ఫిరాయింపుల చట్టానికి కాంగ్రెస్, బీఆర్‌ఎస్ తూట్లు

ఫిరాయింపుల చట్టానికి కాంగ్రెస్, బీఆర్‌ఎస్ తూట్లు

కాంగ్రెస్, బీఆర్‌ఎస్ పార్టీలు ప్రజా తీర్పునకు విరుద్ధంగా వ్యవహరిస్తూ పార్టీ ఫిరాయింపుల చట్టానికి తూట్లు పొడుస్తున్నాయని కేంద్ర బొగ్గు గనుల శాఖ మంత్రి, రాష్ట్ర బిజెపి అధ్యక్షుడు కిషన్ రెడ్డి మండిపడ్డారు. ఈ రెండు పార్టీల వ్యవహార శైలిలో ఏ మాత్రం మార్పు రాలేదని ధ్వజమెత్తారు. 

ఆదివారం జరిగిన బీజేపీ హైదరాబాద్ సెంట్రల్ జిల్లా కార్యవర్గ సమావేశంలో ఆయన పాల్గొంటూ గతంలో కాంగ్రెస్ ఎమ్మెల్యేలను బీఆర్‌ఎస్ లో చేర్చుకుంటే, ఇప్పుడు కాంగ్రెస్ కూడా అదే రకంగా బీఆర్‌ఎస్ ఎమ్మెల్యేలను చేర్చుకుంటున్నదని విమర్శించారు. ఈ రెండు పార్టీలు మజ్లిస్‌తో స్నేహాన్ని కొనసాగిస్తున్నాయని ఆరోపించారు.

 మొన్నటి లోక్ సభ ఎన్నికల్లో తెలంగాణలో బీజేపీకి మెజార్టీ తగ్గడానికి కాంగ్రెస్, మజ్లీస్ స్నేహమే కారణమని ఆరోపించారు. కాంగ్రెస్ పార్టీ అభ్యర్థి నాంపల్లిలో ప్రచారం చేయలేదని, ఇంటింటికి కరపత్రాలు పంచలేదని గుర్తు చేశారు. కానీ అక్కడ కాంగ్రెస్ పార్టీకి లక్ష 2 వేల ఓట్లు వస్తే బీజేపీపై 62 వేల మెజార్టీ సాధించిందని గుర్తుచేశారు. 

జూబ్లిహిల్స్ సెగ్మెంట్ లోను బీజేపీపై కాంగ్రెస్ మెజార్టీ వచ్చిందని చెబుతూ ఇందుకు కారణం మజ్లీస్ అని తెలిపారు. వాస్తవానికి దేశంలో కాంగ్రెస్ పేరు మీద మతోన్మాద శక్తులు పోటీ చేసి బీజేపీని ఓడించే ప్రయత్నం చేశారని ధ్వజమెత్తారు. సికింద్రాబాద్‌లో పోటీ చేసిన అభ్యర్థి, పోటీ చేసిన గుర్తు కాంగ్రెసే అయినా నిజానికి అక్కడ పోటీలో ఉన్నది ఎంఐఎం పార్టీ అని కిషన్‌రెడ్డి ఆరోపించారు.

ఇది చాలా ప్రమాదకరమైన పరిస్థితి అంటూ ఇటువంటి పరిస్థితిపై పార్టీ కార్యకర్తలు ఆలోచించాలని సూచించారు.  కాంగ్రెస్ పార్టీ అసలు స్వరూపం రేపటి నుంచి జరిగే పార్లమెంట్ సమావేశాల్లో బయటపడుతుందని దేశ ప్రజలంతా చూడాలని కోరారు. దేశంలో కాంగ్రెస్ పార్టీ అధికారంలో ఉన్నప్పుడు ఉగ్రవాదం, కుటుంబ పాలన, అవినీతి బాగా పెరిగిపోయినట్లు దేశ ప్రజలు గ్రహించారని కిషన్ రెడ్డి చెప్పారు. అందుకే మూడుసార్లు ఎన్డీయేకి పట్టం కట్టారని పేర్కొన్నారు.

ఎప్పటి వరకు బీజేపీ, ఎన్డీయే అధికారంలో ఉంటుందో అప్పటి వరకు ఉగ్రవాదం అరికట్టబడుతుందని స్పష్టం చేశారు.  అలా కాకుండా కాంగ్రెస్ అధికారంలోకి వస్తే పాకిస్తాన్ ఐఎస్‌ఐ కార్యకలాపాలు, అవినీతి, కుటుంబ పాలన, పైరవీ రాజ్ వ్యవస్థలు వస్తాయని హెచ్చరించారు. మోదీ  వచ్చాకే పాకిస్తాన్ ను ప్రపంచ దేశాల ముందు చిప్పపట్టుకునే స్థితికి తీసుకు వచ్చారని తెలిపారు.