
రాంచీలో శనివారంనాడు జరిగిన జార్ఖాండ్ బీజేపీ వర్కింగ్ కమిటీ సమావేశంలో అమిత్‌షా మాట్లాడుతూ, జేఎంఎం- కాంగ్రెస్ కూటమి అవినీతికి పాల్పడుతూ, గిరిజనులకు వ్యతిరేకంగా పనిచేస్తోందని విమర్శించారు. బీజేపీ కార్యకర్తలు ఓటర్ల వద్దకు వెళ్లి హేమంత్ సోరెన్ ప్రభుత్వ వైఫల్యాలను వారి దృష్టికి తీసుకురావాలని ఆయన సూచించారు.
2014, 2019, 2024 లోక్‌సభ ఎన్నికల్లో కాంగ్రెస్ ఉమ్మడిగా సాధించిన సీట్ల కంటే బీజేపీకి ఎక్కువ సీట్లు వచ్చాయని గుర్తు చేశారు. జేఎంఎం నేతృత్వంలోని కూటమి దేశంలోనే అత్యంత అవినీతి ప్రభుత్వమని, దానిని నిరూపించుకోవాల్సిన సమయం ఆసన్నమైందని స్పష్టం చేశారు.
జార్ఖాండ్ రాష్ట్రాన్ని ఏర్పాటు చేసింది, అభివృద్ధి చేసింది బీజేపీయేనని అమిత్‌షా గుర్తుచేశారు. గత పదేళ్లలో జార్ఖాండ్ అభివృద్ధికి కాంగ్రెస్ రూ.84 వేల కోట్లు ఇస్తే, ప్రధానమంత్రి నరేంద్ర మోదీ రూ.3 లక్షల 84 వేల కోట్లు రాష్ట్రానికి ఇచ్చారని చెప్పారు. నక్సలిజంతో రాష్ట్రం ఎప్పుడూ అల్లాడుతుండేదని, మోదీ ప్రభుత్వం బీహార్, జార్ఖాండ్‌లలో నక్సలిజాన్ని నిర్మూలించిందని పేర్కొన్నారు.
కాంగ్రెస్ ఎంపీ ఇంట్లో రూ.300 కోట్లు, మినిస్టర్ పీఏ ఇంట్లో రూ.30 కోట్లు పట్టుబడ్డాయని, ఆ సొమ్ము ఎవరితో, ఎక్కడి నుంచి వచ్చిందో కాంగ్రెస్ చెప్పగలదా? అని అమిత్‌షా ప్రశ్నించారు. అలాంటి అవినీతి పరులతో నడుస్తున్న కాంగ్రెస్, జేఎంఎం ఒకరితో ఒకరు అంటకాగుతున్నాయని విమర్శించారు. జార్ఖాండ్ సమస్యలను హేమంత సోరెన్ ఏమాత్రం పట్టించుకోవడం లేదని, తన సొంత కుటుంబం అభివృద్ధి చెందితే అదే గిరిజనుల అభివృద్ధిగా ఆయన భావిస్తుంటారని విమర్శించారు. గిరిజన మహిళను భారత రాష్ట్రపతిగా చేసిన క్రెడిట్ బీజేపీదేనని చెప్పారు.
ఓబీసీల సంక్షేమానికి మోదీ కట్టుబడి ఉన్నారని, వారి కోసం కమిషన్ వేసి అన్ని కేంద్ర పరీక్షల్లోనూ 27 శాతం రిజర్వేషన్ కల్పించారని, వారి హక్కులను కాపాడారని అమిత్ షా తెలిపారు. మోదీ మంత్రివర్గంలో కూడా ఎక్కువ మంది వెనుకబడిన తరగతుల వారేనని, సోరెన్ ప్రభుత్వాన్ని కూకటివేళ్లతో పెకిలించి మోదీ ప్రభుత్వానికి జార్ఖాండ్ ప్రజలు మద్దతు ఇవ్వాల్సిన అవసరం ఉందని పిలుపిచ్చారు.
More Stories
చిప్స్ ఐనా, ఓడలైనా స్వావలంబన తప్ప మార్గం లేదు
టీ20లో వేగంగా 100 వికెట్ల తీసిన బౌలర్గా అర్షదీప్
పాక్-సౌదీ రక్షణ ఒప్పందంలో మరిన్ని ముస్లిం దేశాలు