నీట్‌ యూజీ పేపర్‌ లీక్‌ కేసులో మరో ఇద్దరు అరెస్ట్‌

నీట్‌ యూజీ పేపర్‌ లీక్‌ కేసులో మరో ఇద్దరు అరెస్ట్‌
దేశవ్యాప్తంగా ఎంబీబీఎస్‌, బీడీఎస్‌ తదితర మెడికల్‌ కోర్సుల్లో ప్రవేశాల కోసం నిర్వహించిన జాతీయ అర్హత, ప్రవేశ పరీక్ష నీట్‌ యూజీ 2024  పేపర్‌ లీకేజీ అంశం ప్రస్తుతం దేశవ్యాప్తంగా దుమారం రేపుతోంది. ఈ అంశంపై సెంట్రల్‌ బ్యూరో ఆఫ్‌ ఇన్వెస్టిగేషన్‌ (సిబిఐ) ముమ్మరంగా దర్యాప్తు చేపడుతోంది. ఈ నేపథ్యంలోనే తాజాగా మరో ఇద్దరిని సీబీఐ అరెస్ట్‌ చేసింది.
ఈ ఇద్దరి అరెస్ట్‌తో నీట్‌ పరీక్ష లీకేజీ, మోసం, ఇతర అవకతవకలకు సంబంధించి అరెస్టయిన వారి సంఖ్య 14కి చేరింది.  అరెస్టైన వారిని బీహార్‌లోని పాట్నాకు చెందిన పంకజ్‌ కుమార్‌, జార్ఖండ్‌లోని హజారీబాగ్‌కు చెందిన రాజు సింగ్‌గా గుర్తించారు.  పంకజ్‌ కుమార్‌ పేపర్‌ లీక్‌ మాఫియాలోని వ్యక్తిగా అధికారులు భావిస్తున్నారు. ఇతడు నీట్‌-యూజీ ప్రశ్నపత్రాలను దొంగలించినట్లు ఆరోపించారు.
ఇక ప్రశ్నపత్రాన్ని లీక్‌ చేయడంలో పంకజ్‌కు రాజు సహాయం చేసినట్లు భావిస్తున్నారు. ప్రస్తుతం వీరిద్దరినీ అదుపులోకి తీసుకున్న సీబీఐ అధికారులు విచారిస్తున్నారు.  ఈ కేసులో ప్రధాన నిందితుడిగా భావిస్తున్న రాకీ అలియాస్‌ రాకేష్‌ రంజన్‌తో సహా మరో 13 మంది నిందితులను సీబీఐ జూలై 12న బీహార్‌లో కస్టడీలోకి తీసుకున్న విషయం తెలిసిందే.
మరోవైపు నీట్‌-యూజీ పరీక్షల్లో అవకతవకలపై దాఖలైన పిటిషన్లపై సర్వోన్నత న్యాయస్థానం గత గురువారం విచారణ జరిపిన విషయం తెలిసిందే.  కేంద్రం, ఎన్‌టీఏ దాఖలు చేసిన అఫిడవిట్లను సుప్రీంకోర్టు స్వీకరించింది. ఈ కేసులో వాదనలు జరిగే ముందు అఫిడవిట్లను పరిశీలించాల్సి ఉండడంతో సీజేఐ జస్టిస్‌ చంద్రచూడ్‌ నేతృత్వంలోని త్రిసభ్య ధర్మాసనం విచారణను జులై 18 (గురవారానికి)కి వాయిదా వేసింది.
కేంద్రం, ఎన్‌టీఏ దాఖలు చేసిన అఫిడవిట్లపై పిటిషనర్లు స్పందనను దాఖలు చేయాల్సి ఉండగా.. విచారణను వాయిదా వేస్తూ నిర్ణయం తీసుకున్నది. నీట్‌ ప్రవేశపరీక్షలో అక్రమాలపై విచారణ జరుపుతున్న సిబిఐ ఆరు ఎఫ్‌ఐఆర్‌లను నమోదు చేసింది.