
అధ్యక్ష ఎన్నికల బరి నుంచి ప్రస్తుత అధ్యక్షుడు, డెమోక్రటిక్ పార్టీ నేత జో బైడెన్ తప్పుకొన్నారు. ఈ మేరకు బైడెన్ స్వయంగా ఆదివారం తన ఎక్స్ ఖాతాలో ప్రకటన చేశారు. దేశంతోపాటు డెమోక్రటిక్ పార్టీ ప్రయోజనాల కోసం అధ్యక్ష ఎన్నికల నుంచి తప్పుకొంటున్నట్టు ప్రకటించిన 81 ఏండ్ల బైడెన్.. దేశాధ్యక్షుడిగా 2025, జనవరి వరకు ఉన్న తన పూర్తి పదవీ కాలం కొనసాగుతానని స్పష్టం చేశారు.
దేశానికి అధ్యక్షుడిగా సేవలు అందించడం తన జీవితంలో గొప్ప గౌరవమని బైడెన్ తన ఎక్స్ పోస్టులో పేర్కొన్నారు. ‘తిరిగి ఎన్నిక కావాలనేది నా ఉద్దేశం. అయితే దేశం, పార్టీ ప్రయోజనాల దృష్ట్యా అధ్యక్ష ఎన్నికల బరి నుంచి తప్పుకొంటున్నా. మిగతా పదవీ కాలం అధ్యక్షుడిగా నా బాధ్యతలు నిర్వర్తించడంపై దృష్టి పెడుతా’ అని తెలిపారు. ఎన్నికల బరి నుంచి తప్పుకొంటున్న క్రమంలో డెమోక్రటిక్ పార్టీ తరపున అభ్యర్థిగా ప్రస్తుతం ఉపాధ్యక్షురాలిగా ఉన్న కమలా హారిస్ పేరును బైడెన్ ప్రతిపాదించారు.
2020లో ఉపాధ్యక్ష నామినీగా కమలా హారిస్‌ను ఎంపిక చేస్తూ అప్పట్లో నిర్ణయం తీసుకొన్నానని, అది తాను తీసుకొన్నఅత్యుత్తమ నిర్ణయమని బైడెన్ పేర్కొన్నారు. ఆమె ఒక అద్భుతమైన భాగస్వామి అని కొనియాడారు. ‘ఈ ఏడాది అధ్యక్ష ఎన్నికల్లో పార్టీ అభ్యర్థిగా ఈ రోజున కూడా నా పూర్తి మద్దతు, ఆమోదం కమలా హారిస్‌కు ఇస్తున్నాను’ అని ఎక్స్‌లో పోస్టు చేశారు.
పార్టీ నేతలు, అందరూ కలిసికట్టుగా పోరాటం చేసి, ట్రంప్‌ను ఓడించాలని ఈ సందర్భంగా ఆయన డెమోక్రాట్లకు పిలుపునిచ్చారు. అధ్యక్ష బరి నుంచి తప్పుకోవడంపై తాను జాతినుద్దేశించి తర్వాత ప్రసంగిస్తానని బైడెన్ పేర్కొన్నారు.
రిపబ్లికన్ పార్టీ నేత, మాజీ అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్‌తో జరిగిన డిబేట్‌లలో తడబాటు, పలు సందర్భాల్లో వింత ప్రవర్తన, ట్రంప్‌నకు పోటీ ఇవ్వలేరన్న అంచనాల నేపథ్యంలో బైడెన్ అధ్యక్ష పోటీ నుంచి తప్పుకోవాలని డెమోక్రటిక్ పార్టీ నేతల నుంచి ఒత్తిడి, డిమాండ్లు పెరిగిన విషయం తెలిసిందే. ఎన్నికల బరిలో నుంచి తప్పుకొంటున్నట్టు ప్రకటించే కంటే ముందు బైడెన్ ఆదివారం తన ఎన్నికల ప్రచారాన్ని ముగించారు.
బైడెన్ ప్రవర్తనా శైలి, పలు సందర్భాల్లో మాటల తడబాటు ఇటీవలి కాలంలో చర్చనీయాంశంగా మారింది. ఇటీవల నాటో కూటమి సమావేశంలో ఆయన తన పక్కనే ఉన్న ఉక్రెయిన్ అధ్యక్షుడు జెలెన్‌స్కీని ‘ప్రెసిడెంట్ పుతిన్’గా సంబోధించారు. అయితే వెంటనే తన తప్పు తెలుసుకొని దాన్ని సరిదిద్దుకోవడానికి జెలెన్‌స్కీ ప్రెసిడెంట్ పుతిన్‌ను ఓడించబోతున్నారని తెలిపారు.
అధ్యక్ష అభ్యర్థిగా ఓ వైపు తనకు వ్యతిరేకంగా గళాలు పెరుగుతున్నప్పటికీ, అధ్యక్ష పోటీ నుంచి తప్పుకొనేలా లేదని బైడెన్ ఇంత వరకూ చెప్పుకొచ్చారు. తనపై వ్యతిరేక ప్రచారానికి ముగింపు పలకాలని ఆయన పార్టీ వర్గాలను కోరారు. ఈ మేరకు ఆయన పార్టీ సహచరులకు రెండు పేజీల లేఖ కూడా రాశారు.
అమెరికా అధ్యక్ష ఎన్నికల నేపథ్యంలో గత నెల 27న జరిగిన ట్రంప్‌తో జరిగిన డిబేట్‌లో బైడెన్ వెనుకబడిన నాటి నుంచి ఆయనపై పార్టీలో వ్యతిరేకత పెరిగింది. బైడెన్ మానసికంగా ధృడంగా లేరని, ట్రంప్‌నకు ఆయన సరైన పోటీ ఇవ్వలేరన్న వాదనలతో బైడెన్ అధ్యక్ష రేసు నుంచి తప్పుకోవాలని డిమాండ్లు పార్టీలో వచ్చాయి.
అట్లాంటాలోని సీఎన్‌ఎన్ హెడ్‌క్వార్టర్స్‌లో దాదాపు 90 నిమిషాలపాటు జరిగిన డిబేట్‌లో ట్రంప్‌దే పైచేయిగా కనిపించింది. బైడెన్ తడబడుతూ మాట్లాడటంతో ఆయన పార్టీ ఆందోళనకు గురైంది. ఈ డిబేట్‌లో ట్రంప్ ఘాటుగా, సూటిగా మాట్లాడేసరికి, బైడెన్ నోటి నుంచి మాటలు నెమ్మదిగా, నీరసంగా వచ్చాయి. అమెరికన్ ఆర్థిక వ్యవస్థ, విదేశాలతో సంబంధాలు, వలసల గురించి బైడెన్‌పై ట్రంప్ విరుచుకుపడ్డారు. దీనిపై బైడెన్ స్పందిస్తూ, ట్రంప్ వ్యాఖ్యలు అతిశయోక్తులు, అబద్ధాలని చెప్పారు.జో బైడెన్ 1942లో పెన్సిల్వేనియాలో జన్మించారు. డెలావేర్ విశ్వవిద్యాలయం, సిరాక్యుస్ లా స్కూల్‌లో చదువుకున్నారు. మొదట పబ్లిక్ డిఫెండర్‌గా పని చేసి, ఆ తర్వాత రాజకీయ రంగ ప్రవేశం చేశారు. 1972లో 29 ఏళ్ల వయసులో అమెరికా సెనేట్‌కు పోటీ చేశారు. ఆయన కన్నా రెట్టింపు వయసుగల రిపబ్లికన్ అభ్యర్థి జే సెలెబ్ బాగ్స్ చేతిలో పరాజయం చవి చూశారు.
అదే సంవత్సరం రిచర్డ్ నిక్సన్ అమెరికా అధ్యక్షునిగా విజయం సాధించారు. ఆయన 37వ ప్రెసిడెంట్ కాగా, 2021లో జో బైడెన్ 46వ అధ్యక్షునిగా బాధ్యతలు చేపట్టారు. ఈ 49 ఏళ్ల కాలంలో 8 మంది దేశాధ్యక్ష పదవిని నిర్వహించారు. ఈ సమయంలో బైడెన్ 36 ఏళ్లపాటు సెనేటర్‌గానూ, ఎనిమిదేళ్లపాటు అమెరికా ఉపాధ్యక్షునిగానూ పని చేశారు.
1987లో మొదటిసారి అమెరికా అధ్యక్ష పదవికి పోటీ చేసి, ఓడిపోయారు. 1972లో క్రిస్టమస్ సమయంలో జరిగిన కారు ప్రమాదంలో జో బైడెన్ సతీమణి నెయిలియా బైడెన్, కుమార్తె నవోమీ (1) ప్రాణాలు కోల్పోయారు. ఈ ప్రమాదం నుంచి ఆయన కుమారులు బ్యూ, హంటర్ బయటపడ్డారు. 1977లో ఆయన జిల్ జాకోబ్స్‌ను రెండో పెళ్లి చేసుకున్నారు. నాలుగేళ్ల తర్వాత కుమార్తె ఆష్లే జన్మించారు.
అమెరికా అధ్యక్షునిగా డొనాల్డ్ ట్రంప్ పాలనపై తీవ్ర వ్యతిరేకత పెల్లుబికిన సమయంలో జో బైడెన్‌కు నల్ల జాతీయులు గట్టి మద్దతుగా నిలిచారు. అదే సమయంలో కొవిడ్-19 మహమ్మారి రావడంతో ప్రచారం కోసం పరిమితంగానే ప్రయాణాలు చేశారు. అనంతరం 70 లక్షల ఓట్ల ఆధిక్యంతో ట్రంప్‌పై విజయం సాధించారు. అమెరికా అధ్యక్షుడైన అత్యంత వృద్ధ నేతగా నిలిచారు.
అధ్యక్ష రేసు నుంచి తప్పుకుంటున్నటు బైడెన్ ప్రకటించడంపై మాజీ అధ్యక్షుడు, రిపబ్లికన్ పార్టీ అభ్యర్థి డొనాల్డ్ ట్రంప్ స్పందించారు. ‘అతను దేశ చరిత్రలోనే అత్యంత చెత్త అధ్యక్షుడు. మన దేశంలో ఆయనో చెత్త అధ్యక్షుడిగా నిలిచిపోతారు. డెమోక్రటిక్ పార్టీ నుంచి ఉపాధ్యక్షురాలు కమలాహ్యారిస్ బరిలో దిగితే బైడెన్ కంటే సులువుగా ఓడించవచ్చు’ అని ట్రంప్ పేర్కొన్నారు.
More Stories
ఢిల్లీ యూనివర్సిటీ ఎన్నికల్లో ఎబివిపి ఘన విజయం
బీహార్ లో ఎన్డీఏ – మహాఘట్ బంధన్ నువ్వా నేనా?
హిండెన్‌బర్గ్ ఆరోపణలపై అదానీకి సెబీ క్లీన్చిట్