ఉధృతంగా ప్రవహిస్తున్న గోదావరి.. ప్రమాద హెచ్చరికలు

ఉధృతంగా ప్రవహిస్తున్న గోదావరి.. ప్రమాద హెచ్చరికలు
గత కొద్ది రోజులుగా ఎగువ ప్రాంతాల్లో కురుస్తోన్న భారీ వర్షాలకు భద్రాచలం వద్ద గోదావరి నీటిమట్టం క్రమంగా పెరుగుతోంది. శనివారం 34 అడుగులు ఉన్న నీటి మట్టం ఆదివారం రాత్రి 43 అడుగులకు చేరింది. 8,85,224 క్యూసెక్కుల వరద ప్రవాహం కొనసాగుతోంది. ఎగువ ప్రాంతాల నుంచి భారీగా వరద వస్తుండడంతో అధికారులు మొదటి ప్రమాద హెచ్చరిక జారీ చేశారు.
వర్షాల ప్రభావంతో వాగులకు, గెడ్డలకు గండ్లు పడడం, రోడ్లు కోతకు గురికావడం, కాలువలు, చెక్‌ డ్యాములు ఉధృతంగా ప్రవహిస్తున్నారు. మరోవైపు గోదావరి ఉధృతి పెరిగింది. దీంతో, పోలవరం విలీన గ్రామాల్లోకి, రోడ్లపైకి వరద నీరు చేరి రాకపోకలు స్తంభించాయి. భద్రాచలం వద్ద మొదటి ప్రమాద హెచ్చరిక జారీ కావడంతో గోదావరి పరివాహక ప్రాంతాల ప్రజలు బిక్కుబిక్కుమంటూ కాలం గడుతున్నారు.
తూర్పుగోదావరి జిల్లా ధవళేశ్వరం బ్యారేజీ వద్ద మొదటి ప్రమాద హెచ్చరిక దిశగా పరుగులు పెడుతోంది. ఆదివారం సాయంత్రం 6గంటలకు బ్యారేజీ వద్ద నీటిమట్టం 10.10 అడుగులకు చేరింది. పాండ్‌ లెవెల్‌ 13.75 మీటర్లుగా ఉంది. బ్యారేజీ నుంచి రాత్రి 9గంటలకు 8,18,853 క్యూసెక్కులు సముద్రంలోకి వదిలేస్తున్నారు.  ఈ ప్రవాహం 10లక్షల క్యూసెక్కులు దాటినా.. బ్యారేజీ నీటిమట్టం 11.75 అడుగులకు చేరినా మొదటి ప్రమాద హెచ్చరిక జారీ చేస్తారు. 
కాగా, భద్రాచలం వద్ద ఆదివారం రాత్రి 43 అడుగులకు గోదావరి నీటిమట్టం చేరడంతో మొదటి ప్రమాద హెచ్చరిక జారీ చేశారు. ఎగువన కురుస్తున్న వర్షాలకు గోదావరి జారీ చేశారు.  ఎగువన కురుస్తున్న వర్షాలకు గోదావరి ఇంకా పెరిగే అవకాశం ఉందని అక్కడి అధికారులు అంచనా వేస్తున్నారు. రాజమహేంద్రవరం వద్ద అఖండ గోదావరి ఉధృతంగా ప్రవహిస్తోంది. ఘాట్లలో ఎవరినీ స్నానాలకు వెళ్లకుండా నియంత్రణ చర్యలు చేపట్టారు.
రాజమహేంద్రవరం, కొవ్వూరు డివిజన్లలోని ఘాట్లలో సోమవారం నుంచి సచివాలయ, ఇతర ఉద్యోగులను మూడు షిప్టులుగా 24గంటలూ ఉండేలా డ్యూటీలు వేశారు.  వర్షాలు, వరద నేపథ్యంలో డాక్టర్‌ బీఆర్‌ కోనసీమ జిల్లాలో 22న, విలీన మండలాల్లో 22, 23 తేదీల్లో పాఠశాలలకు సెలవు ప్రకటించారు. పెదవాగు ప్రాజెక్టుకు గండి పడటంతో వేలేరుపాడు మండలంలోని 13 గ్రామాల ప్రజలు తీవ్రంగా నష్టపోమారు.
 
ఏలూరు జిల్లా కలెక్టర్‌ ఆదేశాల మేరకు కుక్కునూరు, వేలేరుపాడు మండలాల్లో 7 గ్రామాల్లోని 432 కుటుంబాలను తక్షణమే పునరావాస కేంద్రాలకు తరలిస్తున్నారు. గోదావరి వరద మరింత పెరిగే అవకాశం ఉన్నందున ముంపునకు గురయ్యే గ్రామాల్లో ప్రజలను అప్రమత్తం చేస్తున్నారు. అల్లూరి జిల్లా చింతూరు మండలంలో శబరి నది ఉధృతంగా ప్రవహిస్తోంది. ఆదివారం సాయంత్రానికి చింతూరు వద్ద శబరి నీటిమట్టం 39 అడుగులకు చేరింది.