
కేంద్ర పాలిత ప్రాంతమైన జమ్ముకశ్మీర్‌లో త్వరలో అసెంబ్లీ ఎన్నికలు నిర్వహించేందుకు ఎన్నికల సంఘం (ఈసీ) కసరత్తు చేస్తున్నది. ఈ నేపథ్యంలో జమ్ముకశ్మీర్ పునర్వ్యవస్థీకరణ చట్టం 2019 నిబంధనలను కేంద్ర హోం వ్యవహారాల మంత్రిత్వ శాఖ సవరించింది. లెఫ్టినెంట్ గవర్నర్ (ఎల్జీ) మనోజ్ సిన్హాకు కేంద్ర ప్రభుత్వం మరిన్ని అధికారాలు కల్పించింది.
అంతర్గత భద్రత, బదిలీలు, ప్రాసిక్యూషన్, అటార్నీ-జనరల్, ప్రభుత్వ న్యాయవాదుల నియామకంతో సహా కీలకమైన విషయాల్లో ఎల్జీదే పెత్తనం కానున్నది.
‘చట్టం ప్రకారం లెఫ్టినెంట్ గవర్నర్ విచక్షణాధికారాన్ని అమలు చేయడానికి పోలీస్, పబ్లిక్ ఆర్డర్, ఏఐఎస్, ఏసీబీ, ఆర్థిక శాఖకు సంబంధించి అవసరమయ్యే ఏ ప్రతిపాదననూ చీఫ్ సెక్రటరీ ద్వారా లెఫ్టినెంట్ గవర్నర్ ముందు ఉంచితే తప్ప ఆమోదం లేదా తిరస్కారం పొందదు’ అని ఆ నోటిఫికేషన్లో పేర్కొన్నారు.
కాగా, జమ్ముకశ్మీర్ కేంద్ర పాలిత ప్రాంత ప్రభుత్వ బిజినెస్ రూల్స్ 2019ను కూడా కేంద్ర హోం వ్యవహారాల మంత్రిత్వ శాఖ సవరించింది. ఈ సవరణలకు రాష్ట్రపతి ద్రౌపది ముర్ము ఆమోదం తెలిపారు. దీంతో జూలై 12న గెజిట్‌లో పేర్కొనడంతో ఈ నిబంధనలు అమలులోకి వచ్చాయి. ఈ నేపథ్యంలో జమ్ముకశ్మీర్‌లో కొత్తగా ఎన్నికయ్యే ప్రభుత్వానికి అధికారాలు పరిమితంగా ఉండనున్నాయి.
ఈ సవరించిన నిబంధనల ద్వారా శాంతి భద్రతల చర్యలకు సంబంధించి పూర్తి అధికారాలు లెఫ్టినెంట్ గవర్నర్ చేతుల్లోనే ఉంటాయి. అంతకుముందు పోలీసు, పబ్లిక్ ఆర్డర్, ఆల్ ఇండియా సర్వీస్, అవినీతి నిరోధక బ్యూరోకు సంబంధించి విచక్షణను అమలు చేయడానికి ఆర్థిక శాఖ సమ్మతి అవసరం ఉండేది.
కానీ కొత్తగా సవరించిన చట్ట నియమాల్లో చొప్పించిన సబ్ రూల్ (2ఎ) ప్రకారం ఆర్థికశాఖ సమ్మతి అవసరం లేదు. పోలీసు, యాంటీ కరప్షన్ బ్యూరో, ఆల్ ఇండియా సర్వీసులకు సంబంధించిన ప్రతిపానదలను ప్రధాన కార్యదర్శి లెఫ్టినెంట్ గవర్నర్ ముందు ఉంచితే ఆయన ఆ ప్రతిపాదనలను అంగీకరిస్తారు లేదా వాటిని తిరస్కరించే అవకాశం ఉంది.
చట్టంలోని ప్రధాన నియమాల్లో 42 తర్వాత.. కొత్తగా 42(ఎ)ను హోం మంత్రిత్వశాఖ చేర్చింది. ఈ నిబంధన ప్రకారం ముఖ్యమంత్రికి న్యాయ వ్యవహారాల్లో ఎలాంటి అధికారం ఉండదు. అడ్వకేట్ జనరల్‌తోపాటు ఇతర న్యాయ అధికారుల నియమకానికి ప్రధాన కార్యదర్శితోపాటు ముఖ్యమంత్రి లెఫ్టినెంట్ గవర్నర్ ఆమోదం కోసం పంపాలి.
ఇక 42బి నియమం ప్రకారం ప్రాసిక్యూషన్ మంజూరు లేదా అప్పీల్‌కు దాఖలకు సంబంధించిన ఏదైనా ప్రతిపాదనను న్యాయశాఖ, జస్టిస్ పార్లమెంటరీ వ్యవహారాల శాఖ ద్వారా ప్రధాన కార్యదర్శి లెఫ్టినెంట్ గవర్నర్ ముందు ఉంచుతారు. 43 నిబంధన కూడా జైళ్లు, డైరెక్టరేట్ ఆఫ్ ప్రాసిక్యూషన్, ఫోరెన్సిక్ సైన్స్ లాబొరేటరీకి సంబంధించిన విషయాలపై కొన్ని నిబంధనలు చేర్చడం జరుగుతుందని ఎంహెచ్ఎ నోటిఫికేషన్ పేర్కొంది.
అడ్మినిస్ట్రేటివ్ సెక్రటరీలు, ఆల్ ఇండియా సర్వీసెస్ ఆషీసర్ క్యాడర్ పోస్టుల పోస్టింగ్ బదీలలకి సంబంధించిన విషయాలకు సంబంధించి లెఫ్టినెంట్ గవర్నర్‌కు అడ్మినిస్ట్రేటివ్ సెక్రటరీ, జనరల్ అడ్మినిస్ట్రేషన్ డిపార్ట్మెంట్ ప్రధాన కార్యదర్శి ద్వారా ప్రతిపాదనను పంపాలి.
More Stories
రైతులకు మరో రెండు పథకాలు ప్రారంభించిన ప్రధాని మోదీ
చొరబాట్లేతోనే ముస్లిం జనాభా అసాధారణంగా పెరుగుదల
మహిళా జర్నలిస్టులు లేకుండా ఆఫ్ఘన్ మీడియా సమావేశం