రత్నభాండాగారంలో స్వామి సంపద అంతా భద్రం!

రత్నభాండాగారంలో స్వామి సంపద అంతా భద్రం!

కోట్ల మంది భక్తులు ఉత్కంఠగా ఎదురుచూసిన ఒడిశాలోని పూరీ జగన్నాథుని రత్నభాండాగారం రహస్య గదిని 46 ఏళ్ల తర్వాత గురువారం తెరిచారు. భారీ పెట్టెలు, అల్మారాల్లో ఉన్న జగన్నాథుని ఆభరణాలను తాత్కాలిక స్ట్రాంగ్‌రూమ్​కు తరలించారు. ఒడిశా రాష్ట్ర ప్రభుత్వం జస్టిస్‌ బిశ్వనాథ్‌ రథ్‌ అధ్యక్షతన ఏర్పాటు చేసిన 11 మంది సభ్యుల సమక్షంలో గురువారం ఉదయం 9.51 గంటలకు రహస్య గదిని తెరిచారు. 

12వ శతాబ్ధం నాటి పూరీ జగన్నాథుని ఆలయంలోని ఈ రత్న భాంఢాగారం ఓ అంతుచిక్కని రహస్యంగా నిలిచింది. ముందుగా సంప్రదాయం ప్రకారం జగన్నాథుడికి తోబుట్టువులకు పూజాదికాలు నిర్వహించిన తరువాత ఈ గదిని తెరిచారు. ఆలయంలోకి వెళ్లే ముందు కమిటీ ఛైర్మన్, ఒడిషా హైకోర్టు రిటైర్డ్ జడ్జి జస్టిస్ విశ్వనాథ్ రథ్ విలేకరులతో మాట్లాడారు. రత్న భండార్‌లో లోపలి గదిలోని విలువైన వస్తువులన్నింటిని సక్రమ రీతిలో తరలించేందుకు దేవదేవుడి ఆశీస్సులు తీసకున్నట్లు వివరించారు.

సాయంత్రం 5.15 వరకు దశల వారీగా సంపదను స్ట్రాంగ్‌రూమ్​కు చేర్చారు. ఎలాంటి అవాంఛిత ఘటనలు జరగకుండా శ్రీక్షేత్రం వెలుపల గట్టి పోలీసు బందోబస్తు ఏర్పాటు చేశారు. అలాగే ఉదయం 8 నుంచి భక్తుల ప్రవేశాలు కూడా నిలిపివేశారు. ముందు జాగ్రత్తగా ఆలయం లోపల ఓడ్రాఫ్‌ జవానులను, స్నేక్‌ హెల్ప్‌లైన్​ను సిద్ధంగా ఉంచారు. 

గ్యాస్‌ కట్టర్లు, హైమాస్ట్‌ దీపాలు, ఆక్సిజన్‌ సిలిండర్లు తీసుకెళ్లినా, వాటి అవసరం రాలేదని అధికారులు తెలిపారు. సాయంత్రం 6 గంటలకు వెలుపలకు వచ్చిన జస్టిస్‌ రథ్, శ్రీక్షేత్ర పాలనాధికారి అరవింద పాడి విలేకరులకు రత్నభాండాగారం వివరాలు వెల్లడించారు.

“రహస్య గదిలో పెద్ద పరిమాణంలో 3 పెట్టెలున్నాయి. వాటిలో రెండు కలప, ఒకటి స్టీల్​తో చేసినవి. అలాగే 4 భారీ సైజు అల్మారాలు కూడా ఉన్నాయి. వాటిలో మూడు కలపతో, ఒకటి స్టీల్‌తో చేసినవి. ఈ అల్మారాల్లో చిన్న కంటైనర్‌ తరహా పెట్టెల్లో స్వామివారి ఆభరణాలున్నాయి. వాటి వివరాలు బహిర్గతం చేయకూడదని ప్రతిజ్ఞ చేశాం. కనుక వాటిలో ఎంత సంపద ఉందో వెల్లడించలేం. అయితే స్వామి సంపద మొత్తం భద్రంగా ఉంది. ఎక్కడా చెక్కు చెదరలేదు” అని జస్టిస్‌ బిశ్వనాథ్‌ రథ్‌ వెల్లడించారు.

ఇక రహస్య గది నుంచి సొరంగమార్గం ఉందన్న అంశాన్ని తాము పరిశీలించలేదని తెలిపారు. ప్రభుత్వ మార్గదర్శకాల్లో దాని గురించి ప్రస్తావన లేదని గుర్తు చేశారు. పురావస్తు శాఖ (ఏఎస్‌ఐ) ఈ భాండాగారం మరమ్మతులను చేపడుతుందని చెప్పారు. సొరంగ మార్గం గురించి, మరిన్ని రహస్య గదుల గురించి లేజర్‌ స్కానింగ్‌ ద్వారా శోధించాలంటే ప్రభుత్వ అనుమతి తప్పనిసరి అని తెలిపారు. 

భాండాగారం మరమ్మతులు, సంపద లెక్కింపు పూర్తయ్యాక, అధ్యయన సంఘం మరోసారి సమావేశమై రహస్య గదులను శోధించడంపై ప్రభుత్వంకు సిఫార్సు చేస్తుందని చెప్పారు. “ప్రస్తుతానికి మాకు అప్పగించిన బాధ్యతను మేము నెరవేర్చాం. స్వామివారి సంపదను తాత్కాలిక ఖజానాలో భద్రపరిచి సీల్‌ చేయించాం. ఇదంతా వీడియోగ్రఫీ కూడా చేయించాం. లోపల పాములు, విష కీటకాలు లాంటివి ఏమీ లేవు” అని జస్టిస్‌ బిశ్వనాథ్‌ రథ్‌ వివరించారు.

విలువైన నగలు ఇతర వస్తువుల తరలింపు దశలో ఇక్కడ ఉండి, తరలింపును పర్యవేక్షించాలని తాము పూరి రాజవంశీకుడు గజపతి మహారాజ దివ్య సింగ్ దేవ్‌ను కోరినట్లు జస్టిస్ రథ్ తెలిపారు. ఆయన ఆదేశాల మేరకే తాత్కాలిక కోశాగారం ఏర్పాటు చేసినట్లు వివరించారు. గురువారమే అంతర్ వలయపు గది నుంచి వస్తువుల తరలింపు పూర్తవుతుందని తెలిపారు.