బంగ్లాదేశ్ అంతటా కర్ఫ్యూ, 109మంది బలి.. రంగంలోకి సైన్యం!

బంగ్లాదేశ్ అంతటా కర్ఫ్యూ, 109మంది బలి.. రంగంలోకి సైన్యం!

* భారతీయ విద్యార్థులు, పౌరులు అందరూ సురక్షితం

1971లో పాకిస్థాన్​తో జరిగిన విమోచన యుద్ధంలో పాల్గొన్న సైనికుల పిల్లలతో సహా ప్రభుత్వ ఉద్యోగాల్లో సగానికి పైగా నిర్దిష్ట వర్గాల రిజర్వేషన్​ కోసం ప్రవేశపెట్టిన కోటా విధానానికి వ్యతిరేకంగా బంగ్లాదేశ్​లో జరుగుతున్న నిరసనలు తీవ్రస్థాయికి చేరాయి. పరిస్థితులు చెయ్యి దాటిపోవడంతో ప్రధాని షేక్​ హసీనా ప్రభుత్వం ఆర్మీని రంగంలోకి దింపింది. దేశవ్యాప్తంగా కర్ఫ్యూని విధించింది.

కర్ఫ్యూ నేపథ్యంలో రాజధాని నగరం ఢాకాలో బహిరంగ సభలపై నిషేధం పడింది. ర్యాలీలను సైతం నిషేధించారు. ప్రజా భద్రత కోసం ఈ నిర్ణయం తీసుకున్నట్టు ​ అధికారులు వెల్లడించారు. అయినప్పటికీ నిరసనకారులు వెనక్కి తగ్గటంలేదు! భారీ ఎత్తున్న రోడ్ల మీదకు వచ్చి నిరసనలు వ్యక్తం చేశారు. ఫలితంగా పలు ప్రాంతాల్లో పోలీసులు- ఆందోళనకారుల మధ్య ప్రతిష్టంభన కనిపించింది.

బంగ్లాదేశ్​లో నిరసనలు చేస్తున్న వారిలో ఎక్కువగా విద్యార్థులే ఉన్నారు. కోటా వ్యవస్థను తీసివేయాలని డిమాండ్​ చేస్తూ షేక్​ హసీనా 15ఏళ్ల ప్రభుత్వానికి సవాలు విసురుతున్నారు. నిరసనలను నియంత్రించేందుకు ప్రభుత్వం అన్ని విధాలుగా కృషిచేస్తున్నా, అవి మాత్రం రోజురోజుకు పెరుగుతూనే ఉన్నాయి.

బంగ్లాదేశ్​ నిరసనల్లో ఇప్పటివరకు 109మంది ప్రాణాలు కోల్పోయారు. వీరిలో 50మందికిపైగా మంది ప్రజలు ఒక్క శుక్రవారమే మరణించారు. వీరిలో చాలా మంది పోలీసుల తూటాలకు ప్రాణాలు విడిచిన వారే ఉన్నారు. గురువారం మరో 25మంది ప్రాణాలు కోల్పోయారు. విద్యార్థులపై కాల్పుల విషయంపై ఐక్యరాజ్య సమితి మానవ హక్కుల చీఫ్​ వొల్కర్​ టర్క్​ దిగ్బ్రాంతి వ్యక్తం చేస్తూ ఆమోదయోగ్యం కాని విషయం అని పేర్కొన్నారు.

కానీ బంగ్లాదేశ్​లో పరిస్థితులు రోజురోజుకు ఆందోళనకరంగా మారుతున్నాయి. నర్సింగ్ది జిల్లాలోని జైలులోకి చొరబడిన నిరసనకారులు ఖైదీలను విడుదల చేశారు. అనంతరం ఆ జైలుకు నిప్పంటించారు. వందకుపైగా మంది ఖైదీలు తప్పించుకున్నట్టు అధికారులు భావిస్తున్నారు. ఇక ప్రభుత్వ ఆస్తులే లక్ష్యంగా నిరసనకారులు పేట్రేగిపోతున్నారు. పోలీసు భవనాలు, ప్రభుత్వ కార్యాలయాలను ధ్వంసం చేస్తున్నారు.

మరోవైపు ఈ కోటాను ఆ దేశ సుప్రీంకోర్టు సస్పెండ్​ చేసింది. కానీ సుప్రీంకోర్టు తీర్పును ప్రభుత్వం సవాలు చేసింది. షేక్​ హసీనా 2009 నుంచి బంగ్లాదేశ్​ని పాలిస్తున్నారు. ఇటీవలే ముగిసిన ఎన్నికల్లో, ఎలాంటి విపక్షం లేకుండా మరోసారి విజయం సాధించారు.

బంగ్లాదేశ్​లో ఉద్రిక్త పరిస్థితుల నేపథ్యంలో అక్కడ జీవిస్తున్న భారతీయులు, చదువుకుంటున్న విద్యార్థులు జాగ్రత్తగా ఉండాలని విదేశాంగశాఖ స్పష్టం చేసింది. ఢాకాలోని భారత హైకమిషన్, బిఎస్ఎఫ్, బ్యూరో ఆఫ్ ఇమ్మిగ్రేషన్‌తో సమన్వయంతో, బంగ్లాదేశ్ నుండి భారతదేశానికి తిరిగి వచ్చే భారతీయ విద్యార్థులకు, మూడు సరిహద్దు క్రాసింగ్‌లు (బెనాపోల్-పెట్రాపోల్, గెడే-దర్శన మరియు అఖౌరా-అగర్తలాతో సహా) సౌకర్యాలు కల్పిస్తోంది. ప్రస్తుతం విద్యార్థులు, భారతదేశానికి రావడానికి సిద్ధంగా ఉన్న భారతీయ పౌరుల కోసం కూడా సరిహద్దులను తెరిచారు.

శుక్రవారం రాత్రి 8 గంటల నాటికి, 125 మంది భారతీయ విద్యార్థులతో సహా మొత్తం 245 మంది భారతీయులు సురక్షితంగా భారత గడ్డకు చేరుకున్నారని ఆ వర్గాలు తెలిపాయి. హింస. ఇదిలా ఉండగా, బంగ్లాదేశ్‌లో భారతీయ పౌరులందరూ “సురక్షితంగా, మంచిగా” ఉన్నారని విదేశాంగ మంత్రిత్వ శాఖ పేర్కొన్నది. అదే సమయంలో వారు సంబంధిత అధికారులతో సంప్రదింపులు జరుపుతున్నారు.
 
విదేశీ వ్యవహారాల మంత్రిత్వ శాఖ అధికార ప్రతినిధి రణధీర్ జైస్వాల్ మాట్లాడుతూ, “మేము దీనిని బంగ్లాదేశ్ అంతర్గత విషయంగా చూస్తున్నాము. మా భారతీయ పౌరులందరూ అక్కడ సురక్షితంగా ఉన్నారు.  8,500 మంది విద్యార్థులు, 15,000 మంది భారతీయ పౌరులు బంగ్లాదేశ్‌లో నివసిస్తున్నారు, వారిలో చాలా మంది వైద్య విద్యను అభ్యసిస్తున్నారు. వారంతా మా హైకమిషన్,  అసిస్టెంట్ హైకమిషన్‌లతో కూడా సంప్రదింపులు జరుపుతున్నారు, వారికి అవసరమైన ఏదైనా సహాయం అందించడానికి మేము వారితో నిరంతరం సన్నిహితంగా ఉంటాము” అని తెలిపారు.