ఆర్​ఎస్​ఎస్​కి సంబంధించిన దశాబ్దాల నాటి నిషేధం ఎత్తివేత!

ఆర్​ఎస్​ఎస్​కి సంబంధించిన దశాబ్దాల నాటి నిషేధం ఎత్తివేత!

* స్వాగతించిన ఆర్ఎస్ఎస్

ప్రభుత్వ ఉద్యోగులు రాష్ట్రీయ స్వయంసేవక్​ సంఘ్​ (ఆర్ఎస్ఎస్) కార్యకలాపాల్లో పాల్గొనకుండా ఇప్పటివరకు ఉన్న నిషేధాన్ని బీజేపీ ప్రభుత్వం ఇటీవలే ఎత్తివేసింది. కేంద్ర ప్రభుత్వం జులై 9న ఈ ఉత్తరువును జారీ చేసింది. ప్రభుత్వ ఉద్యోగులు ఆర్​ఎస్​ఎస్​లో పాల్గొనకుండా 1966 నాటి నిషేధాన్ని ఎత్తివేస్తున్నట్టు ఆ ఉత్తర్వుల్లో ఉంది.

ప్రభుత్వం ఇటీవల తీసుకున్న నిర్ణయం సముచితమైనదని, భారతీయ ప్రజాస్వామ్య వ్యవస్థను బలోపేతం చేస్తుందని ఆర్ఎస్ఎస్ అఖిల భారతీయ ప్రచార్ ప్రముఖ్  సునీల్ అంబేకర్ తెలిపారు.  రాష్ట్రీయ స్వయంసేవక్ సంఘ్ గత 99 సంవత్సరాలుగా దేశ పునర్నిర్మాణం, సమాజ సేవలో నిరంతరం నిమగ్నమై ఉందని ఆయన చెప్పారు.
 
జాతీయ భద్రత, ఐక్యత-సమగ్రత , ప్రకృతి వైపరీత్యాల సమయాల్లో ఆర్‌ఎస్‌ఎస్ చేసిన కృషి కారణంగా, దేశంలోని వివిధ రకాల నాయకత్వం ఎప్పటికప్పుడు ఆర్‌ఎస్‌ఎస్ పాత్రను కొనియాడుతోందని ఆయన గుర్తు చేశారు. తమ రాజకీయ స్వప్రయోజనాల కారణంగా అప్పటి ప్రభుత్వం ఆర్‌ఎస్‌ఎస్ వంటి నిర్మాణాత్మక సంస్థ కార్యకలాపాల్లో పాల్గొనకుండా ప్రభుత్వ ఉద్యోగులను అన్యాయంగా నిషేధించిందని ఆయన విచారం వ్యక్తం చేశారు. 

మహాత్మా గాంధీ మరణం అనంతరం ఆర్​ఎస్​ఎస్​పై 1948లో నాటి జవహర్ లాల్ నెహ్రు ప్రభుత్వం నిషేధించింది. అయితే ఆ నిషేధాన్ని ఆ తర్వాత తొలిగించారు. ఆ తర్వాత  1966లో ఆర్​ఎస్​ఎస్​, జమాత్​-ఈ- ఇస్లామీ వంటి సంస్థల కార్యకలాపాల్లో ప్రభుత్వ ఉద్యోగులు పాల్గొంటే, అది కేంద్ర సివిల్​ సర్వీసెస్​ రూల్స్​కి వ్యతిరేకమని ఉత్తరువులు జారీచేశారు.  ఇప్పుడు జులై 9న, 58ఏళ్ల పాటు ఉన్న నిషేధాన్ని ప్రభుత్వం ఎత్తివేసింది.

జులై 9 నాటి ఉత్తర్వులను బీజేపీ ఐటీ డిపార్ట్​మెంట్​ చీఫ్​ అమిత్​ మాల్వియా సోషల్​ మీడియాలో పోస్ట్​ చేశారు. ప్రభుత్వ నిర్ణయాన్ని సమర్థిస్తున్నట్టు వెల్లడించారు. “58 ఏళ్ల క్రితం, 1966లో ప్రభుత్వ ఉద్యోగులు ఆర్​ఎస్​ఎస్​ కార్యక్రమాల్లో పాల్గొనకుండా నిషేధం విధించారు. ఇది అసలు జరిగి ఉండకూడదు. ఇది రాజ్యాంగ విరుద్ధం. దీనిని మోదీ ప్రభుత్వం ఉపసంహరించుకుంది. దీనిని నేను స్వాగతిస్తున్నాను,” అని అమిత్​ చెప్పుకొచ్చారు.

ఇప్పటికే మధ్య ప్రదేశ్, హర్యానా, హిమాచల్ ప్రదేశ్, చ్ఛతిస్ ఘర్ ప్రభుత్వాలు ప్రభుత్వ ఉద్యోగులు ఆర్ఎస్ఎస్ కార్యకలాపాలలో పాల్గొనడంపై ఉన్న నిషేధాన్ని ఎత్తివేసాయి.