
వంధ్యత్వ సంక్షోభం దిశగా భారత్ వెళ్తోందని మన దేశంలోని అతిపెద్ద ఫెర్టిలిటీ ఛైన్ ‘ఇందిరా ఐవీఎఫ్’ వ్యవస్థాపకుడు డాక్టర్ అజయ్ ముర్దియా హెచ్చరించారు. ఇది అత్యంత ఆందోళనకర అంశమని ఆయన చెప్పారు. రాబోయే కొన్నేళ్లలో వంధ్యత్వ సంక్షోభం ప్రభావంతో మన దేశ జనాభా సమీకరణాలు పూర్తిగా మారిపోతాయని స్పష్టం చేశారు.
ఫలితంగా సామాజికంగా, ఆర్థికంగా ప్రతికూల ప్రభావాలను చవిచూడాల్సి వస్తుందని డాక్టర్ అజయ్ ముర్దియా పేర్కొన్నారు. ఇది కేవలం కుటుంబాల వ్యక్తిగత సమస్యకాదని భారతదేశ ఆర్ధిక వృద్ధి, సామజిక సుస్థిరతను సవాల్ చేస్తుందని ఆయన హెచ్చరించారు. జులై 25న ప్రపంచ కృత్రిమ గర్భధారణ(ఐవీఎఫ్) దినం సందర్భంగా ఓ వార్తాసంస్థకు ఇచ్చిన ఇంటర్వ్యూలో ఆయన ఈ హెచ్చరిక చేశారు.
“మన దేశంలో ఏటా దాదాపు 2.75 కోట్ల మంది పెళ్లి అయిన జంటలు సహజంగా సంతాన భాగ్యాన్ని పొందలేకపోతున్నారు. అయితే వీరంతా ఐవీఎఫ్ చికిత్స చేయించులేకపోతున్నారు. ప్రతి సంవత్సరం కేవలం 2.75 లక్షల మంది మాత్రమే ఐవీఎఫ్ చికిత్స చేయించుకుంటున్నారు” అని డాక్టర్ అజయ్ ముర్దియా తెలిపారు. వంధ్యత్వం అనేది దేశంలోని ప్రతి ఆరు వివాహిత జంటలలో ఒకరిని ప్రభావితం చేస్తోందని చెప్పారు.
జాతీయ కుటుంభం ఆరోగ్య సర్వే ప్రకారం దేశంలో వంధ్యత్వం పట్టణ ప్రాంతాలలో 1.6 శాతం, గ్రామీణ ప్రాంతాలలో 2.1 శాతం ఉంది. 2050 నాటికి వంధత్వం 1.29 శాతం ఉంటుందని భావిస్తున్నారు. అంటే పునరుత్పత్తి అవసరమైన 2.1 శాతంకన్నా చాలా తక్కువగా అంటుంది. దీని కారణంగా దేశంలో పనిచేసేవారి సంఖ్య గణనీయంగా పడిపోతుంది.
హార్మోన్ల సమస్యలు, పెరుగుతున్న ఔషధాల వినియోగం, మారుతున్న జీవనశైలి కారణంగా భారత్‌లో యువతను వంధ్యత్వ ముప్పు అలుముకుంటోందని డాక్టర్ అజయ్ ముర్దియా తెలిపారు. ఫలితంగా ఎంతో మంది సంతాన భాగ్యానికి నోచుకోవడం లేదని చెప్పారు. ఆర్థికంగా బలంగా ఉన్నవారే ఐవీఎఫ్ చికిత్స చేయించుకొని సంతానం పొందుతున్నారని తెలిపారు.
ప్రస్తుతం ప్రపంచంలో అత్యధికంగా యువజనాభా గల దేశంగా చెప్పుకుంటున్నాము. అయితే వంధత్వ సమస్య దేశంలో యువజనాభాను తగ్గించడంతో పాటు వృద్ధుల సంఖ్యను పెంచుతుంది అని ఆయన తెలిపారు. అందుకనే వందత్వాన్ని జాతీయ సమస్యగా గుర్తించాలని ఆయన స్పష్టం చేశారు.
“ఇప్పుడు మన దేశంలో యువత జనాభా అత్యధికంగా ఉంది. వంధ్యత్వ సంక్షోభం మరింత విస్తరిస్తే దేశంలో జనాభా పెరుగుదల రేటు తగ్గిపోతుంది. ఫలితంగా భవిష్యత్తులో మనదేశంలో వృద్ధుల జనాభా పెరిగిపోతుంది. ఇప్పటికే కొన్ని ఆసియా దేశాలు ఈ తరహా సవాల్‌ను ఎదుర్కొంటున్నాయి” అని డాక్టర్ అజయ్ ముర్దియా వివరించారు.
ఈ పరిస్థితి రాకూడదంటే భారత ప్రభుత్వం ఉచితంగా లేదా రాయితీపై దేశ ప్రజలకు ఐవీఎఫ్ చికిత్సను పొందే సదుపాయాన్ని కల్పించాలని ఆయన సూచించారు. ప్రభుత్వ మెటర్నిటీ వైద్య నిపుణులకు ఐవీఎఫ్ చికిత్సా పద్ధతులపైనా శిక్షణ అందించాల్సిన అవసరం ఉందని ఆయన చెప్పారు. ప్రభుత్వ ఆస్పత్రులలోనూ ఐవీఎఫ్ చికిత్సా యూనిట్ల ఏర్పాటుకు ప్రభుత్వాలు చొరవచూపితే మంచిదని సూచించారు.
More Stories
మహిళా జర్నలిస్టులు లేకుండా ఆఫ్ఘన్ మీడియా సమావేశం
లులూ ఫుడ్ పార్క్ లో గోవధ చేస్తారా? మంత్రివర్గంలో ప్రశ్నించిన పవన్
ఆర్ఎస్ఎస్: సైద్ధాంతిక పరిణామ శతాబ్దం