ఎంటిఎన్‌ఎల్‌ కార్యకలాపాలు బిఎస్‌ఎన్‌ఎల్‌కు అప్పగింత!

ఎంటిఎన్‌ఎల్‌ కార్యకలాపాలు బిఎస్‌ఎన్‌ఎల్‌కు అప్పగింత!

*  వినియోగదారులకు చౌక ప్లాన్ అందిస్తున్న బిఎస్‌ఎన్‌ఎల్‌

ప్రభుత్వ రంగ టెల్కోలు బిఎస్‌ఎన్‌ఎల్‌, ఎంటిఎన్‌ఎల్‌ల విలీన ప్రతిపాదనపై కేంద్రం వెనక్కి తగ్గిందని సమాచారం. ఎంటిఎన్‌ఎల్‌కు ఉన్న భారీ అప్పులే ఇందుకు కారణమని సంబంధిత వర్గాలు తెలిపాయి. కాగా ప్రస్తుతానికి విలీన అంశాన్ని పక్కనపెట్టి ఎంటిఎన్‌ఎల్‌ కార్యకలాపాలను బిఎస్‌ఎన్‌ఎల్‌కు అప్పగించే అంశాన్ని ప్రభుత్వం కీలకంగా పరిశీలిస్తోందని వెల్లడించాయి. 

ఈ ప్రతిపాదనను తొలుత సెక్రటరీల కమిటీ ముందు ఉంచి ఆ తర్వాత కేబినెట్‌ ఆమోదానికి పంపించనున్నారు. అయితే దీనికి ఒక నెల రోజుల సమయం పట్టచ్చని సమాచారం. అప్పుల్లో ఉన్న ఎంటిఎన్‌ఎల్‌ను బిఎస్‌ఎన్‌ఎల్‌లో విలీనం చేయడం ఎంతమాత్రం సరైందని కాదని కేంద్రం భావిస్తోంది. 

ఎంటిఎన్‌ఎల్‌ ప్రస్తుతం ఢిల్లీ, ముంబయి నగరాల్లో మాత్రమే కార్యకలాపాలు కలిగి ఉంది. ఈ రెండు నగరాలు మినహా దేశమంతటా బిఎస్‌ఎన్‌ఎల్‌ సేవలు అందిస్తుంది. ఈ ఏడాది జులై 20కి బాండ్‌ హోల్డర్లకు చెల్లించాల్సిన వడ్డీ చెల్లింపులకూ నిధుల కొరతను ఎదుర్కొంటుంది. 2023 ముగింపు నాటికి 46 లక్షల మంది వినియోగదారులుండగా, ప్రస్తుతం ఈ సంఖ్య 41 లక్షలకు తగ్గింది. 

2024 మార్చి 31తో ముగిసిన ఆర్థిక సంవత్సరంలో ఎంటిఎన్‌ఎల్‌ రూ.3,303 కోట్ల నష్టాలు చవి చూసింది. ఇంతక్రితం ఏడాది రూ.2,911 కోట్ల నష్టాలు నమోదయ్యాయి. ఇదే సమయంలో కంపెనీ రెవెన్యూ రూ.862 కోట్లుగా ఉండగా, 2023-24లో నష్టాలు 15 శాతం తగ్గి రూ.728 కోట్లుగా నమోదయ్యాయి. 2024 మార్చి ముగింపు నాటికి ఎంటిఎన్‌ఎల్‌ రూ.25,795 కోట్లుగా ఉన్నాయి.

బిఎస్‌ఎన్‌ఎల్‌ ప్రస్తుత ఛైర్మన్‌ అండ్‌ మేనేజింగ్‌ డైరెక్టర్‌ పికె పుర్వర్‌ పదవీ కాలం పెంపునకు డిపార్టుమెంట్‌ ఆఫ్‌ టెలికం (డిఒటి) శాఖ నిరాకరించింది. డిఒటి సీనియర్‌ టెలికం ఆఫీసర్‌ డిడిజి రాబర్ట్‌ జె రవికి అదనపు బాధ్యతలు అప్పగించనున్నారని సమాచారం. పుర్వర్‌ 2019లో సిఎండి బాధ్యతలను స్వీకరించారు. పదవీకాలం కోసం ఆయన పెట్టుకున్న దరఖాస్తును డిఒటి పక్కన పెట్టిందని తెలుస్తోంది. టెలికం సర్వీసు ఆఫీసర్‌గా రవికి 34 ఏళ్ల విశేష అనుభవం ఉంది. డిఒటి డిప్యూటీ డైరెక్టర్‌ జనరల్‌గా పని చేశారు. బిఎస్‌ఎన్‌ఎల్‌లోనూ ఆరేళ్ల పాటు ఆడిషనల్‌ జనరల్‌ మేనేజర్‌గా పని చేసిన అనుభవం ఉంది.

ప్రయివేటు టెల్కోలు ఇటీవల భారీగా టారీఫ్‌లను పెంచిన వేళ బిఎస్‌ఎన్‌ఎల్‌ మాత్రం తన వినియోగదారులపై భారం మోపకుండా చౌక ప్లాన్లను ఆఫర్‌ చేస్తోంది. 35 రోజుల గడువుతో రూ.107కే రీచార్జ్‌ ప్లాన్‌ను ప్రవేశపెట్టింది. ఈ ప్లాన్‌ కింద 200 నిమిషాలు ఏ నెట్‌వర్క్‌కైనా మాట్లాడుకోవడానికి వీలుంది. అదే విధంగా 3జిబి ఉచిత డాటాను అందిస్తుంది. 

ఇటీవల ప్రయివేటు టెల్కోలు రిలయన్స్‌ జియో, ఎయిర్‌టెల్‌, వొడాఫోన్‌ ఐడియా తమ టారీఫ్‌లను 25 శాతం వరకు పెంచిన విషయం తెలిసిందే. కాగా.. జియో 28 రోజుల కాలపరిమితి ప్లాన్‌కు కనీసం టారీఫ్‌ను రూ.189గా నిర్ణయించింది. ఇందులో అన్‌లిమిటెడ్‌ వాయిస్‌ కాలింగ్‌, 2బిజి డాటాను అందిస్తుంది. 

ఎయిర్‌టెల్‌ బేసిక్‌ ప్లాన్‌ రూ.199 ప్రీపెయిడ్‌ రీచార్జి ప్లాన్‌ 28 రోజుల గడువుతో ఉంది. వొడాఫోన్‌ ఐడియా 28 రోజుల కాలపరిమితితో రూ.199 ప్రీపెయిడ్‌ రీచార్జి ప్లాన్‌ను అందిస్తుంది. వీటితో పోల్చితే బిఎస్‌ఎన్‌ఎల్‌ చౌక ప్లాన్‌గా వినియోగదారులు భావిస్తున్నారు. ప్రస్తుతం ఎంపిక చేసిన నగరాల్లో 4జి సేవలు అందిస్తున్న బిఎస్‌ఎన్‌ఎల్‌ ఆగస్ట్‌ చివరి నాటికి దేశ వ్యాప్తంగా విస్తరించాలని నిర్దేశించుకుంది.