ఇది యువతరం కలలను నెరవేర్చే బడ్జెట్‌

ఇది యువతరం కలలను నెరవేర్చే బడ్జెట్‌
ఇవాళ ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్‌ లోక్‌సభలో ప్రవేశపెట్టిన బడ్జెట్‌ మధ్య తరగతి ప్రజలకు భరోసా ఇచ్చే బడ్జెట్‌ అని ప్రధాని నరేంద్రమోదీ కొనియాడారు. దళితులు, అణగారిన వర్గాలకు శక్తినిచ్చే బడ్జెట్‌ అని పొగిడారు. మహిళల ఆర్థిక స్వావలంబనకు, చిరు వ్యాపారులు, ఎంఎస్‌ఎంఈల అభివృద్ధికి కొత్త బాటలు వేశామని ఆయన వ్యాఖ్యానించారు. మౌలిక, తయారీ రంగాలను బలోపేతం చేసేలా బడ్జెట్‌ ఉందని ప్రధాని తెలిపారు. దేశ ఆర్థికాభివృద్ధికి ఈ బడ్జెట్‌ దోహదం చేస్తుందని చెప్పారు. ఉద్యోగ కల్పన, స్వయం ఉపాధికి తాము ప్రాధాన్యం ఇచ్చామని అన్నారు. ఎంప్లాయిమెంట్‌ లింక్డ్‌ స్కీమ్‌ ద్వారా కొత్త ఉద్యోగాల కల్పన జరుగుతుందని పేర్కొన్నారు. కొత్త ఉద్యోగులకు తొలి జీతం తమ ప్రభుత్వమే ఇస్తుందని ఆయన తెలిపారు.

కోటి మందికి ఇంటర్న్‌షిప్‌ అవకాశం కల్పిస్తున్నామని, ఇంటర్న్‌షిప్‌ ద్వారా గ్రామీణులకూ పెద్ద కంపెనీల్లో పనిచేసే అవకాశం ఉంటుందని ప్రధాని మోదీ చెప్పారు. బడ్జెట్‌లో నైపుణ్యాభివృద్ధికి పెద్దపీట వేశామని, ఇది యువతరం కలలు నెరవేర్చే బడ్జెట్‌ అని ప్రశంసించారు. గ్రామ స్థాయి నుంచి మహానగరం వరకు ఆశావహులు అందిరినీ వ్యాపారవేత్తలను చేయడమే తమ లక్ష్యమని చెప్పారు.

ముద్రా రుణాల పరిధిని రూ.10 లక్షల నుంచి రూ.20 లక్షల వరకు పెంచామని ప్రధాని తెలిపారు. భారత్‌ను గ్లోబల్‌ మాన్యుఫాక్చరింగ్‌ హబ్‌గా మారుస్తున్నామని అన్నారు. ఎంఎస్‌ఎంఈలకు రుణాలు అందించేందుకు కొత్త పథకం తీసుకొస్తున్నామని చెప్పారు.

ఉపాధి కల్పనకు నూతన అధ్యాయం

కేంద్ర ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్ 2024-25 ఆర్థిక సంవత్సరానికి ప్రవేశ పెట్టిన బడ్జెట్ ఉపాధి, అవకాశాల కల్పనకు కొత్త అధ్యాయం కల్పించిందని కేంద్ర హోంశాఖ మంత్రి అమిత్ షా వ్యాఖ్యానించారు. సంపన్న దేశంగా అవతరించేందుకు మార్గం సుగమం చేసిందని పేర్కొన్నారు. 

 
ఈజ్ ఆఫ్ డూయింగ్ బిజినెస్, పారిశ్రామిక కేంద్రంగా భారత్ ఆర్థిక వృద్ధి రేటును ప్రోత్సహించేందుకు ప్రధాని నరేంద్రమోదీ అచంచలమైన నిబద్ధతకు ప్రతిబింబంగా కేంద్ర బడ్జెట్ ఉందని మంగళవారం ‘ఎక్స్ (మాజీ ట్విట్టర్)’ వేదికగా పోస్ట్ పెట్టారు. ఆదాయం పన్ను అంచనా నిబంధనలను సరళతరం చేయడం ద్వారా వేతన జీవులకు ఉపశమనం కల్పించిందని తెలిపారు.
 
బడ్జెట్ ఫర్ వికసిత్ భారత్ అనే హ్యాచ్ ట్యాగ్‌  పై ఎక్స్ ఖాతాలో పోస్ట్ పెట్టిన అమిత్ షా.. భారతీయుల విశ్వాసం, ఆశలు, ఆకాంక్షలకు కేంద్ర బడ్జెట్ ప్రతిబింబంలా నిలిచిందని తెలిపారు. రైతులకు పలు అవకాశాలు కల్పించడంతోపాటు మహిళలు, యువతకు సాధికారత కల్పించే దిశగా అడుగులేసిందని కొనియాడారు. తద్వారా సంపన్న దేశంగా, స్వయం సమృద్ధి భారత్ నిర్మాణానికి బడ్జెట్ కీలక ముందడుగు వేసిందని పేర్కొన్నారు.
 
 ‘ప్రజానుకూల, అభివృద్ధి అనుకూల మార్గదర్శన బడ్జెట్ ప్రవేశపెట్టినందుకు ప్రధాని నరేంద్రమోదీ, కేంద్ర ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్‌లకు హృదయపూర్వక ధన్యవాదాలు తెలుపుతున్నా’ అని చెప్పారు.

కుర్సీ బచావో బడ్జెట్

కేంద్ర ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్ ప్రవేశ పెట్టిన బడ్జెట్ ప్రతిపాదనలపై కాంగ్రెస్ పార్టీ అగ్రనేత, లోక్ సభలో విపక్ష నేత రాహుల్ గాంధీ పెదవి విరిచారు. బడ్జెట్ ‘కేవలం అధికార పీఠాన్ని కాపాడుకునేందుకు ప్రవేశ పెట్టిన బడ్జెట్ (కుర్సీ బచావో బడ్జెట్) అని ‘ఎక్స్ (మాజీ ట్విట్టర్)’ వేదికగా పోస్ట్ చేశారు. బీజేపీ తన మిత్ర పక్షాలను బుజ్జగించేందుకు బూటకపు హమీలు గుప్పించి, ఇతర రాష్ట్రాలకు మొండి చేయి చూపిందని ఆరోపించారు.
 
గత బడ్జెట్లు, కాంగ్రెస్ పార్టీ 2024 లోక్ సభ ఎన్నికల మేనిఫెస్టోలో పేర్కొన్న ముఖ్యాంశాలను అరువు తెచ్చుకుని ‘కాపీ అండ్ పేస్ట్’ బడ్జెట్ ను నిర్మలా సీతారామన్ ప్రవేశ పెట్టారని ఎద్దేవా చేశారు.
 
‘క్రోనీ క్యాపిటలిస్టులను బుజ్జగించే బడ్జెట్.. అంబానీ అదానీల పేర్లు వచ్చేలా ఏఏలకు రిలీఫ్ కల్పించే బడ్జెట్.. సామాన్యుడికి నో రిలీఫ్’ అని రాహుల్ గాంధీ తెలిపారు. భారీ నిరుద్యోగ సమస్య జాతీయ సంక్షోభంగా మారిందని కేంద్ర ప్రభుత్వం వ్యూహాత్మకంగా అంగీకరించిందని కాంగ్రెస్ పార్టీ పేర్కొంది. రాజకీయ అనివార్యతలు తప్పనిసరిగా మారిందని పేర్కొంది.
 
తాజా బడ్జెట్‌ తనను తీవ్ర నిరాశకు గురిచేసిందని కాంగ్రెస్‌ పార్టీ జాతీయ అధ్యక్షుడు మల్లికార్జున్ ఖర్గే తెలిపారు.  ‘ఈ బడ్జెట్‌ ఒక నిరుత్సాహపర్చే బడ్జెట్‌. ఇది కేవలం అధికార పీఠాన్ని కాపాడుకునే బడ్జెట్‌. రైతులు పండించిన పంటలకు మద్దతు ధర, ఎరువులపై రాయితీకి సంబంధించి ఈ బడ్జెట్‌లో ప్రకటన చేస్తారని మేం ఆశించాం. కానీ ప్రభుత్వం ఆ ప్రస్తావనే తీసుకురాలేదు. ఈ మధ్య కాలంలో రైల్వే ప్రమాదాలు బాగా పెరిగిపోయాయి. కానీ రైల్వే ట్రాక్‌లను మెరుగుపర్చడంపైగానీ, రైల్వే ప్రయాణికుల భద్రతపైగానీ ప్రభుత్వం దృష్టి సారించకపోవడం దురదృష్టకరం’ అని ఖర్గే విచారం వ్యక్తం చేశారు.
 
అధికారాన్ని కాపాడుకోవడంపైనే ప్రధాని నరేంద్రమోదీ దృష్టి పెట్టారని సమాజ్ వాదీ పార్టీ అధ్యక్షుడు, కన్నౌజ్ ఎంపీ అఖిలేశ్ యాదవ్ ఆరోపించారు. ప్రస్తుత ఆర్థిక సంవత్సరం (2024-25) బడ్జెట్‌లో ఆంధ్రప్రదేశ్, బీహార్ రాష్ట్రాలకు భారీ కేటాయింపులు చేశారు. కేంద్రంలోని మోదీ సర్కార్ మనుగడ కొనసాగాలంటే ఆంధ్రప్రదేశ్, బీహార్ రాష్ట్రాలు చాలా ముఖ్యం అని గుర్తు చేశారు. దేశంలోనే అతిపెద్ద రాష్ట్రం ఉత్తరప్రదేశ్‌కు బడ్జెట్ కేటాయింపులు ఎందుకు లేవని అఖిలేశ్ యాదవ్ ప్రశ్నించారు. 
 
‘ఒకవేళ ప్రభుత్వం మనుగడ కాపాడుకోవాలంటే బీహార్, ఆంధ్రప్రదేశ్ రాష్ట్రాలకు ప్రత్యేక పథకాలు ప్రకటించడం మంచి విషయం. కానీ, దేశానికి ప్రధానమంత్రిని అందించిన ఉత్తరప్రదేశ్ రాష్ట్రానికి, ఆ రాష్ట్ర రైతాంగం కోసం ఏదేనా పెద్ద నిర్ణయం ప్రకటించారా? రైతుల పంటల దిగుబడి పెంపు, పంటల ధరల పెంపునకు ఏ నిర్ణయమైనా తీసుకున్నారా?’ అని నిలదీశారు.