
వివాదాస్పద చర్యలతో వార్తల్లో నిలిచిన ట్రైనీ ఐఏఎస్ అధికారి పూజా ఖేద్కర్‌పై విచారణకు కేంద్రం ఒక ప్యానల్‌ను ఏర్పాటు చేసింది. అదనపు కార్యదర్శి హోదా గల ఓ సీనియర్ ఐఏఎస్ అధికారితో ఏకసభ్య కమిటీని నియమించింది. తన శారీరక అంగ వైకల్య క్యాటగిరీ, ఓబీసీ కోటాను దుర్వినియోగం చేసి ఐఏఎస్ సర్వీస్ సాధించినట్టు పూజాపై వచ్చిన ఆరోపణలపై కమిటీ విచారణ చేస్తుంది. వివాదాస్పద ప్రవర్తన కారణంగా బదిలీ అయిన ఖేద్కర్ గురువారం వాసిం జిల్లా కలెక్టరేట్‌లో అసిస్టెంట్ కలెక్టర్‌గా బాధ్యతలు చేపట్టారు.
కాగా, ట్రైనీ కలెక్టర్‌గా ఉండగానే తనకు ప్రత్యేక ఛాంబర్ కావాలనడం, తన ప్రైవేట్ ఆడీ కారుకు సైరన్, ప్రభుత్వ స్టిక్కర్, వీఐపీ నెంబర్ ప్లేట్లను అనుమతి లేకుండా వాడినట్టు ఆరోపణలు రావడంతో పుణె నుంచి ఆమెను బదిలీ చేశారు. 2023 బ్యాచ్ ఐఏఎస్ అధికారిణి అయిన పూజా ఖేద్కర్ తనకు కంటి, మానసిక సంబంధ సమస్యలు ఉన్నట్లు ఉద్యోగంలో చేరే సమయంలో సమర్పించిన అఫిడవిట్లో చేర్చినట్లు కొన్ని మీడియాల్లో కథనాలు వెలువడుతున్నాయి.
అయితే ఈ సమస్యలకు సంబంధించి మెడికల్ టెస్ట్‌లు చేసేందుకు అధికారులు పిలవగా 6 సార్లు గైర్హాజరై తప్పించుకున్నట్లు తెలుస్తోంది. 2022 ఏప్రిల్లో మొదటిసారి ఢిల్లీ ఎయిమ్స్‌లో మెడికల్ టెస్ట్‌లు చేసేందుకు పూజా ఖేద్కర్‌ను అధికారులు పిలవగా కరోనా సొకిందని చెప్పి వెళ్లలేదు. ఆ తర్వాత కూడా కొన్ని నెలలపాటు మెడికల్ టెస్టులకు హాజరు కాలేదు. చివరికి ఆరోసారి పిలుపురాగా పూర్తిగా టెస్టులు చేయించుకోలేదు.
కంటి సమస్యలకు సంబంధించి కీలకమైన ఎమ్మారై పరీక్షకు పూజా ఖేద్కర్ హాజరుకాలేదని సమాచారం. కానీ ఆమె సివిల్ సర్వీసెస్ అపాయింట్‌మెంట్ ఏదో ఒక రకంగా పూర్తి చేసినట్లు తెలుస్తోంది. ఆ తర్వాత ఐఏఎస్‌గా పూజా ఖేద్కర్ ఎంపికను కమిషన్ ట్రైబ్యూనల్‌లో సవాలు చేయగా 2023 ఫిబ్రవరిలో ఆమెకు వ్యతిరేకంగా తీర్పు కూడా వచ్చింది. అయినా.. పూజా ఖేద్కర్ మాత్రం ఐఏఎస్‌గా ట్రైనింగ్ పొందడం గమనార్హం.
మరోవైపు పూజా ఖేద్కర్ ఓబీసీ ధ్రువీకరణపైనా ఎన్నో వివాదాలు ముసురుకున్నాయి. ఆమె తండ్రి ఒక రిటైర్డ్ ఐఏఎస్ అధికారి అని, ఆయనకు రూ.40 కోట్ల విలువైన ఆస్తులు (మార్కెట్ విలువ ప్రకారం రూ.100 కోట్లకుపైనే ) ఉన్నాయని, అయినా ఆమెకు నాన్ క్రిమిలేయర్ సర్టిఫికేట్ వచ్చినట్లు తెలుస్తోంది. ఆ నాన్ క్రిమిలేయర్ సర్టిఫికేట్ కారణంగానే ఆమెకు సివిల్స్‌లో 841వ ర్యాంక్ వచ్చినా ఐఏఎస్ హోదాను పొందగలిగినట్లు ఆరోపణలు వెల్లువెత్తుతున్నాయి.
పూణేలో అసిస్టెంట్ కలెక్టర్‌గా ఉన్న ప్రొబేషనరీ ఐఏఎస్ అధికారిణి డాక్టర్ పూజా ఖేద్కర్ ఉన్నతాధికారుల అనుమతి లేకుండానే తన ఆడీ కారుకు రెడ్-బ్లూ బీకన్ లైట్లు, వీఐపీ నంబర్ ప్లేటు పెట్టుకున్నారు. అంతేకాకుండా కారుకు మహారాష్ట్ర ప్రభుత్వం అనే స్టిక్కర్ కూడా వేసుకున్నారు. అంతటితో ఆగకుండా తనకు వీఐపీ వసతి సౌకర్యాలు కావాలని, తనకు అధికారిక ఛాంబర్ కేటాయించాలని పట్టుబట్టారు.
అదనపు కలెక్టర్ అజయ్ మోర్ లేని సమయంలో ఆయన గదిని కూడా ఆక్రమించుకోవడం తీవ్ర దుమారానికి కారణం అయింది. పూజా ఖేద్కర్ వ్యవహారం తీవ్రం కావడంతో పూణే కలెక్టర్ డాక్టర్ సుహాస్ దివాసే మహారాష్ట్ర చీఫ్ సెక్రటరీ దృష్టికి తీసుకువెళ్లడంతో ఆమెను పూణే జిల్లా నుంచి వాసిమ్ జిల్లాకు బదిలీ చేశారు. ప్రొబేషన్ కాలం పూర్తయ్యేవరకు అక్కడే సూపర్ న్యూమరరీ అసిస్టెంట్ కలెక్టర్‌గా ఉంటారని వెల్లడించారు.
More Stories
తిరిగి రాజరికం వైపు నేపాల్ చూస్తున్నదా?
దేశభక్తి, దైవభక్తి పదాలు భిన్నమైనా వేర్వేరు కాదు
ఉపరాష్ట్రపతి ఎన్నికల్లో క్రాస్ వోటింగ్ తో ఆత్మరక్షణలో ప్రతిపక్షాలు