
* ఓలికి శుభాకాంక్షలు తెలిపిన ప్రధాని మోదీ, ఖర్గే
అస్థిరతకు మారుపేరైన హిమాలయ దేశం నేపాల్‌లో కొత్త ప్రభుత్వం కొలువుదీరింది. నూతన ప్రధాన మంత్రిగా కేపీ శర్మ ఓలీ సోమవారం ప్రమాణ స్వీకారం చేశారు. రాష్ట్రపతి భవన్‌లోని ప్రధాన భవనం శీతల్ నివాస్‌లో అధ్యక్షుడు రామచంద్ర పౌడెల్ ఓలి చేత ప్రమాణ స్వీకారం చేయించారు.
రాజ్యాంగం ప్రకారం ఓలి ప్రమాణ స్వీకారం అనంతరం 30 రోజులలోపు పార్లమెంటులో తన బలాన్ని నిరూపించాల్సి వుంది. 275 సీట్లు కలిగిన పార్లమెంట్ ప్రతినిధుల సభలో ఓలి విశ్వాసపరీక్షలో నెగ్గాలంటే కనీసం 138 ఓట్లు కావాల్సి వుంది. ఆయనతోపాటు 22 మంత్రులు ప్రమాణం చేశారు. కాగా, నేపాల్ ప్రధానిగా ఓలీ బాధ్యతలు చేపట్టడం ఇది నాలుగోసారి కావడం విశేషం.
అంతకుముందు ప్రధానిగా ఉన్న పుష్పకమల్ దహల్ అలియాస్ ప్రచండ నేతృత్వంలోని సంకీర్ణ ప్రభుత్వం ఇటీవలే కుప్పకూలింది. శుక్రవారం ప్రజా ప్రతినిధుల సభలో విశ్వాస పరీక్షలో ప్రధాని పుష్పకుమార్ దహల్ ప్రచండ ఓడిపోయారు. 275 సీట్లున్న సభలో విశ్వాస తీర్మానం నెగ్గడానికి 138 సీట్లు కావాల్సి ఉండగా.. ప్రచండకు అనుకూలంగా 63 సీట్లు మాత్రమే వచ్చాయి.
194 ఓట్లు వ్యతిరేకంగా పడటంతో ప్రచండ ప్రధాని పదవి నుంచి వైదొలిగారు. దీంతో నేపాల్-యునైటెడ్ మార్క్సి స్ట్ లెనినిస్ట్ (సీపీఎన్-యూఎంఎల్), నేపాల్ కాంగ్రెస్ (ఎన్సీ)లతో ఏర్పడిన సంకీర్ణ ప్రభుత్వంలో కొత్త ప్రధానిగా ఓలిని అధ్యక్షుడు రామ్‌చంద్ర పౌడెల్ ఆదివారం నియమించారు.
మరోవైపు ఓలి నేతృత్వంలోని సీపీఎన్-యూఎంఎల్, మరో మాజీ ప్రధాని షేర్ బహదూర్ దేవ్బా సారథ్యంలోని నేపాలీ కాంగ్రెస్ (ఎన్సీ) కూటమి మధ్య కొన్ని రోజుల క్రితమే అధికారం పంచుకోవడంపై ఒప్పందం కుదుర్చుకున్న విషయం తెలిసిందే. ఈ ఒప్పందం ప్రకారం.. తొలి 18 నెలలు ఓలి ప్రధానిగా ఉంటారు. ఆ తర్వాత పార్లమెంటు గడువు ముగిసే వరకూ దేవ్బా ప్రధానిగా కొనసాగుతారు.
కాగా, ఓలి గతంలో మూడుసార్లు నేపాల్ ప్రధానిగా పనిచేశారు. 2015 (అక్టోబర్ 11) – 2016 (ఆగస్టు 3), 2018 (ఫిబ్రవరి 5)-2021 (జులై 13), ఆ తర్వాత కూడా కొన్ని రోజులు ప్రధానిగా పనిచేశారు. ఇప్పుడు నాలుగోసారి అధికారం చేపట్టారు.
నేపాల్ ప్రధానిగా భాద్యతలు చేపట్టిన ఓలికి భారత ప్రధాని నరేంద్ర మోదీ, కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు మల్లికార్జున్ ఖర్గేలు శుభాకాంక్షలు తెలిపారు. ‘ఇరుదేశాల మధ్య స్నేహబంధాలను మరింత బలోపేతం చేయడానికి, ప్రజల పురోగతి మరియు శ్రేయస్సు కోసం పరస్పర ప్రయోజనకరమైన సహకారాన్ని మరింత విస్తరించడానికి, సన్నిహితంగా పనిచేయడానికి ఎదరుచూస్తున్నాము’ అని ప్రధాని మోదీ ఎక్స్‌లో పేర్కొన్నారు.
నేపాల్ ప్రధానిగా నియమితులైన కె.పి.శర్మ ఓలికి భారత జాతీయ కాంగ్రెస్ తరపున శుభాకాంక్షలు అని ఖర్గే పేర్కొన్నారు.
More Stories
నేపాల్ తాత్కాలిక నాయకత్వంపై నేపాల్ జెన్ జెడ్‌లో చీలిక!
వారణాసిలో చదివిన నేపాల్ కాబోయే ప్రధాని కార్కి
నేపాల్ తాత్కాలిక ప్రధానిగా సుశీల కర్కిని ఒప్పించిన ఆర్మీ చీఫ్