
* ఆర్ఎస్ఎస్ వారపత్రిక `వివేక్’ కధనం
మరికొద్ది నెలల్లో అసెంబ్లీ ఎన్నికలు జరుగనున్న మహారాష్ట్రాలో ఇటీవల జరిగిన లోక్ సభ ఎన్నికలలో ఎదురుదెబ్బలు తగలడంతో బీజేపీలో అంతర్మధనం మొదలైంది. అసెంబ్లీ ఎన్నికలలో గెలుపొంది, తమ ప్రభుత్వాన్ని నిలబెట్టుకోవాలనే పట్టుదల ఆ పార్టీలో పెరుగుతుంది. అటువంటి సమయంలో లోక్ సభ ఎన్నికలలో పార్టీ పరాజయంకు దారితీసిన కారణాలపై ప్రముఖ మరాఠి వారపత్రిక `వివేక్’ ప్రచురించిన కధనం ఆసక్తి కలిగిస్తుంది.
అజిత్ పవార్ నేతృత్వంలోని నేషనలిస్ట్ కాంగ్రెస్ పార్టీతో పొత్తు పెట్టుకున్న కారణంగానే మహారాష్ట్రలో ఓటర్ల మనోభావాలు భారతీయ జనతా పార్టీ (బిజెపి)కి వ్యతిరేకంగా మారాయని, ఫలితంగా ఇటీవల జరిగిన లోక్ సభ ఎన్నికలలో ఆ పార్టీ ప్రతికూలతను ఎదుర్కోవలసి వచ్చిమదని ఆర్‌ఎస్‌ఎస్ పరివార్ కు చెందిన ప్రముఖ మరాఠీ వారపత్రిక `వివేక్’ పేర్కొంది.
లోక్‌సభ ఎన్నికల్లో బీజేపీకి ఎదురుదెబ్బ తగలడానికి గల కారణాలను విశ్లేషించేందుకు ముంబై, కొంకణ్, పశ్చిమ మహారాష్ట్రకు చెందిన 200 మంది వ్యక్తులతో ‘వివేక్’ అనధికారిక సర్వే నిర్వహించింది. లోక్‌సభకు 48 మంది సభ్యులను పంపిన మహారాష్ట్రలో బిజెపి సీట్ల సంఖ్య 2019 ఎన్నికలలో 23 నుండి తొమ్మిదికి పడిపోయింది.
సర్వే ప్రకారం, గత ఏడాది జూలైలో తన బాబాయ్ శరద్ పవార్ ఎన్‌సిపిని చీల్చి ‘మహాయుతి’ సంకీర్ణంలో చేరిన పవార్‌తో జతకట్టాలనే పార్టీ నిర్ణయాన్ని బిజెపి సభ్యులు, మద్దతుదారులు అంగీకరించడంలేదు. ఫిబ్రవరిలో ఎన్నికల సంఘం నిజమైన ఎన్‌సిపిగా గుర్తించిన అజిత్ పవార్ వర్గం కేవలం ఒక్క సీటు మాత్రమే గెలుచుకో కలిగింది. ముఖ్యమంత్రి ఏక్‌నాథ్ షిండే నేతృత్వంలోని శివసేన లోక్‌సభలో ఏడు స్థానాలను కైవసం చేసుకుంది.
ఎన్‌సిపితో పొత్తుపై రాష్ట్ర బిజెపి శ్రేణులలో అసంతృప్తి నెలకొన్నట్లు ఈ కధనం వెల్లడించింది. ప్రతిపక్ష మహా వికాస్ అఘాడి (ఎంవిఎ) 48 స్థానాలకు గాను 30 స్థానాలను గెలుచుకుంది. ఇందులో భాగమైన కాంగ్రెస్ 13, శివసేన (యుబిటి) 9, ఎన్‌సిపి (ఎస్‌పి) 7 స్థానాలు గెలుచుకున్నాయి. ఎన్‌సిపితో పొత్తు పెట్టుకున్న తరువాత బిజెపి విమర్శలను ఎదుర్కొంటు వస్తున్నది.
ఎన్‌సిపితో చేతులు కలిపిన తర్వాత సెంటిమెంట్‌లు పార్టీకి (బిజెపి) పూర్తిగా వ్యతిరేకంగా ఉంటుండడం, రాజకీయ సమీకరణలకు వ్యతిరేకంగా ఉంటూఉండడంతో పార్టీ భవిష్యత్తు ప్రణాళికలపై కూడా ప్రశ్న తలెత్తుతుందని ఆ కధనం తెలిపింది.
“సంస్థలోని నాయకత్వ పటిమను పెంచుకునే సాంప్రదాయ ప్రక్రియను దాటవేస్తూ” ఇతర పార్టీల నుండి నాయకులను చేర్చుకునే బిజెపి ధోరణి గురించిన ఆందోళనలు వ్యక్తం అవుతున్నట్లు ఈ కథనం వెల్లడించింది. ఈ కథనం అంతర్గత పార్టీ సమన్వయం, నిర్ణయాత్మక ప్రక్రియలలో బిజెపి కార్యకర్తల సాధికారతపై కూడా దృష్టి సారించింది. ఇటువంటి అంశాలే మధ్యప్రదేశ్‌లో బిజెపి విజయానికి కీలకంగా దోహదపడటంతో ఆ రాష్ట్రంలోని మొత్తం 29 లోక్ సభ స్థానాలను మొదటిసారిగా గెల్చుకోగలిగిన్నట్లు ఈ సందర్భంగా ప్రస్తావించింది.
కాగా, అజిత్ పవార్ వర్గానికి చెందిన కొందరు నేతలు శరద్ పవార్ వర్గంలోకి తిరిగి వెళ్లేందుకు సుముఖంగా ఉన్నట్లు కధనాలు వెలువడుతూ ఉండటం ఆందోళన కలిగిస్తున్నది. ఈ నేపథ్యంలో దశాబ్దాలుగా ఎన్సీపీకి కంచుకోటగా ఉన్న పింప్రి-చించ్వాడ్‌కు చెందిన నలుగురు నేతలు రాజీనామా చేయడం అజిత్ పవార్ వర్గానికి ఎదురుదెబ్బగా భావిస్తున్నారు. శరద్ పవార్ ఎన్సీపీ వర్గంలో వీరు చేరుతారని సమాచారం.
మరోవైపు మహారాష్ట్ర మంత్రి, సీనియర్ ఎన్సీపీ నేత ఛగన్ భుజ్‌బల్ కూడా అజిత్ పవార్‌ను విడిచిపెట్టనున్నట్లు ఊహాగానాలు వినిపిస్తున్నాయి. ఇటీవల శరద్ పవార్‌ను ఆయన ఇంట్లో కలిశారు. మహా వికాస్ అఘాడిలో భాగమైన శివసేన (యూబీటీ) నేతతో కూడా గత నెలలో ఆయన సమావేశమయ్యారు
More Stories
గాంధీజీ శాంతి, సహనం, సత్యం సందేశం మానవాళికి ప్రేరణ
మాలవీయ మిషన్ పేద విద్యార్థులకు ఆర్థిక సహాయం
సుంకాల యుద్ధం మధ్య స్వదేశీ, స్వావలంబనలకై భగవత్ పిలుపు