
తెలంగాణ ప్రభుత్వం గ్రూప్ -2 తేదీలను వాయిదా వేయడం నిరుద్యోగుల విజయం అని రాష్ట్ర అధికార ప్రతినిధి శ్రీమతి రాణీ రుద్రమ తెలిపారు. గ్రూప్-2 పరీక్షా తేదీల వాయిదా కోసం నిరుద్యోగుల పక్షాన నిలబడి బిజెపి చేసిన పోరాటానికి ప్రభుత్వం దిగి వచ్చిందని ఆమె చెప్పారు. కొత్త తేదీల ప్రకటన తో పాటు పోస్టుల పెంపుపై కూడా ప్రభుత్వం సానుకూల నిర్ణయం తీసుకోవాలని ఆమె స్పష్టం చేశారు.
కాగా, డీఎస్సీ పరీక్షలతో పాటు నిరుద్యోగుల ఆందోళనల నేపథ్యంలో తెలంగాణ ప్రభుత్వం గ్రూప్-2 పరీక్షను వాయిదా వేసింది. ఈ పరీక్షలను డిసెంబరులో నిర్వహించనున్నారు. కొత్త తేదీలను త్వరలోనే ప్రకటించనున్నామని పేర్కొంటూ శుక్రవారం తెలంగాణ పబ్లిక్ సర్వీస్ కమిషన్ ప్రకటన విడుదల చేసింది. ముందుగా నిర్ణయించిన షెడ్యూల్ ప్రకారం… ఆగస్ట్ 7, 8 తేదీల్లో ఈ పరీక్షలు జరగాల్సి ఉంది.
గత పదేళ్లుగా జాబ్ క్యాలెండర్ కోసం, ప్రభుత్వ ఉద్యోగాల భర్తీ కోసం బిజెపి లాఠీ దెబ్బలకు, అక్రమ అరెస్టులకు బెదరకుండా అనేక ధర్నాలు, రాలీలు , నిరసనల రూపంలో పోరాటo చేసిందని రాణి రుద్రమ గుర్తు చేశారు. కాంగ్రెస్ ఎన్నికల సమయంలో ఇచ్చిన హామీ మేరకు జాబ్ క్యాలెండర్ విడుదల చేసే వరకు, ప్రతి ఉపాధ్యాయ ఖాళీ భర్తీ అయ్యేట్టు మెగా డీఎస్సీ వేసే వరకు బిజెపి పోరాటం ఆగదని ఆమె తేల్చి చెప్పారు.
యువత కు ఉపాధి కల్పించే విషయంలో తీసుకొస్తామన్న యువ పాలసీని కూడా ప్రభుత్వం అమలు చేయాలని రాణి రుద్రమ డిమాండ్ చేశారు. నిరుద్యోగుల భవిష్యత్తును దృష్టిలో ఉంచుకుని , గత ప్రభుత్వ నిర్లక్ష్య దోరణి వలె కాకుండా , కేవలం నోటిఫికేషన్ , పరీక్షల వరకే పరిమితం కాకుండా ఉద్యోగ నియామకం జరిగే వరకు ఎటువంటి పొరపాట్లు, పేపర్ లీకేజీ లు లేకుండా ప్రభుత్వం దృష్టి పెట్టాలని ఆమె కోరారు.
మరోవైపు తెలంగాణలో ఉపాధ్యాయ ఖాళీల భర్తీకి నిర్వహిస్తున్న డిఎస్సీ పరీక్షలు గురువారం జూలై 18 నుంచి ప్రారంభం అయ్యాయి. ఆన్లైన్‌లో పరీక్షలు జరుగుతున్నాయి. తెలంగాణ వ్యాప్తంగా 11,062 పోస్టుల భర్తీకి 2.79 లక్షల దరఖాస్తులు అందాయి. ఆన్లైన్ పరీక్షలు ఆగస్టు 5వ తేదీతో ముగియనున్నాయి.
More Stories
ఓ ఉగ్రవాది అరెస్టుతో ఉలిక్కిపడ్డ బోధన్
జూబ్లీ హిల్స్ లో బిఆర్ఎస్ అభ్యర్థి మాగంటి సునీత
కాళేశ్వరం రూ. లక్ష కోట్ల అవినీతిపై సిబిఐ విచారించాలి