
కాంగ్రెస్ పార్టీ పెత్తిన ప్రతి స్కీమ్‌లో స్కామ్ ఉంటుందని చెబుతూ రేవంత్ సర్కారుది ప్రజా పాలన కాదని, ప్రజా వ్యతిరేక పాలన అని బీజేపీ ఎల్‌పీ నేత ఏలేటి మహేశ్వర్‌రెడ్డి విమర్శలు గుప్పించారు. అసెంబ్లీ మీడియా పాయింట్ వద్ద ఆయన మాట్లాడుతూ కాంగ్రెస్ సర్కార్ రైతాంగాన్ని మరోసారి మోసం చేసిందని, రుణమాఫీ మొత్తం చేయకముందే సంబరాలు చేసుకుంటున్నారంటూ విమర్శించారు.
ప్రజల సొమ్ము ఇష్టానుసారంగా చేస్తామంటే కుదరదనని, రూ.2లక్షల రుణమాఫీ అని చెప్పి ఆంక్షలు పెడుతున్నారని విమర్శించారు. రుణమాఫీ కొంతమందికే చేసి మిగతా రైతులకు ఆంక్షలు పెట్టారని పేర్కొన్నారు. రైతు పాస్‌బుక్ ఆధారంగా రుణమాఫీ అని చెప్పి రేషన్ కార్డు ఆధారంగానే రుణమాఫీ చేస్తున్నారని ధ్వజమెత్తారు.
ఉమ్మడి ఖమ్మం, మహబూబ్‌నగర్, మెదక్ జిల్లాలో చాలామంది రైతులకు రుణమాఫీ కావడం లేదని చెబుతూ రూ.రెండు లక్షల రుణమాఫీ ప్రతీ రైతుకు కావాలని స్పష్టం చేశారు. లేనట్లయితే అసెంబ్లీ, సచివాలయం ముట్టడిస్తామని హెచ్చరించారు. రైతు భరోసా యాసంగి పంటకు ఇవ్వలేదని, ఇప్పుడు వానాకాలం పంటకు కూడా ఎగ్గొట్టే ప్రయత్నం ప్రభుత్వం చేస్తుందని విమర్శించారు.
రైతు రుణమాఫీ అసెంబ్లీలో చర్చించకుండానే చేశారు కదా? మరి రైతు భరోసా చెల్లింపులో అసెంబ్లీలో చర్చ దేనికో సమాధానం చెప్పాలని డిమాండ్ చేశారు. రైతు భరోసా ఎగ్గొట్టడానికి మాత్రమే అసెంబ్లీలో చర్చ ముందుకు తెస్తున్నారని మండిపడ్డారు. రేవంత్ సర్కార్ రైతు, విద్యార్థి, నిరుద్యోగ, ప్రజావ్యతిరేక ప్రభుత్వం అంటూ మహేశ్వర్‌రెడ్డి విమర్శలు గుప్పించారు.
More Stories
గవర్నర్ ఆమోదం పొందని రిజర్వేషన్ల బిల్లులు
ఓ ఉగ్రవాది అరెస్టుతో ఉలిక్కిపడ్డ బోధన్
జూబ్లీ హిల్స్ లో బిఆర్ఎస్ అభ్యర్థి మాగంటి సునీత