బిఆర్ఎస్ మాదిరిగా నిరుద్యోగ భృతి ఇస్తామని కాంగ్రెస్ మోసం

బిఆర్ఎస్ మాదిరిగా నిరుద్యోగ భృతి ఇస్తామని కాంగ్రెస్ మోసం

నిరుద్యోగ భృతి ఇస్తామన్న కాంగ్రెస్‌ ప్రభుత్వం, మునుపటి బీఆర్ఎస్ పార్టీ మాదిరే మోసం చేసిందని కేంద్రమంత్రి జి. కిషన్‌రెడ్డి విమర్శించారు. హైదరాబాద్‌లోని ధర్నా చౌక్‌లో బీజేపీ యువ మోర్చా ఆధ్వర్యంలో నిర్వహించిన నిరుద్యోగ మహా ధర్నాలో ఆయన పాల్గొంటూ ఉద్యోగాలను ఎలా భర్తీ చేస్తారో తేదీలతో సహా ప్రకటించిన జాబ్ క్యాలెండర్ ఏమైందని ప్రశ్నించారు. రేవంత్‌ రెడ్డి ఆ విషయమే మరిచిపోయారని ఎద్దేవా చేశారు. 

కాంగ్రెస్‌ ప్రజా వ్యతిరేకతను కూడగట్టుకుంటోందని, కేసీఆర్​కు బుద్ధి చెప్పడానికి పదేళ్లు పట్టింది కానీ, కాంగ్రెస్ ప్రభుత్వానికి బుద్ధి చెప్పడానికి ఐదేళ్లు కూడా పట్టదని స్పష్టం చేశారు. హస్తం పార్టీ​ ఇచ్చిన గ్యారంటీలే, ఆ పార్టీకి గుదిబండగా మారుతాయని తెలిపారు.  కాంగ్రెస్‌ నాయకులు ఎవరికి దొరికినంత వారు దోచుకుంటున్నారని కిషన్​రెడ్డి ఆరోపించారు. 

రాష్ట్రంలో విస్తారంగా అవినీతి కొనసాగుతోందని, అధికారాన్ని దుర్వినియోగం చేయడంలో మాత్రమే రాష్ట్రంలో మార్పు వచ్చిందని ధ్వజమెత్తారు. రాష్ట్రంలో కేసీఆర్ కుటుంబ పాలన పోయి సోనియాగాంధీ కుటుంబ పాలనొచ్చిందని దుయ్యబట్టారు.  గతంలో ప్రజల తీర్పును కాలరాసి కేసీఆర్‌ కాంగ్రెస్‌ ఎమ్మెల్యేలను బీఆర్ఎస్​లో చేర్చుకున్నారని, ఈ కాంగ్రెస్ ప్రభుత్వం కూడా అలాగే ప్రోత్సహిస్తూ ప్రజా తీర్పును అపహస్యం చేస్తుందన్నాని ధ్వజమెత్తారు. ఇదేనా మార్పు అంటూ నిలదీశారు.

గ్రూప్ 1 మెయిన్స్‌కు 1:50 కాకుండా 1:100 నిష్పత్తిలో ఎంపిక చేయాలి. సీఎం రేవంత్‌ రెడ్డి ఇచ్చిన హామీ మేరకు గ్రూప్-2లో 783 పోస్టులను 2000కు పెంచాలి. 1365 గ్రూప్-3 పోస్టులను 3000కు పెంచాలి. హామీ ఇచ్చినట్లుగా 2 లక్షల ప్రభుత్వ ఉద్యోగాల భర్తీ ప్రక్రియను వెంటనే చేపట్టాలి. మెగా డీఎస్సీలో భాగంగా 25 వేల ఉద్యోగాలను భర్తీ చేయాలి. నిరుద్యోగులకు వెంటనే రూ.4,000 భృతిని విడుదల చేయాలి” అని కిషన్‌రెడ్డి డిమాండ్ చేశారు.

బీఆర్ఎస్ ప్రభుత్వం తెలంగాణ యువతకు అన్యాయం చేసిందని, తాము అధికారంలోకి వస్తే న్యాయం చేస్తామంటూ యూత్ డిక్లరేషన్ ప్రకటించిన కాంగ్రెస్ పార్టీ, ఆ యూత్ డిక్లరేషన్ ఊసు ఏమైందని కిషన్​రెడ్డి ప్రశ్నించారు. నిరుద్యోగులను అవమానించేలాగా సీఎం రేవంత్ రెడ్డి మాట్లాడటం బాధాకరమని పేర్కొన్నారు.  అదేవిధంగా వంద రోజుల్లో అమలు చేస్తామన్న ఆరు గ్యారెంటీల్లో ఎన్ని అమలు చేశారని కేంద్ర మంత్రి నిలదీశారు. రైతులను మభ్య పెట్టేందుకే ఈ రైతు రుణమాఫీ అని, అరకొర మాఫీతో కొంతమంది రైతులకు మాఫీ చేసి మిగతా వారిని మోసం చేస్తుందని దుయ్యబట్టారు.

రాష్ట్రంలో కేవలం జెండా మాత్రమే మారింది కానీ పాలనలో, అవినీతిలో మార్పు లేదని స్పష్టం చేశారు. ప్రజావాణి వినిపించడంలో బీజేపీ కృషి చేస్తుందని చెబుతూ ప్రతివారం ఢిల్లీకి వెళ్లే రేవంత్ రెడ్డి చిక్కడపల్లిలోని లైబ్రరీకి ఎందుకు రాలేదని ప్రశ్నించారు. ఉస్మానియా యూనివర్సిటీకి ఎందుకు రాలేదని నిలదీశారు. రాష్ట్ర ప్రభుత్వంపై తమ పోరాటం ఆరంభం మాత్రమేనన్న కేంద్ర మంత్రి, అరెస్టులు చేసి అణగదొక్కాలని చూసినా, వేధింపులకు గురిచేసినా యువ మోర్చా నేతలు, బీజేపీ పార్టీ భయపడదని స్పష్టం చేశారు.