ఎక్స్‌లో 100 మిలియన్ల ఫాలోయర్లను దాటిన ప్రధాని మోదీ

ఎక్స్‌లో 100 మిలియన్ల ఫాలోయర్లను దాటిన ప్రధాని మోదీ
ప్రధాని నరేంద్ర మోదీ సరికొత్త మైలురాయిని దాటారు. సోషల్ మీడియా ప్లాట్‌ఫామ్ ‘ఎక్స్’లో (గతంలో ట్విట్టర్) అత్యధిక ఫాలోవర్ల జాబితాలో అగ్రస్థానంలో నిలిచారు. ప్రస్తుతం ట్విట్టర్ లో ఫాలోయర్ల సంఖ్య 100 మిలియన్లకు చేరింది. ఎక్స్ లో ఫాలోవర్ల సంఖ్యలో మరే నాయకుడు మోదీ  కంటే ముందులేరు. ఆయనకు సమీపంలో కూడా మరెవ్వరూ లేరు.
 
ఈ స్థాయిలో ఫాలోయర్లు ఉన్న దేశాధ్యక్షుడు గానీ, ప్రధానమంత్రి గానీ మరొకరు లేరు. గతంలో కూడా 100 మిలియన్లను అందుకున్న వారు మరెవరూ లేరు కూడా. ప్రత్యేకించి గత మూడు సంవత్సరాల వ్యవధిలో ఈ ఫాలోవర్ల సంఖ్య అమాంతం పెరగడం ప్రాధాన్యతను సంతరించుకుంది. 2021 నాటికి ఈ సంఖ్య 30 మిలియన్లుగా ఉండేది. తాజాగా ఇప్పుడది 100 మిలియన్లను అధిగమించింది. 
 
జాతీయ, అంతర్జాతీయంగా దీనితో పోటీ పడే మరో నాయకుడు లేడు. ఈ క్రమంలో అమెరికా అధ్యక్షుడు జో బైడెన్, దుబాయ్ కింగ్ షేక్ మహ్మద్, పోప్ ఫ్రాన్సిస్‌నూ దాటేశారు. అమెరికా అధ్యక్షుడు జో బైడెన్‌కు 38.1 మిలియన్ల ఫాలోవర్లు ఉన్నారు. దుబాయ్ కు చెందిన షేక్ మహమ్మద్ ను 11.2 మిలియన్లు ఎక్స్ లో ‘ఫాలో’ చేశారు. పోప్ ఫ్రాన్సిస్ కు 18.5 మిలియన్ల మంది ఫాలోవర్లు ఉన్నారు.
 
భారత దేశంలో ప్రతిపక్ష నేత రాహుల్ గాంధీ ఎక్స్ అకౌంట్‌ను ఫాలో అవుతున్న వారు 26.40 మిలియన్ల మంది. ఢిల్లీ ముఖ్యమంత్రి అరవింద్ కేజ్రీవాల్‌- 27.5, సమాజ్‌వాదీ పార్టీ అధినేత అఖిలేష్ యాదవ్‌- 19.9, పశ్చిమ బెంగాల్ ముఖ్యమంత్రి మమతా బెనర్జీ- 7.4, లాలూ ప్రసాద్ యాదవ్- 6.3, తేజస్వి యాదవ్- 5.2, శరద్ పవార్- 2.9 మిలియన్ల మంది ఫాలోవర్లు ఉన్నారు.
 
అంతే కాదు ఎంటర్టైన్‌మెంట్ ప్రపంచంలో చాలా మంది సెలబ్రిటీల కంటే మోదీ ముందున్నారు. టేలర్ స్విఫ్ట్ కు 95.3 మిలియన్ల మంది ఫాలోవర్లు ఉన్నారు. లేడీ గాగాను అనుసరించే వారి సంఖ్య 83 మిలియన్లకు పైగా ఉంది. కిమ్ కర్దాషియాన్‌కు 75.2 మిలియన్ల మంది ఫాలోవర్లు ఉన్నారు. ఎక్స్ తో పాటు, ఇతర సోషల్ మీడియా ప్లాట్ ఫామ్ లలో కూడా ప్రధాని మోదీకి చాలా మంది ఫాలోవర్లు ఉన్నారు. 2009లో ఎక్స్ (అప్పుడు ట్విట్టర్)లో చేరారు. 
 
అయితే, ఎక్స్ లో ఫాలోవర్ల సంఖ్య పరంగా మోదీ మాత్రమే కాదు, విరాట్ కోహ్లీ కూడా తన ఫీల్డ్ లో ప్రపంచంలో ఉత్తమంగా ఉన్నాడు. ఎక్స్ లో విరాట్ ఫాలోవర్స్ సంఖ్య 64.1 మిలియన్లు. బ్రెజిల్ స్టార్ నేమార్ కు 63.6 మిలియన్ల మంది ఫాలోవర్లు ఉన్నారు. బాస్కెట్ బాల్ దిగ్గజం లెబ్రాన్ జేమ్స్ కు 52.9 మిలియన్ల మంది ఫాలోవర్స్ ఉన్నారు.