
ఈ నెల 22 నుంచి పార్లమెంట్ బడ్జెట్ సమావేశాలు ప్రారంభం కానున్న నేపథ్యంలో టీడీపీ ఎంపీలతో పార్టీ అధినేత, ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు శనివారం తన పార్టీ ఎంపిలతో కేంద్ర మంత్రులతో సమావేమయ్యారు. ఉండవల్లిలోని తన నివాసంలో జరిగిన ఈ సమావేశానికి టీడీపీ ఎంపీలు, కేంద్రమంత్రులు హాజరయ్యారు.
ఈ సందర్భంగా చంద్రబాబు పార్లమెంట్‌లో అనుసరించాల్సిన వ్యూహాలపై ఎంపీలకు దిశానిర్దేశం చేశారు. రాష్ట్రానికి కేంద్రం నుంచి రావాల్సిన నిధులు తీసుకురావడంపై ప్రత్యేక దృష్టి పెట్టాలని కోరారు. సంక్షేమ, అభివృద్ధి పథకాలపై ప్రత్యేకంగా ఎపిలతో చర్చించారు. అలాగే, కేంద్రంతో సమన్వయం కోసం ఒక్కో ఎంపీ కొన్ని శాఖల బాధ్యతలను చంద్రబాబు అప్పగించారు. ఎంపీలు ఢిల్లీలో ఉంటూ రాష్ట్రానికి రావల్సిన నిధులను తీసుకొచ్చేందుకు అవసరమైన అన్ని ప్రయత్నాలు చేయాలని ఇప్పటికే సూచించారు. విభజన హామీల పరిష్కారం కోసం ఎంపీలు కృషి చేయాలని తెలిపారు.
ముఖ్యంగా, అమరావతి రాజధాని నిర్మాణం, పోలవరం ప్రాజెక్టుకు రావాల్సిన నిధులపై పార్లమెంటరీ సమావేశంలో చర్చించారు. కొత్త ప్రాజెక్ట్ లు ఎపికి తీసుకొచ్చేందుకు ఎంపిలు సమీష్టిగా కృషి చేయాలని కోరారు.. ఎపి అర్థిక పరిస్థితిని దృష్టిలో ఉంచుకుని ఈ కేంద్ర బడ్జెట్ లో రాష్ట్రానికి అథిక నిధులు కేటాయించేలా ఎంపిలు కేంద్రంపై వత్తిడి తీసుకురావాలని చెప్పారు.
కాగా, ఢిల్లీలో జగన్ మోహన్ రెడ్డి ధర్నా చేయనున్నారన్న అంశంపై భేటీలో ప్రస్తావనకు వచ్చింది. జగన్ గురించి వైఎస్సార్సీపీ గురించి ఆలోచన చేయాల్సిన అవసరం లేదని పలువురు ఎంపీలు అన్నట్లు తెలుస్తోంది. జగన్ గురించి ఒక్క క్షణం ఆలోచించే సమయాన్ని రాష్ట్రాభివృద్ధి కోసం వెచ్చించాలని ఓ మంత్రి తెలిపారు. డిల్లీలో జగనేం చేస్తాడో ముఖ్యం కాదని, మనమేం చేయాలనేదే ముఖ్యమని చంద్రబాబు స్పష్టం చేశారు.
జల్ జీవన్ మిషన్, క్రిషి సించాయీ యోజన కింద రాష్ట్రానికి మెరుగైన సాయంపై చర్చించారు. దక్షిణ కోస్తా రైల్వే జోన్‌లో వివిధ ప్రాజెక్టులకు భూముల కేటాయింపునకు సంబంధించిన పెండింగ్ అంశాల పరిష్కారంపై చర్చకు వచ్చినట్లు సమాచారం. విశాఖ స్టీల్‌ప్లాంట్‌ను మళ్లీ గాడిన పెట్టేందుకు చేపట్టాల్సిన చర్యలు, విభజన హామీల్లో భాగంగా రాష్ట్రానికి కేంద్ర ప్రభుత్వం మంజూరు చేసిన వివిధ సంస్థలకు అవసరమైన పూర్తి సదుపాయాలు కల్పించడం వంటి అంశాలపై చర్చించారు.
More Stories
శ్రీశైలం అభివృద్ధికి ప్రధానిని రూ. 1,657 కోట్లు కోరనున్న దేవస్థానం
పరకామణిలో చోరీకి పాల్పడిన రవికుమార్ అదృశ్యం!
`త్రిశూల’ వ్యూహంతో జనసేన బలోపేతంపై పవన్ దృష్టి