
బీఆర్ఎస్ పాలనలో మూడు రంగుల జెండా మీద గెలిచినవాళ్లు గులాబీ కండువా కప్పుకున్నారని, రేవంత్ రెడ్డి ప్రభుత్వం అధికారంలోకి వచ్చాక గులాబీ కండువాపై గెలిచినవాళ్లు మూడు రంగుల కండువా కప్పుకుంటున్నారని అంటూ బిజెపి ఎద్దేవా చేసింది. డిసెంబరు 9న సోనియా గాంధీ గారి బర్త్ డే కానుకగా రైతు రుణమాఫీ చేస్తామని చెప్పిన రేవంత్ రెడ్డి, అధికారంలోకి వచ్చాక మాట తప్పారని గుర్తు చేసింది. .
రైతు భరోసా పథకం కింద ప్రతి ఎకరాకు ప్రతి సీజన్‌కు రూ. 7,500, ఏడాదికి రూ. 15 వేలు పెట్టుబడి సాయం ఇస్తామని, కౌలు రైతులకు ఎకరానికి రూ. 15 వేలు, రైతు కూలీలకు ఏడాదికి 12 వేల చొప్పున ఆర్థికసాయం చేస్తామని చెప్పి అధికారంలో వచ్చి 7 నెలలు దాటినా అమలు చేయకుండా మీనమేషాలు లెక్కిస్తున్నారని బిజెపి మండిపడింది.
కాంగ్రెస్ నాయకుల మాటలు మాటలు కోటలు దాటుతాయ గాని చేతలు తంగెళ్లు దాటవని బీజేపీ స్పష్టం చేసింది.
నాడు కాంగ్రెస్ పార్టీ ప్రతిపక్షంలో ఉన్నప్పుడు గ్రూప్-1 ప్రిలిమ్స్ నిష్పత్తి 1:100 ప్రకారం ఇవ్వాలని భట్టి విక్రమార్క అసెంబ్లీ సాక్షిగా మాట్లాడారని, ఇప్పుడు అధికారంలోకి వచ్చాక కాంగ్రెస్ ప్రభుత్వం మరోలా వ్యవహరిస్తోందని బీజేపీ గుర్తు చేసింది.నిరుద్యోగులకు రూ. 4 వేల చొప్పున నిరుద్యోగ భృతి ఇస్తామని మర్చిపోయారని, కాని రేవంత్ రెడ్డి మాత్రం నెలానెలా రూ. 4 లక్షల జీతం తీసుకుంటున్నారని బీజేపీ ధ్వజమెత్తింది. తెలంగాణ రాష్ట్రంలో నిరుద్యోగ యువత ఆశలను, ఆకాంక్షలను కాలరాస్తున్నారని బిజెపి ఆగ్రహం వ్యక్తం చేసింది.
గ్రూప్-1 మెయిన్స్ ఎలిజిబిలిటీ 1:100కు పెంపు, గ్రూప్-2లో 2000, గ్రూప్-3లో 3000 ఉద్యోగాలు పెంచుతూ, డీఎస్సీ పరీక్షలు 30 రోజుల పాటు వాయిదా వేయాలని బిజెపి డిమాండ్ చేసింది. నిరుద్యోగులకు న్యాయం జరిగేవరకు బిజెపి ఆధ్వర్యంలో పోరాటం చేయాలని బిజెపి రాష్ట్ర విస్తృత స్థాయి సమావేశం నిర్ణయించింది.
టెలిఫోన్ ట్యాపింగ్ కేసులో ఆధారాలుండగా కేసీఆర్ ను అరెస్ట్ చేయడానికి రేవంత్ రెడ్డి ప్రభుత్వం ఎందుకు భయపడుతోంది?
ఫోన్ ట్యాపింగ్ కేసులో సీబీఐ విచారణ జరపాలని కేంద్రానికి రేవంత్ రెడ్డి లేఖ రాసేందుకు ఎందుకు వెనుకాడుతున్నారు? అంటూ బిజెపి ప్రశ్నించింది. కాళేశ్వరం ప్రాజెక్టులో అవినీతిపై ప్రతిపక్షంలో ఉన్నపుడు సీబీఐ విచారణ జరిపించాలని మాట్లాడిన రేవంత్ రెడ్డి, ఇప్పుడు ఎందుకు నోరుమెదపడం లేదు? అంటూ విస్మయం వ్యక్తం చేసింది.బీఆర్ఎస్ హయాంలో విద్యుత్ కొనుగోళ్లు, గొర్రెల పంపిణీ లో జరిగిన అక్రమాలపై అసలు నిందితులను ఎందుకు అరెస్ట్ చేయడం లేదు? అంటూ బిజెపి రేవంత్ రెడ్డి ప్రభుత్వాన్ని నిలదీసింది. కాంగ్రెస్ ప్రభుత్వంలో ఆర్ టాక్స్, యుకె టాక్స్, బివి టాక్స్ ల పేరుతో వసూళ్లకు పాల్పడుతున్నారని బిజెపి ఆరోపించింది. ప్రైవేటు ఆసుపత్రులకు ఇవ్వాల్సిన బకాయిలు చెల్లించనందున ఆరోగ్య శ్రీ, ఆయుష్మాన్ భారత్ రోగులకు చికిత్స అందడం లేదని ఆందోళన వ్యక్తం చేసింది.
ప్రజాభవన్ లో ప్రజాసమస్యల పరిష్కారం కోసం సమయం ఇచ్చేందుకు ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డికి సమయం దొరకడం లేదు కాని, పదేపదే ఢిల్లీ పర్యటనలకు మాత్రం సమయం దొరుకుతోందని బిజెపి ఎద్దేవా చేసింది.
గ్రామపంచాయతీలు, మండల, జిల్లా పరిషత్ పాలకవర్గాల కాలపరిమితి ముగిసినా ఎన్నికల నిర్వహణపై ప్రభుత్వం నిర్ణయం తీసుకోకుండా స్పెషల్ ఆఫీసర్లతో కాలం వెల్లదీస్తోందని బిజెపి విమర్శించింది.
గ్రామపంచాయతీల్లో పాలన పడకేసి ప్రజలు విషజ్వరాలతో అవస్థలు పడుతున్నారని బిజెపి ఆందోళన వ్యక్తం చేసింది. ప్రజాపాలనను గాలికొదిలేసిన ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ప్రభుత్వాన్ని నిలదీసేలా పోరాటం చేస్తూ, అన్ని వర్గాల ప్రజలకు న్యాయం చేసేలా కృషి చేయాలని బిజెపి రాష్ట్ర కార్యవర్గం నిర్ణయించింది.
More Stories
తిరిగి రాజరికం వైపు నేపాల్ చూస్తున్నదా?
దేశభక్తి, దైవభక్తి పదాలు భిన్నమైనా వేర్వేరు కాదు
ఉపరాష్ట్రపతి ఎన్నికల్లో క్రాస్ వోటింగ్ తో ఆత్మరక్షణలో ప్రతిపక్షాలు