ఐఏఎస్‌ స్మితా సబర్వాల్ వ్యాఖ్యలపై దుమారం

ఐఏఎస్‌ స్మితా సబర్వాల్ వ్యాఖ్యలపై దుమారం
ఆలిండియా సర్వీసులకు ఎంపికలపై దివ్యాంగుల కోటా కల్పించడంపై తెలంగాణ ఐఏఎస్‌ అధికారిణి స్మితా సభర్వాల్‌ ట్విట్టర్‌లో చేసిన వ్యాఖ్యలు వైరల్‌గా మారాయి. ఆమె చేసిన వ్యాఖ్యలపై తీవ్ర వ్యతిరేకత వ్యక్తమైంది. శారీరక వైకల్యంతో ఉన్న వారిని అవమానించేలా, వారి శక్తి సామర్థ్యాలను కించ పరిచారని ఆగ్రహం వ్యక్తమైంది. 
 
స్మితా సబర్వాల్‌ వ్యాఖ్యలపై దివ్యాంగుల సంఘాలతో పాటు రాజకీయ నాయకులు, న్యాయవాదులు, హక్కుల సంఘాల ప్రతినిధులు తప్పు పట్టారు.
దేశ వ్యాప్తంగా ట్రైనీ ఐఏఎస్ అధికారి పూజా ఖేడ్కర్‌ అడ్డదారిలో ఎంపిక కావడం, ట్రైనీగా ఉన్న సమయంలో చెలరేగిపోలవడం దేశ వ్యాప్తంగా చర్చనీయాంశంగా మారింది. 
 
ఈ క్రమంలో ఎక్స్‌లో ఆదివారం ఉదయం ఆమె వరుస ట్వీట్లు చేశారు. దివ్యాంగులపై తనకు గౌరవం ఉందని పేర్కొంటూనే ఆలిండియా సర్వీస్‌లలో వారి ఎంపికను స్మితా తప్పుబట్టారు. విమానయాన సంస్థలు దివ్యాంగులను పైలట్‌గా నియమిస్తాయా? వైకల్యం కలిగిన సర్జన్‌‌పై నమ్మకంతో ఉంచుతారా? 
 
ఆలిండియా సర్వీసులైన ఐఏఎస్, ఐపీఎస్, ఐఎఫ్‌వోఎస్‌లు క్షేత్రస్థాయిలో పనిచేయాల్సినవని, రోజులో ఎక్కువ గంటలు ప్రయాణం చేయాల్సి ఉంటుందని, ప్రజల ఫిర్యాదులను ఓపికగా వినాల్సి ఉంటుందని, ఈ పనులకు శారీరక దృఢత్వం చాలా అవసరమని పేర్కొంటూ  ఇలాంటి అత్యున్నత సర్వీసులో దివ్యాంగుల కోటా ఎందుకవసరంమని ఆమె ప్రశ్నించారు.

కొన్నిసార్లు కఠిన సమయాల్లో పని చేయాల్సి ఉంటుందని తన ట్విటర్‌ పోస్టులో ప్రస్తావించారు. ఆమె వ్యాఖ్యలపై ట్విటర్‌లో, బయటా పెద్ద ఎత్తున విమర్శలు వ్యక్తమయ్యాయి. స్మితా సభర్వాల్‌ చేసిన వ్యాఖ్యలు ట్విట్టర్‌లో వైరల్‌గా మాారయి. ఆమె తీరును పలువురు ఖండించారు. స్మితా సబర్వాల్‌ వెంటనే దివ్యాంగులకు క్షమాపణలు చెప్పాలని పలు సంఘాలు సోషల్ మీడియాలో డిమాండ్‌ చేస్తున్నాయి. 

 
స్మితా పోస్ట్‌ చూస్తోంటే కొందరు బ్యూరోక్రాట్లు తమ పరిమిత ఆలోచనలు, ప్రత్యేక అధికారాలు ఎలా చూపిస్తున్నారో అర్థమవుతోందని ఎంపీ ప్రియాంకా చతుర్వేది ఎక్స్‌లో పేర్కొన్నారు. స్మితా సభర్వాల్‌ వ్యాఖ్యలు అభ్యంతరకరంగా ఉన్నాయని, ఆమె క్షమాపణలు చెప్పాలని తెలంగాణ దివ్యాంగుల ఆర్థిక సహకార సంస్థ ఛైర్మన్‌ వీరయ్య డిమాండ్‌ చేశారు.

సివిల్స్‌ ఎంపికల్లో దివ్యాంగులకు రిజర్వేషన్లు కల్పించడంపై స్మిత సభర్వాల్ చేసిన వ్యాఖ్యల్ని ఉపసంహరించుకోవాలని మాజీ సివిల్‌ సర్వెంట్‌, సివిల్స్‌ పరీక్షల శిక్షకురాలు బాలలత డిమాండ్‌ చేశారు. స్మితా ఏ అధికారంతో ఈ వ్యాఖ్యలు చేశారని ప్రశ్నించారు.  ప్రత్యేక చట్టం ద్వారా అమల్లోకి వచ్చిన దివ్యాంగుల కోటాపై ఉన్నత స్థానంలో ఉన్న ఒక అధికారి ఈ విధంగా వ్యాఖ్యానించడం సరికాదంటూ ఆమె తన వ్యాఖ్యలను ఉపసంహరించుకోవాలని ఆమె డిమాండ్ చేశారు.