సొంత పార్టీ ఎమ్మెల్యేలు, నేతలే ఓడించారు

సొంత పార్టీ ఎమ్మెల్యేలు, నేతలే ఓడించారు
సొంత పార్టీ ఎమ్మెల్యేలు, నేతలే తమను ఓడించారని గత లోక్ సభ ఎన్నికలలో ఓటమి చెందిన కాంగ్రెస్ ఎంపీ అభ్యర్థులు ఏఐసీసీ నియమించిన కమిటీకి చెప్పినట్టు సమాచారం. ఆశించిన స్థాయిలో ఆర్థిక మద్దతు లభించలేదని, నిధుల కొరతతో ఓడామని మరికొందరు చెప్పినట్టు తెలిసింది.
 
అధికారం ఉండగా ఎంపీ ఎన్నికల్లో పార్టీ ఎందుకు విఫలమైంది? మీరంతా ఎందుకు ఓడిపోయారు? అంటూ లోక్‌సభ ఎన్నికల్లో ఓడిపోయిన కాంగ్రెస్‌ అభ్యర్థులను పిజె కురియన్‌ కమిటీ ప్రశ్నించింది. ఈ ప్రశ్నలకు అభ్యర్థులు ఇచ్చిన సమాధానం కమిటీ సభ్యులను విస్మయపరిచినట్టు తెలిసింది. ‘మా కన్నా, మన పార్టీ కన్నా ప్రత్యర్థి పార్టీ అభ్యర్థి బలంగా ఉన్నారు. రాజకీయ ప్రత్యర్థులు కలిసిపోవడంతో వాళ్లను ఎదుర్కోలేకపోయాం’ అంటూ పలువురు సమాధానం చెప్పినట్లు సమాచారం.
 
రాష్ట్రంలో పార్లమెంట్ ఎన్నికల ఫలితాలపై కాంగ్రెస్ నిజ నిర్ధారణ కమిటీ (కురియన్ కమిటీ) మూడు రోజుల పర్యటనను గురువారం ప్రారంభించింది. తొలిరోజు  సమావేశంలో కురియన్ కమిటీ కాంగ్రెస్ ఎంపీలు, ఓడిపోయిన ఎంపీ అభ్యర్థుల నుంచి వివరాలను సేకరించింది. తెలంగాణలో కాంగ్రెస్‌ అధికారంలో ఉన్నప్పటికీ పెద్దగా ప్రభావంలేని బీజేపీతో సమానంగా 8 సీట్లు గెలుపొందడాన్ని పార్టీ అధిష్ఠానం సీరియస్‌గా తీసుకుంది. రాష్ట్రంలో కనీసం 12 సీట్లు గెలవాలని కాంగ్రెస్‌ లక్ష్యంగా పెట్టుకున్నది. అయినా 8 సీట్లకు పరిమితం కావడంతో ఎక్కడ లోపం జరిగిందో తెలుసుకొనేందుకు ఈ కమిటీ నియమించారు. 

పెద్దపల్లి ఎంపీ గడ్డం వంశీ మినహా మిగిలిన 16 మంది హాజరయ్యారు. లోక్‌సభ నియోజకవర్గాల పరిధిలోని ఎమ్మెల్యేలతో శుక్రవారం సమావేశం అవుతున్నారు. కాంగ్రెస్ ఓటమికి కారణాలు తెలుసుకొనే దానికి బదులు బిజెపి ఎందుకు అన్ని సీట్లు గెలిచిందని దృష్టి సారిస్తున్నట్లు తెలుస్తున్నది. జీహెచ్‌ఎంసీ పరిధిలో ఒక్క ఎంపీ సీటు కూడా గెలుచుకోకపోవడంపై కురియన్‌ కమిటీ ఆగ్రహం వ్యక్తం చేసినట్టు తెలిసింది.

గెలిచేందుకు అవకాశం ఉన్న ఆదిలాబాద్‌, మల్కాజిగిరి, సికింద్రాబాద్‌, చేవెళ్ల, మెదక్‌ స్థానాల్లో ఓడటంపై ప్రశ్నలు సంధించినట్టు చెప్తున్నారు. ముఖ్యమంత్రి రేవంత్‌రెడ్డి ప్రాతినిథ్యం వహించిన, సిట్టింగ్‌ స్థానం మల్కాజిగిరిలో ఓడిపోవడంపై కమిటీ ఆశ్చర్యం వ్యక్తం చేసినట్టు సమాచారం. అక్కడ కాంగ్రెస్‌ అభ్యర్థి సునీతా మహేందర్‌రెడ్డి కనీసం పోటీ కూడా ఇవ్వలేకపోయారని ఆగ్రహం వ్యక్తం చేసినట్టు తెలిసింది.

ఇలా ఉండగా, కురియన్‌ కమిటీ ముందు హాజరైన ఓటమి పాలైన అభ్యర్థులు అందరూ ఒకే రకమైన సమాధానాలు చెప్పడం పట్ల కురియన్‌ కమిటీ సభ్యులు ఒక్కింత అసహనం వ్యక్తం చేసినట్టు తెలిసింది. దానితో ఆశ్చర్యం వ్యక్తం చేస్తున్న కురియన్ కమిటీ తమను  కలవడానికి ముందు వారంతా  ఒకేరకంగా చెప్పాలని ఏమైనా మాట్లాడుకున్నారా? అనే అనుమానాన్ని కూడా వ్యక్తం చేసినట్టు తెలిసింది.

‘సీఎం రేవంత్‌రెడ్డి మా విజయం కోసం ఎంతో కష్టపడ్డారు. మమ్మల్ని ఎప్పటికప్పుడు అప్రమత్తం చేస్తూ, దిశా నిర్దేశం చేశారు. ఇన్‌చార్జి మంత్రులు ప్రచారం ముగిసేవరకు చిత్తశుద్ధితో పని చేశారు. అయినప్పటికీ కొన్ని చోట్ల బీజేపీ వేవ్‌, బీఆర్‌ఎస్‌ అభ్యర్థులు వారితో చేతులు కలుపడం వల్లనే విజయం సాధించలేకపోయాం’ అని కురియన్‌ కమిటీ ఎదుట హాజరైన అంతా ఒకే రకంగా చెప్పినట్టు తెలిసింది. 

నిజానిర్దారణ కమిటీ సభ్యులతో పాటు పీసీసీ వర్కింగ్‌ ప్రెసిడెంట్‌ మహేశ్‌కుమార్‌గౌడ్‌, ప్రభుత్వ సలహాదారు హర్కర వేణుగోపాల్‌ ఒకరి తర్వాత ఒకరు అక్కడే ఉండటం వల్ల కొన్ని వాస్తవాలు చెప్పలేకపోయినట్టు ఓడిపోయిన ఒక అభ్యర్థి వాపోయారు.