జింబాబ్వేను చిత్తుచేసి సిరీస్ కైవసం చేసుకున్న యువ భారత్

జింబాబ్వేను చిత్తుచేసి సిరీస్ కైవసం చేసుకున్న యువ భారత్
విరాట్‌ కోహ్లి, రోహిత్‌ శర్మ, రవీంద్ర జడేజా వంటి దిగ్గజాలు పొట్టి ఫార్మాట్‌కు దూరం కావడంతో వారు లేకుండానే బరిలోకి దిగిన యువ క్రికెటర్లు జింబాబ్వేలో జైత్రయాత్రకు శ్రీకారం చుట్టారు. ఐదు మ్యాచుల టీ20 సిరీస్‌ను 4-1తో సొంతం చేసుకొని జింబాబ్వేను చిత్తు చేశారు. నామమాత్రపు ఐదో మ్యాచ్‌లో ఆతిథ్య జింబాబ్వేపై 42 పరుగుల తేడాతో ఘన విజయం సాధించిన భారత్‌ పొట్టి సిరీస్‌ ట్రోఫీతో స్వదేశానికి రానుంది. 
 
మిడిల్‌ ఆర్డర్‌ బ్యాటర్‌ సంజు శాంసన్‌ (58, 45 బంతుల్లో 1 ఫోర్‌, 4 సిక్స్‌లు) అర్థ సెంచరీతో మెరువగా, ఆల్‌రౌండర్‌ శివం దూబె (26, 12 బంతుల్లో 2 ఫోర్లు, 2 సిక్స్‌లు) డెత్‌ ఓవర్లలో ధనాధన్‌ ఇన్నింగ్స్‌తో శివమెత్తాడు. తొలుత బ్యాటింగ్‌ చేసిన భారత్‌ సంజు శాంసన్‌, శివం దూబె మెరుపులతో నిర్ణీత 20 ఓవర్లలో 6 వికెట్లకు 167 పరుగులు చేసింది. 
 
ఛేదనలో జింబాబ్వే చతికిలపడింది. పేసర్‌ ముకేశ్‌ కుమార్‌ (4/11) నిప్పులు చెరిగే ప్రదర్శనతో 18.3 ఓవర్లలో 125 పరుగులకే కుప్పకూలింది. డియాన్‌ మేయర్స్‌ (34, 32 బంతుల్లో 4 ఫోర్లు, 1 సిక్స్‌), ఫరాజ్‌ అక్రమ్‌ (27, 13 బంతుల్లో 2 ఫోర్లు, 2 సిక్స్‌లు) ఆతిథ్య జట్టుకు మూడెంకల స్కోరు అందించారు. పేస్‌ ఆల్‌రౌండర్‌ శివం దూబె ‘మ్యాన్‌ ఆఫ్‌ ది మ్యాచ్‌’గా నిలువగా స్పిన్‌ ఆల్‌రౌండర్‌ వాషింగ్టన్‌ సుందర్‌ ‘ప్లేయర్‌ ఆఫ్‌ ది సిరీస్‌’ అవార్డు అందుకున్నాడు. 
 
4-1తో టీ20 సిరీస్‌ విజయం అందుకున్న భారత కెప్టెన్‌ శుభ్‌మన్‌ గిల్‌ పొట్టి సిరీస్‌ ట్రోఫీ అందుకోవటంతో టీమ్‌ ఇండియా శిబిరంలో సంబురాలు మొదలయ్యాయి. 168 పరుగుల ఛేదనలో ఆతిథ్య జింబాబ్వే ఏ దశలోనూ లక్ష్యం దిశగా సాగలేదు. పేసర్‌ ముకేశ్‌కుమార్‌ పవర్‌ప్లేలో రెండు వికెట్లతో జింబాబ్వేను కోలుకోలేని దెబ్బ కొట్టాడు. ఆ తర్వాత స్పిన్‌, పేస్‌ ఉచ్చులో పడిన జింబాబ్వే బ్యాటర్లు కోలుకోలేదు. 
 
టాప్‌ ఆర్డర్‌లో మారుమని (27), డియాన్‌ మేయర్స్‌ (34)లు మెరిసినా.. మిడిల్‌ ఆర్డర్‌ నిరాశపరిచింది. కెప్టెన్‌ సికిందర్‌ రజా (8), జొనాథన్‌ కాంప్‌బెల్‌ (4), క్లైవ్‌ (1) తేలిపోయారు. టెయిలెండర్లలో ఫరాజ్‌ అక్రమ్‌ (27) మెరవటంతో జింబాబ్వే వంద పరుగుల మార్క్‌ దాటేసింది. ముకేశ్‌ నాలుగు వికెట్లు పడగొట్టగా.. దూబె రెండు వికెట్లతో చెలరేగాడు. వాషింగ్టన్‌ సుందర్‌, అభిషేక్‌ శర్మ, తుషార్‌ దేశ్‌పాండే తలా ఓ వికెట్‌ ఖాతాలో వేసుకున్నారు.
 
టాస్‌ ఓడి తొలుత బ్యాటింగ్‌కు వచ్చిన టీమ్‌ ఇండియాకు ఈసారి ఓపెనర్లు ఆశించిన ఆరంభం అందించలేదు. నాల్గో టీ20లో అజేయ అర్థ సెంచరీలు బాదిన యశస్వి జైస్వాల్‌, శుభ్‌మన్‌ గిల్‌లు పవర్‌ప్లేలోనే వికెట్‌ కోల్పోయారు. యశస్వి (12), గిల్‌ (13), అభిషేక్‌ (14) నిరాశపరచగా భారత్‌ 40/3తో ఒత్తిడిలో పడింది. ఈ సమయంలో సంజు శాంసన్‌ (58) బాధ్యతాయుత ఇన్నింగ్స్‌తో ఆదుకున్నాడు.
 
మిడిల్‌ ఆర్డర్‌లో రియాన్‌ పరాగ్‌ (22, 24 బంతుల్లో 1 సిక్స్‌), శివం దూబె (26)తో కలిసి ఇన్నింగ్స్‌కు ముందుకు తీసుకెళ్లాడు. పరిస్థితులకు అనుగుణంగా ఆడిన సంజు శాంసన్‌ నాలుగు ఫోర్లతో 39 బంతుల్లో అర్థ సెంచరీ సాధించాడు. ఆఖర్లో శివం దూబె ధనాధన్‌తో స్కోరు బోర్డు వేగం పుంజుకుంది. రింకూ సింగ్‌ (11 నాటౌట్‌) ఓ సిక్సర్‌తో అలరించాడు. జింబాబ్వే బౌలర్లలో బ్లెసింగ్‌ (2/19), సికిందర్‌ రజా (1/37), బ్రాండన్‌ మావుట (1/39) రాణించారు.