేవస్థానానికి సంబంధించిన స్నానఘట్టాల వద్ద ఉన్న కల్యాణ కట్ట కింది భాగం పూర్తిగా మునిగిపోయింది. ముంపు బారిన పడే అవకాశం ఉందన్న అంచనాతో 111 గ్రామాల ప్రజలను అధికార యంత్రాంగం ఇప్పటికే అప్రమత్తం చేసింది. తుది ప్రమాద హెచ్చరిక జారీ చేస్తే.. దుమ్ముగూడెం, చర్ల మండలాల్లోని పలు గ్రామాల్లోకి నీరు చేరే అవకాశం ఉందని అంచనా వేస్తున్నారు.
 

మరోవైపు ధవళేశ్వరం వద్ద గోదావరి ఉద్ధృతి క్రమంగా పెరుగుతోంది. ఇక్కడ మొదటి ప్రమాద హెచ్చరిక కొనసాగుతోంది. గోదావరి నీటిమట్టం 13.3 అడుగులకు చేరింది. రెండో ప్రమాద హెచ్చరికకు వరద చేరువవుతోంది. ఎగువ నుంచి భారీ మొత్తంలో నీరు వచ్చే అవకాశం ఉండటంతో.. ముందస్తుగా 12,500 క్యూసెక్కుల చొప్పున నీటిని సముద్రంలోకి విడుదల చేస్తున్నారు. పి. గన్నవరం, ఐనవిల్లి, రాజోలు, కొత్తపేట, ముమ్మిడివరం లంకల్లో వరదనీరు చుట్టుముట్టింది. లంక గ్రామాల ప్రజలు పడవలపైనే రాకపోకలు సాగిస్తున్నారు.

 
మేడిగడ్డ వద్ద ఏకంగా 9 మీటర్ల ఎత్తున ప్రవాహం కొనసాగుతోంది. మరోవైపు కృష్ణా బేసిన్‌లోని శ్రీశైలానికి భారీ వరద వస్తోంది. జూరాలతోపాటు తుంగభద్ర నుంచీ నీటిని విడుదల చేయడంతో సుమారుగా 2లక్షల క్యూసెక్కుల ప్రవాహం శ్రీశైలానికి వచ్చి చేరుతోంది. రాష్ట్రంలో వర్షాలు కాస్త తగ్గుముఖం పట్టినా.. పలు వాగులు, వంకలు ఇంకా ఉప్పొంగి ప్రవహిస్తూనే ఉన్నాయి. కొన్ని జిల్లాల్లో కల్వర్టులు, రోడ్లు కొట్టుకుపోగా.. వేలాది ఎకరాల్లో పంటలు నీట మునిగాయి. 
 
మరోవైపు.. వచ్చే మూడు రోజుల పాటు రాష్ట్ర వ్యాప్తంగా వర్షాలు కురుస్తాయని వాతావరణ శాఖ హెచ్చరించడంతో.. అధికార యంత్రాంగం అప్రమత్తంగా ఉండాలని, ముందు జాగ్రత్త చర్యలు చేపట్టాలని,  రాష్ట్ర వ్యాప్తంగా అన్ని జిల్లాల కలెక్టర్లు అప్రమత్తంగా ఉండాలని సీఎస్‌ శాంతి కుమారి ఆదేశించారు. డీజీపీ జితేందర్‌తో కలిసి కలెక్టర్లతో ఆమె సమీక్ష నిర్వహించారు. కృష్ణా బేసిన్‌లో ఎగువ నుంచి భారీ వరద వస్తుండడంతో ఆల్మట్టి, నారాయణపూర్‌, జూరాల ప్రాజెక్టులు పూర్తిగా నిండిపోయాయి.