పట్టాలు తప్పిన దిబ్రూగఢ్ ఎక్స్ ప్రెస్.. అంతకు ముందే పేలుడు శబ్దం!

పట్టాలు తప్పిన దిబ్రూగఢ్ ఎక్స్ ప్రెస్.. అంతకు ముందే పేలుడు శబ్దం!
ఉత్తర ప్రదేశ్ లోని గోండా జిల్లాలో చండీగఢ్‌- డిబ్రూగఢ్‌ ఎక్స్‌ప్రెస్‌ రైలు పట్టాలు తప్పిన ఘటనలో నలుగురు మరణించారు. 20 మంది గాయపడ్డారు. గురువారం మధ్యాహ్నం 2.35 గంటల ప్రాంతంలో ఈ ప్రమాదం జరిగింది. సమాచారం అందుకున్న స్థానిక పోలీసులు, అధికారులు వెంటనే అక్కడకు చేరుకుని సహాయక చర్యలు చేపట్టారు. 
 
క్షతగాత్రులను సమీపంలోని ఆసుపత్రికి తరలించారు.అయితే, రైలు ప్రమాదంపై ముందే ఓ పేలుడు శబ్దాన్ని లోకో పైలట్ విన్నట్లు రైల్వేలు తెలుపుతున్నాయి.
 ప్రమాదానికి గురైన రైలు ఉదయం 11.30 గంటలకు చండీగఢ్‌ స్టేషన్‌ నుంచి అసోంలోని డిబ్రూగఢ్‌కు బయల్దేరింది. 
 
గురువారం మధ్యాహ్నం యూపీలోని ఝులాహి రైల్వే స్టేషన్‌కు కొన్ని కిలోమీటర్ల దూరంలో రైలులోని నాలుగు ఏసీ బోగీలు సహా 12 బోగీలు పట్టాలు తప్పాయి. అయితే రైలు పట్టాలు తప్పిన వెంటనే ప్రయాణికుల్లో భయాందోళనలు నెలకొన్నాయి. వారంతా కేకలు వేయడం ప్రారంభించారు. రైలు ఆగిన వెంటనే దిగి పరుగులు తీశారు.
 
ప్రమాదంలో మృతి చెందిన వారి కుటుంబాలకు రూ.10 లక్షల రైల్వే ఎక్స్గ్రేషియా ప్రకటించింది. తీవ్రందగా గాయపడ్డ వారికి రూ.2.5 లక్షలు, స్వల్పంగా గాయపడ్డ వారికి రూ.50000 అనౌన్స్ చేసింది. సిఆర్ఎస్ విచారణతో పాటు, ఉన్నత స్థాయి విచారణకు ఆదేశించింది.
 

మరోవైపు, గోండా జిల్లాలో జరిగిన రైలు ప్రమాదంపై ముఖ్యమంత్రి యోగి ఆదిత్యనాథ్ ఆవేదన వ్యక్తం చేశారు. వెంటనే ఘటనా స్థలానికి చేరుకుని సహాయక చర్యలను వేగవంతం చేయాలని అధికారులను ఆదేశించారు. క్షతగాత్రులకు సరైన చికిత్స అందించాలని ఆదేశాలు జారీ చేశారు. 

 
అసోం సీఎం హిమంత బిశ్వశర్మ కూడా రైలు ప్రమాదంపై స్పందించారు. పరిస్థితిని పర్యవేక్షిస్తున్నట్లు, సంబంధిత వర్గాలతో ఆయన సంప్రదింపులు జరిపినట్లు సీఎంఓ వెల్లడించింది. మృతుల్లో తమ రాష్ట్రానికి చెందిన వారెవరు లేరని హిమంత బిశ్వశర్మ తెలిపారు. ప్రమాదం గురించి తెలుసుకుని దిగ్భ్రాంతికి గురయ్యానని చెప్పారు.