గడ్చిరోలి జిల్లాలో 12 మంది మావోయిస్టులు హతం

గడ్చిరోలి జిల్లాలో 12 మంది మావోయిస్టులు హతం
మహారాష్ట్ర గడ్చిరోలి జిల్లాలో భద్రతా బలగాలు, మావోయిస్టులకు మధ్య ఎదురుకాల్పులు జరిగాయి. ఈ ఘటనలో మావోయిస్టులకు భారీ ఎదురుదెబ్బ తగిలింది. కాల్పుల్లో 12 మంది మావోయిస్టులు ప్రాణాలు కోల్పోయారు. ఈ సందర్భంగా సంఘటనా స్థలం నుంచి పెద్ద ఎత్తున ఆటోమేటిక్‌ ఆయుధాలను పోలీసులు స్వాధీనం చేసుకున్నారు. 
 
కనీసం ఆరు గంటల పాటు ఎదురుకాల్పులు జరిగినట్లు సమాచారం. మధ్యాహ్నం సమయంలో ఎదురుకాల్పులు మొదలయ్యాయని.. సాయంత్రం 6 గంటల వరకు కొనసాగినట్లు అధికారులు తెలిపారు. కాల్పుల అనంతరం సంఘటనా స్థలంలో సోదాలు నిర్వహించగా.. ఇప్పటి వరకు 12 మంది మావోయిస్టుల మృతదేహాలు లభ్యమయ్యాయి.
 
సంఘటనా స్థలంలో మూడు ఏకే47లు, కార్బైన్‌, ఎస్‌ఎల్‌ఆర్‌ సహా ఏడు ఆటోమేటెడ్‌ ఆయుధాలను స్వాధీనం చేసుకున్నారు. మృతుల్లో తిప్పగడ దళం ఇన్‌చార్జి డీవీసీఎం లక్ష్మణ్‌ ఆత్రం, విశాల్‌ ఆత్రం ఉన్నట్టు పోలీసులు ధ్రువీకరించారు.  లక్ష్మణ్‌ ఆత్రం తిపగద్ నక్సల్ దళం ఇన్‌చార్జీగా నిర్థారించారు. మృతి చెందిన ఇతర నక్సలైట్లను గుర్తించేందుకు, ఈ ప్రాంతంలో మరింతగా గాలింపులకు దిగినట్లు ఎస్‌పి వెల్లడించారు. మావోయిస్టుల కోసం భద్రతా బలగాలు అటవీ ప్రాంతంలో సెర్చ్‌ ఆపరేషన్‌ నిర్వహిస్తుండగా భద్రతా బలగాలు, మావోయిస్టులకు మధ్య వందోలియా అటవీ ప్రాంతంలో ఎదురుకాల్పులు జరిగాయి. 
 
ఘటనలో సీ60కి చెందిన పోలీస్‌ ఇన్‌స్పెక్టర్‌తో పాటు జవాన్‌కు బుల్లెట్‌ గాయాలయ్యాయి. వీరు ప్రమాదకర పరిస్థితి నుంచి బయటపడ్డారని , వెంటనే అక్కడి నుంచి వీరిని నాగ్‌పూర్‌కు తరలించారని వెల్లడించారు. కాగా ఈ ఘటనకు సంబంధించి వెంటనే మహారాష్ట్ర హోం మంత్రి దేవెంద్ర ఫడ్నవిస్ స్పందించారు. ఈ ఆపరేషన్‌లో పాల్గొన్న సి 60 కమాండో బృందాలకు రూ 51 లక్షల పారితోషికం ప్రకటించారని జిల్లా ఎస్‌పి నీలోత్పల్ మీడియాకు తెలిపారు. మృతుల్లో ఇద్దరు తెలుగువారు ఉన్నట్లుగా సమాచారం. పూర్తి వివరాలు తెలియాల్సి ఉన్నది.