
పోలవరం తొలిదశ పనుల కోసం రూ.12,157 కోట్ల విడుదలకు కేంద్ర ప్రభుత్వం సానుకూలంగా స్పందించినట్టు ఏపీ ప్రభుత్వ ప్రతినిధులు తెలిపారు. 2024 జూన్ వరకు పోలవరం ప్రాజెక్టు నిర్మాణంపై రూ. 21,898.28 కోట్లు ఖర్చు చేయగా అందులో రూ. 17,167.57 కోట్లను ప్రాజెక్టుకు జాతీయ హోదా వచ్చిన తర్వాత ఖర్చు చేశారు. ఇందులో ఇప్పటివరకు రూ.15,146.27 కోట్లను కేంద్ర ప్రభుత్వం తిరిగి చెల్లించింది. మరో రూ. 2021.30 కోట్ల రావాల్సి ఉంది. వాటిని కూడా విడుదల చేయాలని కోరారు.
విశ్వసనీయ వర్గాల సమాచారం ప్రకారం పోలవరం ప్రాజెక్టులో ప్రస్తుతం మిగిలిన ఉన్న పని ఎర్త్ కమ్ రాక్ ఫిల్ డ్యామ్ మాత్రమే. ఈసిఆర్‌ఎఫ్ డ్యామ్ నిర్మాణం చేపట్టడానికి సాంకేతికంగా అవరోధాలు ఎదురయ్యాయి. 2019-20 మధ్య కాలంలో వరదల్లో డయాఫ్రం వాల్ దెబ్బతింది. గోదావరి ఉపరితలం నుంచి భూమి లోపల రాతి పొరలు తగిలే వరకు తవ్వుకుంటూ నిర్మించిన డయా ఫ్రం వాల్ పలు చోట్ల వరద ఉధృతికి కొట్టుకుపోయింది.
డయాఫ్రం వాల్‌కు రెండు వైపులా కాఫర్ డ్యామ్‌లను నిర్మించినా కొన్ని చోట్ల గ్యాప్‌లు ఉండటంతో డయాఫ్రం వాల్ పూర్తిగా దెబ్బతింది. దీంతో ప్రాజెక్టులో కీలకమైన ఈసీఆర్‌ఎఫ్ డ్యామ్ పనులు నిలిచిపోయాయి. 2019-22 వరకు వరుసగా వచ్చిన వరదలతో పాటు అంతకు ముందు 2016-19 మధ్య వచ్చిన వరదల్లో కూడా ఇది దెబ్బతిని ఉంటుందనే వాదనలు ఉన్నాయి.
2019లో వైసీపీ అధికారంలోకి వచ్చిన వెంటనే పోలవరం నిర్మాణ పనుల నుంచి నవయుగ సంస్థను తప్పించి రివర్స్ టెండరింగ్‌లో మేఘాకు పనులు అప్పగించారు. 2024 ఎన్నికల్లో వైసీపీ ఓటమి పాలై టీడీపీ అధికారంలోకి వచ్చింది. ఈ నేపథ్యంలో పోలవరం నిర్మాణ పనులపై ఏం జరుగుతుందనే ఆసక్తి కూడా అందరిలో ఉంది.
కాంట్రాక్టు సంస్థ విషయంలో వైసీపీ మాదిరే టీడీపీ వ్యవహరిస్తుందా? అనే అనుమానాలు కూడా వ్యక్తమయ్యాయి. దీనిపై ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గతంలోనే స్పష్టత ఇచ్చారు. ప్రాజెక్టు నిర్మాణాన్ని పూర్తి చేయడమే తమ ముందున్న లక్ష్యమని అధికారంలోకి వచ్చిన వెంటనే చెప్పారు.
ప్రస్తుతం పోలవరంలో ఈసీఆర్‌ఎఫ్ డ్యామ్ నిర్మాణమే మిగిలి ఉన్నట్టు తెలుస్తోంది. అందులో డయాఫ్రం వాల్ నిర్మాణం జర్మనీ కి చెందిన బావర్ కంపెనీ నిర్మిస్తుంది. ప్రాజెక్టు నిర్మాణంలో ఏ కంపెనీ వచ్చినా డయాఫ్రం వాల్ నిర్మాణాన్ని ఆ కంపెనీ చేయాల్సి ఉంటుంది. 2015-16లో కూడా డయా ఫ్రం వాల్ నిర్మాణ పనులు బావర్ కంపెనీ చేపట్టింది.
ఇప్పుడు కూడా వాళ్ళే చేయాల్సి ఉంటుంది. డయాఫ్రం వాల్ టెక్నాలజీ పేటెంట్ బావర్ కంపెనీ వద్ద మాత్రమే ఉంది. దీంతో బావర్ కంపెనీ తోనే మళ్లీ పనులు చేయించాల్సి ఉంటుంది. ఆ పనిని బావర్‌కు సబ్ కాంట్రాక్ట్ ఇచ్చిపూర్తి చేయించాల్సి ఉంటుంది. మిగతా రాక్ ఫిల్లింగ్ వర్క్ మాత్రం కాంట్రాక్టర్ చేయాల్సి ఉంటంది. మరో వైపు డయాఫ్రం వాల్ కు సంబందించిన కొత్త డిజైన్లు రావాల్సి ఉంది. కొత్త గోడను కట్టాలా పాత దానికి రిపేర్లు చేయాలా అన్నది కూడా తేల్చాల్సి ఉంది. వాటిపై కేంద్రం స్పష్టత వచ్చాకే పనులు ప్రారంభం కానున్నాయి.
More Stories
బీజేపీ శాసనసభాపక్ష నేత ఏలేటి మహేశ్వర్ రెడ్డి అరెస్ట్
కుంభమేళా విజయవంతం.. సమిష్టి కృషికి నిదర్శనం
నాగ్‌పుర్‌లో ఉద్రిక్త పరిస్థితులు.. పలు ప్రాంతాల్లో కర్ఫ్యూ