తెలంగాణాలో బిజెపి నం 1గా ఎదిగేందుకు 1500 రోజుల ప్రణాళిక

తెలంగాణాలో బిజెపి నం 1గా ఎదిగేందుకు 1500 రోజుల ప్రణాళిక

తెలంగాణలో బిజెపి నెంబర్ వన్ పార్టీ గా అవతరించేందుకు తమ దగ్గర 1500 రోజుల ప్రణాళిక ఉందని కేంద్ర మంత్రి ధర్మేంద్ర ప్రధాన్ వెల్లడించారు. బిజెపి తెలంగాణ రాష్ట్ర కార్యవర్గ విస్తృత సమావేశంలో ముఖ్యఅతిధిగా పాల్గొంటూ తెలంగానలో 2023 అసెంబ్లీ ఎన్నికల్లో దాదాపు 14 శాతం ఓట్లు సాధిస్తే ఈసారి 35 శాతం ఓట్లు గెలుచుకున్నామని గుర్తు చేశారు. 

గతంలో 8 అసెంబ్లీ నియోజకవర్గాల్లో గెలిపించిన ప్రజలు ఈసారి పార్లమెంట్ ఎన్నికల్లో కూడా 8 సీట్లను అందించారని చెప్పారు.  కాంగ్రెస్ – బీఅర్ఎస్ పాలనలో జరిగిన అవినీతి, అక్రమాలపై నిలదీసి పోరాటం చేసి తెలంగాణలో భారతీయ జనతా పార్టీ నెంబర్ 1 పార్టీగా ఎదిగేలా కార్యకర్తలు సంకల్పంతో పనిచేయాలని ధర్మేంద్ర ప్రధాన్ పిలుపిచ్చారు.

రానున్న రోజుల్లో రాష్ట్రంలో పోలింగ్ బూత్ లెవెల్ లో  భారతీయ జనతా పార్టీని మరింత బలపర్చేలా నాయకులు, కార్యకర్తలు కృషి చేయాలని చెప్పారు. యువత, మహిళలు, రైతులు, పేదల శ్రేయస్సు అకుంఠిత పరిశ్రమతో, గొప్ప సంకల్పంతో పనిచేయాలని సూచించారు.  నాడు ప్రత్యేక తెలంగాణ కోసం బీజేపీ సంపూర్ణ మద్దతు ఇచ్చిందని కేంద్ర మంత్రి గుర్తు చేశారు. 

పదేళ్లుగా తెలంగాణ ను అభివృద్ధి చేసేందుకు కేంద్ర ప్రభుత్వం సహకారం అందిస్తూనే ఉందని చెబుతూ  తెలంగాణ అభివృద్ధికి భారతీయ జనతా పార్టీ కట్టుబడి ఉందని స్పష్టం చేశారు. తెలంగాణలో కాంగ్రెస్ ప్రభుత్వం హిందూ విరోధిగా వ్యవహరిస్తోందని కేంద్ర మంత్రి ఆరోపించారు.   గత పదేళ్ల బీఆర్ఎస్ పాలనలో ఒక కుటుంబం రాష్ట్రాన్ని నాశనం చేసిందని విమర్శించారు.

తెలంగాణలో బిజెపి ప్రభుత్వం ఏర్పాటు అనేది పదవుల కోసం కాదని, తెలంగాణ ప్రజల అభివృద్ధి కోసమే అని కేంద్ర మంత్రి చెప్పారు.  దక్షిణ భారతంలో భారతీయ జనతా పార్టీకి కొత్త శకం మొదలైందని చెబుతూ  గతంలో బిజెపి ఉత్తర భారతదేశానికే పరిమితమని కొంత మంది విమర్శలు చేశారని పేర్కొన్నారు.
ఇటీవల జరిగిన పార్లమెంటు ఎన్నికల ద్వారా దేశ వ్యాప్తంగా బిజెపి ప్రాబల్యమేంటో వారికి అర్థమైందని తెలిపారు.

దక్షిణ భారతంలో భారతీయ జనతా పార్టీ మరింత బలపడిందని, కేరళ లో బిజెపి ఖాతా తెరిచిందని, తమిళనాడు లో మెరుగైన ఓటు బ్యాంక్ సాధించామని ధర్మేంద్ర ప్రధాన్ వివరించారు. పార్లమెంట్ ఎన్నికల్లో మూడోసారి కూడా కాంగ్రెస్ వంద సీట్లు దాటలేదని, 13 రాష్ట్రాల్లో అసలు కాంగ్రెస్ ఖాతానే తెరవలేదని కేంద్ర మంత్రి గుర్తు చేశారు.  అయినా కాంగ్రెస్ నాయకుల తీరు మారలేదని, మాట్లాడుతున్నారని ధ్వజమెత్తారు. .

మూడోసారి నరేంద్ర మోదీ నేతృత్వంలో ఎన్డీయే అధికారంలోకి వచ్చిందని, మరోవంక  ఇండీ కూటమి కి నాయకత్వమే లేదనేది రుజువైందని స్పష్టం చేశారు.
కాంగ్రెస్ రాజ్యాంగాన్ని తరచూ అవమానపరుస్తోందని, బిజెపి పై దుష్ప్రచారం చేస్తోందని విమర్శించారు.  ఎన్డీఏ అధికారంలో ఉన్నన్ని రోజులు రాజ్యాంగాన్ని మార్చే ప్రసక్తే లేదని స్పష్టం చేశారు.  భారతీయ జనతా పార్టీ అధికారంలో ఉండగా రిజర్వేషన్లు కు ఎటువంటి డోకా లేదని భరోసా ఇచ్చారు.

సీఎం రేవంత్ రెడ్డి ప్రాతినిధ్యం వహించిన మల్కాజిగిరిలో, ఆయన సొంత జిల్లా అయిన మహబూబ్నగర్ బీజేపీ జెండా ఎగిరిందని అధ్యక్షత వహించిన రాష్ట్ర పార్టీ అధ్యక్షుడు, కేంద్రమంత్రి జి. కిషన్‌రెడ్డి గుర్తు చేశారు. పదేళ్లు పాలించిన బీఆర్‌ఎస్‌ ఒక్క ఎంపీ సీటు గెలవలేకపోయిందని ఎద్దేవా చేశారు. కాంగ్రెస్ ప్రభుత్వం తక్కువ కాలంలోనే ప్రజల విశ్వాసం కోల్పోయిందని ధ్వజమెత్తారు.

వంద రోజుల్లో ఆరు గ్యారంటీలు అమలు చేస్తామన్నారని, ఎనిమిది నెలలైనా ఇచ్చిన హామీలను అమలు చేయలేదని విమర్శించారు. “భూ, లిక్కర్ మాఫియాను కాంగ్రెస్, బీఆర్ఎస్ ప్రభుత్వాలు ప్రోత్సహించాయి. ప్రజలను వంచించి ఆదాయాన్ని పెంచుకుంటున్నారు. మజ్లిస్ పార్టీ కనుసన్నల్లో కాంగ్రెస్, బీఆర్ఎస్ పని చేస్తున్నాయి” అంటూ కిషన్ రెడ్డి విమర్శించారు. ప్రజా వ్యతిరేకతలో ఒకరిని మించి ఒకరు పోటీ పడుతున్నారని బీఆర్ఎస్, కాంగ్రెస్లపై విరుచుకుపడ్డారు.