
జిల్లాలో భారీ వర్షాల కారణంగా వాగులు, వంకలు, నదుల వద్ద ప్రవాహం అధికంగా ఉందని, ప్రజలు అత్యవసరమైతే తప్ప బయటికి రావద్దని జిల్లా ఎస్పీ రోహిత్ రాజు ఒక ప్రకటనలో హెచ్చరించారు. జలాశయాలు, చెరువులు, వాగుల వద్దకు సెల్ఫీలు దిగడానికి, చేపలు పట్టడానికి ఎవరు వెళ్లకూడదని విజ్ఞప్తి చేశారు. వరద నీటితో ప్రమాదకరంగా మారిన రోడ్లను దాటడానికి ప్రయత్నించి ప్రమాదాల బారిన పడవద్దని సూచించారు.
విపత్కర సమయాల్లో డయల్ 100కు ఫోన్ చేసి తక్షణమే పోలీసు వారి సహాయం పొందాలని తెలియజేసారు. ఎగువన కురుస్తున్న వర్షాల కారణంగా భద్రాచలం వద్ద గోదావరి నది ఉద్ధృతంగా ప్రవహిస్తుందని, లోతట్టు ప్రాంత ప్రజలు అప్రమత్తంగా ఉండాలని సూచించారు. పోలీసులు చేపట్టే చర్యలకు జిల్లా ప్రజలందరూ సహకరించాలని విజ్ఞప్తి చేశారు.
భద్రాచలం వద్ద గోదావరి రెండో ప్రమాద హెచ్చరిక స్థాయిని దాటితే భద్రాచలం పట్టణం ముంపునకు గురవుతుందని నీటిపారుదలశాఖ ప్రకటించింది. 48 అడుగుల స్థాయి నుంచే పలు గ్రామాలకు ముప్పు మొదలవుతుందని సూచించింది. 2022లో 73 అడుగుల స్థాయిని దాటిన సంగతి తెలిసిందే. ఈ నేపథ్యంలో ప్రజలను అప్రమత్తం చేసేందుకు ఏ మట్టం స్థాయిలో ఏ గ్రామం ప్రభావితమవుతుందనే వివరాలను నీటిపారుదలశాఖ పోర్టల్లో ఉంచినట్లు ఇంజినీర్ ఇన్ చీఫ్ అనిల్ కుమార్ తెలిపారు.
అదేవిధంగా ములుగు జిల్లా ఏటూరునాగారం మండలం రామన్నగూడెం పుష్కర ఘాట్ వద్ద గోదారమ్మ మొదటి ప్రమాద హెచ్చరిక దాటి ప్రవహిస్తున్నది. మొదటి ప్రమాద హెచ్చరిక 14.830 మీటర్లు కాగా, ప్రస్తుతం 15.130 మీటర్లు వుంది. ఈ నేపథ్యంలో లోతట్టు ప్రాంతాల ప్రజలు జాగ్రతగా ఉండాలని అధికారులు హెచ్చరించారు.
More Stories
ఓ ఉగ్రవాది అరెస్టుతో ఉలిక్కిపడ్డ బోధన్
జూబ్లీ హిల్స్ లో బిఆర్ఎస్ అభ్యర్థి మాగంటి సునీత
కాళేశ్వరం రూ. లక్ష కోట్ల అవినీతిపై సిబిఐ విచారించాలి