నిపా వైరస్ పై కేరళకు ప్రత్యేక కేంద్ర బృందం

నిపా  వైరస్ పై కేరళకు ప్రత్యేక కేంద్ర బృందం
* ఓ బాలుడి మృతితో అప్రమత్తం
 
కరోనా వైరస్‌ కన్నా చాలా ప్రమాదకరమైందిగా భావిస్తున్న ‘నిఫా వైరస్‌’ కేరళలో పంజా విసురుతున్నది. వైరస్‌ బారినపడి వెంటిలేటర్‌పై ఉన్న మలప్పురం జిల్లాకు చెందిన 14 ఏండ్ల బాలుడు కోజికోడ్‌లో గుండె పోటుతో మరణించాడని కేరళ ఆరోగ్యమంత్రి వీణా జార్జ్‌ ఆదివారం ప్రకటించారు. ప్రభుత్వ అధికారులు మలప్పురం జిల్లా అంతటా హై-అలర్ట్‌ ప్రకటించారు. 
 
బాలుడితో కాంటాక్ట్‌ అయిన 240 మందిని క్వారంటైన్‌లో ఉంచినట్టు తెలిసింది. వైరస్‌ వ్యాప్తి ప్రభావిత గ్రామాల్లో లాక్‌డౌన్‌ విధించారు. ప్రజలంతా తప్పనిసరిగా మాస్క్‌లు ధరించాలని మంత్రి సూచించారు. బాలుడితో కాంటాక్ట్‌ ఉన్న వారిలో 60 మందిని హై-రిస్క్‌ క్యాటగిరీగా గుర్తించిన జిల్లా అధికారులు తగిన చర్యలు చేపట్టినట్టు తెలిపారు.
 

కాగా, కేంద్ర ఆరోగ్య మంత్రిత్వశాఖ ఈ వైరస్‌ను ఎదుర్కొనేందుకు ప్రత్యేక బృందాన్ని కేరళకు పంపనున్నది. బాలుడి నమూనాలను పుణేలోని నేషనల్‌ ఇన్‌స్టిట్యూట్‌ ఆఫ్‌ వైరాలజీకి పంపగా పరీక్షల్లో నిపా వైరస్‌ నిర్ధారణ  అయింది. పేర్కొంది. గబ్బిలాల ద్వారా వ్యాప్తి చెందుతుందని, గబ్బిలాలు తిన్న కలుషిత పండ్లను అనుకోకుండా మనుషులు తిన్న సమయంలో వైరస్‌ సోకే అవకాశం ఉంటుందని పేర్కొన్నారు.

 
నిపా వైరస్‌ ఇంతకు ముందు కేరళలోనే నమోదు కాగా, చివరి కేసు 2023లో కోజికోడ్‌ జిల్లాలోనే గుర్తించారు.   ఈ విషయంపై గవర్నర్‌ ఆరిఫ్‌ మహ్మద్‌ ఖాన్‌ మాట్లాడుతూ కొన్నేళ్ల కిందట కేరళలో నిపా వైరస్‌ వ్యాప్తి చెందిందని, ఆ తర్వాత వెంటనే చర్యలు తీసుకున్నట్లు తెలిపారు. ప్రభుత్వం, అధికారులు, వైద్య సిబ్బంది పరిస్థితిని అదుపులోకి తీసుకువస్తారని ఆశిస్తున్నానని పేర్కొన్నారు. 
 
బాలుడి కుటుంబం, కేసు నమోదైన పరిసర ప్రాంతాల్లో పాజిటివ్‌ కేసులను వెంటనే గుర్తించాలని ఆరోగ్య మంత్రిత్వ శాఖ రాష్ట్ర ప్రభుత్వానికి సూచించింది. ‘వన్‌ హెల్త్‌’ మిషన్‌ కింద జాయింట్‌ అవుట్‌బ్రేక్‌ రెస్పాన్స్‌ టీమ్‌ని ఏర్పాటు చేయనున్నట్లు తెలిపింది. ఎపిడెమియోలాజికల్‌ లింక్స్‌ను గుర్తించేందుకు, సాంకేతిక సహాయాన్ని అందించేందుకు ఆరోగ్య మంత్రిత్వ శాఖ ఇండియన్‌ కౌన్సిల్‌ ఆఫ్‌ మెడికల్‌ రీసెర్చ్‌ (ఐసిఎంఆర్) మోనోక్లోనల్ యాంటీబాడీలను పంపిందని తెలిపింది.  బాలుడి కాంటాక్ట్‌ల నుంచి నమూనాలను సేకరించి.. పరిశీలించేందుకు మొబైల్‌ బీఎస్‌ఎల్‌-3 ప్రయోగశాల కోజికోడ్‌ చేరుకుందని మంత్రిత్వ శాఖ పేర్కొంది. 

నిఫా వైరస్‌ను ఎదుర్కొనే యాంటీ వైరల్‌ వైద్య చికిత్స ఏదీ ఇప్పటివరకూ లేదు. వైరస్‌ సోకిన రోగిని ఐసొలేషన్‌లో ఉంచుతూ, రోగ లక్షణాలను అనుసరించి వైద్య చికిత్స అందిస్తుంటారు.