కాంగ్రెస్ తప్పులను మనం చేయెద్దు

కాంగ్రెస్ తప్పులను మనం చేయెద్దు

కాంగ్రెస్‌ను అధికారం నుంచి గద్దె దింపడానికి దారితీసిన తప్పిదాలను బీజేపీ పునరావృతం చేయవద్దని కేంద్ర మంత్రి నితిన్‌ గడ్కరీ స్పష్టం చేశారు. ఈ మేరకు సొంత పార్టీని హెచ్చరించారు. `విభిన్నమైన పార్టీ’ బీజేపీ అన్న ఎల్‌కే అద్వానీ వ్యాఖ్యలను గుర్తు చేశారు. గోవాలో జరిగిన పార్టీ అత్యున్నత స్థాయి సమావేశంలో నితిన్‌ గడ్కరీ మాట్లాడారు. 

అధికారంలో ఉన్నప్పుడు కాంగ్రెస్ పార్టీ చేసిన తప్పుల వల్లనే ప్రజలు బీజేపీని ఎన్నుకున్నారని తెలిపారు. ‘కాంగ్రెస్ చేసిన పనిని మనం కొనసాగిస్తే, (అధికారం నుంచి) వారి నిష్క్రమణ, మన ప్రవేశం వల్ల ప్రయోజనం ఉండదు’ అని తేల్చి చెప్పారు.

కాగా, తన గురువు, మాజీ ఉప ప్రధాని ఎల్‌కే అద్వానీ వ్యాఖ్యలను ఈ సందర్భంగా నితిన్‌ గడ్కరీ ప్రస్తావించారు. ‘మనది విభిన్నత ఉన్న పార్టీ అని అద్వానీ చెప్పేవారు. ఇతర పార్టీల కంటే మనం ఎంత భిన్నంగా ఉన్నామో అర్థం చేసుకోవాలి’ అని హితవు చెప్పారు.

మరోవైపు రాబోయే రోజుల్లో దేశంలో సామాజిక, ఆర్థిక సంస్కరణలు తీసుకురావడానికి రాజకీయాలు ఒక సాధనమని, పార్టీ కార్యకర్తలు ఇది తెలుసుకోవాలని నితిన్‌ గడ్కరీ తెలిపారు. సొంత రాష్ట్రమైన మహారాష్ట్ర రాజకీయాలను ఆయన ప్రస్తావించారు. కుల ప్రాతిపదికన రాజకీయాలు చేయకూడదని సూచించారు.

‘ఈ ధోరణిని అనుసరించకూడదని నేను నిర్ణయించుకున్నా. కుల ఆధారిత రాజకీయాలు చేయబోనని ప్రజలకు చెప్పా. కులం గురించి మాట్లాడే వారికి బలమైన కిక్ వస్తుంది’ అని పేర్కొన్నారు. అలాగే అవినీతి రహిత దేశాన్ని సృష్టించడానికి సరైన ప్రణాళిక చేయాలని పార్టీకి పిలుపునిచ్చారు.