మ‌హిళ‌ల‌ ఆసియా క‌ప్‌లో పాక్ ను చిత్తుగా ఓడించిన భారత్

మ‌హిళ‌ల‌ ఆసియా క‌ప్‌లో పాక్ ను చిత్తుగా ఓడించిన భారత్

మ‌హిళ‌ల‌ ఆసియా క‌ప్‌లో భార‌త జ‌ట్టు అదిరే బోణీ కొట్టింది. తొలి పోరులోనే చిర‌కాల ప్ర‌త్య‌ర్థి పాకిస్థాన్‌ను చిత్తుగా ఓడించింది. దంబుల్లా స్టేడియంలో ఆల్‌రౌండ్ షోతో శుక్ర‌వారం పాక్‌ను మ‌ట్టిక‌రిపించి రెండు పాయింట్లు సాధించింది. దాయాది నిర్దేశించిన 109 ప‌రుగుల‌ స్వ‌ల్ప ఛేద‌న‌లో ఓపెన‌ర్లు స్మృతి మంధాన‌(45), ష‌ఫాలీ వ‌ర్మ‌(40) భార‌త ఇన్నింగ్స్‌ను దూకుడుగా ఆరంభించారు. దాంతో 14 ఓవ‌ర్లలోనే భార‌త్ మ్యాచ్ ముగించింది.

మ‌హిళ‌ల‌ ఆసియా క‌ప్‌ను డిఫెండింగ్ చాంపియ‌న్ భార‌త్ విజ‌యంతో ఆరంభించింది. సొంత‌గ‌డ్డ‌పై దక్షిణాఫ్రికాపై విజ‌యమిచ్చిన ఆత్మవిశ్వాసాన్ని కొన‌సాగిస్తూ మెగా టోర్నీలో పాకిస్థాన్‌కు ముచ్చెమ‌ట‌లు ప‌ట్టించింది. తొలుత బౌల‌ర్ల విజృంభ‌ణ‌తో పాకిస్థాన్‌ను స్వ‌ల్ప స్కోర్‌కే క‌ట్టడి చేసిన టీమిండియా ఆ త‌ర్వాత ఓపెన‌ర్ల విధ్వంసంతో అల‌వోక‌గా గెలుపొందింది.

109 ప‌రుగుల ఛేద‌న‌లో ఓపెన‌ర్లు స్మృతి మంధాన (45), ష‌ఫాలీ వ‌ర్మ‌(40) మెరుపు ఇన్నింగ్స్‌తో పాక్ బౌలర్ల‌ను కుదేలు చేశారు.  ఇద్ద‌రూ పోటా పోటీగా బౌండ‌రీలు కొడుతూ స్కోర్ బోర్డును ఉరికించారు. బౌల‌ర్ మారినా త‌గ్గేదేలే అంటూ ఉతికేయ‌డంతో ప‌వ‌ర్ ప్లేలో భార‌త జ‌ట్టు 57 ర‌న్స్ కొట్టింది.

ఈ జోడీని విడ‌దీసేంద‌కు అష్ట‌క‌ష్టాలు ప‌డ్డ పాక్ జట్టుకు 10వ ఓవ‌ర్‌లో బ్రేక్ ల‌భించింది. సైదా అరూబ్ బౌలింగ్‌లో లాంగాఫ్‌లో షాట్ కొట్ట‌బోయి మంధాన ఔట‌య్యింది. అప్ప‌టికీ ఇండియా విజ‌యానికి 24 ర‌న్స్ కావాలంతే. అయితే.. స్వ‌ల్వ వ్య‌వ‌ధిలో ష‌ఫాలీ, ద‌య‌లాన్ హేమ‌ల‌త‌(14)లు పెవిలియ‌న్ చేరారు. ఆ ద‌శ‌లో జెమీమా రోడ్రిగ్స్‌(6నాటౌట్ )తో క‌లిసి కెప్టెన్ హ‌ర్మ‌న్‌ప్రీత్ కౌర్(5 నాటౌట్ ), లాంఛ‌నాన్ని ముగించింది.

టాస్ ఓడిన డిఫెండింగ్ చాంపియ‌న్‌ భార‌త మ‌హిళ‌ల జ‌ట్టుకు పూజా వ‌స్త్రాక‌ర్ ఆదిలోనే బ్రేక్ ఇచ్చింది. దంబుల్లా స్టేడియం వేదిక‌గా జ‌రుగుతున్న మ్యాచ్‌లో తొలి ఓవ‌ర్లోనే వికెట్ తీసింది. గుల్ ఫెరొజా(5)ను చేసి వికెట్ల వేట మొద‌లెట్టింది. ఆ త‌ర్వాత బంతి అందుకున్న ఆమె బౌన్స‌ర్‌తో మునీబా అలీ(11)ను బోల్తా కొట్టించి పాక్‌ను క‌ష్టాల్లో ప‌డేసింది. దాంతో, పాక్ 26 ప‌రుగుల‌కే రెండు కీల‌క వికెట్లు కోల్పోయింది.

ఆ ద‌శ‌లో సిడ్రా అమీన్(25), టుబా హ‌స‌న్(22)ల‌తో క‌లిసి ధాటిగా ఆడాల‌నుకున్న కెప్టెన్ నిడా దార్ (8)ను దీప్తి శ‌ర్మ వెన‌క్కి పంపింది. అదే ఓవ‌ర్లో 2 ప‌రుగులే ఇచ్చి మూడు వికెట్లు తీసి పాక్‌ను కోలుకోకుండా చేసింది. చివ‌ర్లో స‌నా ఫాతిమా పోరాటంతో పాక్ స్కోర్ ఆ మాత్రం ర‌న్స్ చేయ‌గ‌లిగింది. రాధా యాద‌వ్ వేసిన 19వ ఓవ‌ర్‌లో స‌నా రెండు భారీ సిక్స‌ర్లు బాదింది. దాంతో, పాక్ స్కోర్ సెంచ‌రీ మార్క్ దాటింది.

దీప్తి శర్మ (3/20), రేణుకా సింగ్‌ (2/14), శ్రేయాంక పాటిల్‌ (2/14) సమిష్టిగా రాణించడంతో పాక్‌ బ్యాటర్లు విలవిల్లాడారు. ఆ జట్టులోసిద్రా అమీన్‌ (25) టాప్‌ స్కోరర్‌. అనంతరం స్వల్ప ఛేదనను భారత్‌ 14.1 ఓవర్లలో మూడు వికెట్లు మాత్రమే కోల్పోయి పూర్తి చేసింది. ఓపెనర్లు స్మృతి మంధాన (31 బంతుల్లో 45, 9 ఫోర్లు), షఫాలీ వర్మ (29 బంతుల్లో 40, 6 ఫోర్లు, 1 సిక్సర్‌) ధాటిగా ఆడి తొలి వికెట్‌కు 85 పరుగులు జోడించి విజయాన్ని ఖాయం చేశారు. దీప్తికి ‘ప్లేయర్‌ ఆఫ్‌ ద మ్యాచ్‌’ అవార్డు లభించింది. ఆసియా కప్‌లో భాగంగా పాకిస్థాన్‌పై 7 టీ20లలో భారత్‌కు ఇది ఆరో విజయం కావడం గమనార్హం.