
ఒక యూనివర్సిటీ వేలల్లో నకిలీ డిగ్రీలు జారీ చేసింది. వీటితో లక్షలాది మంది ప్రభుత్వ ఉద్యోగాలు పొందారు. అయితే నకిలీ డిగ్రీల రాకెట్ గుట్టు ఇటీవల బయటపడింది. ఈ నేపథ్యంలో 3 లక్షల ఉద్యోగాల నియామకంపై దర్యాప్తు చేయాలని ప్రభుత్వం నిర్ణయించింది. రాజస్థాన్‌లో ఈ సంఘటన జరిగింది.
పీటీఐ రిక్రూట్‌మెంట్ పరీక్షను నిర్వహించిన రాజస్థాన్ స్టాఫ్ సెలక్షన్ బోర్డు ఉత్తీర్ణులైన అభ్యర్థుల సర్టిఫికెట్లపై విచారణ జరిపింది. దీంతో నకిలీ డిగ్రీల రాకెట్ బట్టబయలైంది. కాగా, ఎంపికైన 80 మందికి పైగా అభ్యర్థుల డిగ్రీ సర్టిఫికెట్లు ఫేక్ అని తేలింది. వాటిలో 60 సర్టిఫికెట్లను చురులోని ఓం ప్రకాష్ జోగేందర్ సింగ్ యూనివర్సిటీ జారీ చేసింది.
స్పెషల్ ఆపరేషన్స్ పోలీసులు ఆ యూనివర్సిటీపై దాడి చేశారు. కేవలం ఏడుగురు సిబ్బందితో నడుస్తున్న ఆ యూనివర్సిటీ నకిలీ డ్రిగీలు ఇస్తున్నట్లు తెలుసుకున్నారు. ఇప్పటి వరకు సుమారు 43,000 నకిలీ పట్టాలు పంపిణీ చేసినట్లు గుర్తించారు. జమ్ముకశ్మీర్, దక్షిణాది రాష్ట్రాల నుంచి పెద్ద సంఖ్యలో విద్యార్థులు ఈ నకిలీ డిగ్రీలు పొందినట్లు దర్యాప్తులో తేలింది.
దీంతో యూనివర్సిటీ వ్యవస్థాపకుడు, యజమాని జోగీందర్ సింగ్ దలాల్, మాజీ చైర్‌పర్సన్ సరితా కర్వస్రా, మాజీ రిజిస్ట్రార్ జితేంద్ర యాదవ్‌లను జూలై 5న పోలీసులు అరెస్టు చేశారు. మరోవైపు నకిలీ డిగ్రీల రాకెట్ వెలుగులోకి రావడంతో ప్రభుత్వ ఉద్యోగుల నియామక ప్రక్రియలపై దర్యాప్తు చేయాలని రాజస్థాన్ ప్రభుత్వం నిర్ణయించింది. గత ఐదేళ్లలో రిక్రూట్ అయిన మూడు లక్షల మంది ప్రభుత్వ ఉద్యోగుల డిగ్రీ పట్టాలపై విచారణ జరిపించనున్నారు.
అలాగే పరీక్షకు హాజరైన వ్యక్తి, ప్రభుత్వ ఉద్యోగం చేస్తున్న వ్యక్తి ఒకరేనా కాదా అన్నది కూడా దర్యాప్తు చేయనున్నారు. దీని కోసం ప్రతి విభాగం అంతర్గత కమిటీని ఏర్పాటు చేయాలని ప్రభుత్వం ఆదేశించింది. ఈ మేరకు ఉత్తర్వులు జారీ చేసింది.
More Stories
నేపాల్ అలజడులతో చిక్కుకున్న మానసరోవర్ యాత్రికులు
దేశవ్యాప్తంగా ఓటర్ల జాబితా సవరణకు కసరత్తు
భారత్- నేపాల్ సరిహద్దుల్లో హై అలర్ట్