బడ్జెట్ పై ఆర్థికవేత్తలతో ప్రధాని మోదీ భేటీ

బడ్జెట్ పై ఆర్థికవేత్తలతో ప్రధాని మోదీ భేటీ
త్వరలో కేంద్ర ప్రభుత్వం పార్లమెంట్‌కు బడ్జెట్‌ సమర్పించనున్నది. ఈ క్రమంలో దేశంలోని ప్రముఖ ఆర్థికవేత్తలు, వివిధ రంగాలకు చెందిన నిపుణులతో ప్రధాని నరేంద్ర మోదీ గురువారం భేటీ అయ్యారు. సమావేశానికి ఆర్థికమంత్రి నిర్మలా సీతారామన్‌ సైతం హాజరయ్యారు. ఈ నెల 23న కేంద్రం పార్లమెంట్‌లో బడ్జెట్‌ ప్రవేశపెట్టనున్నది. 
 
ఈ సాధారణ బడ్జెట్‌లో పరిశ్రమలతో పాటు మధ్య తరగతి, దిగువ తరగతి ప్రజలపై భారీ ఆశలే పెట్టుకున్నారు. వాస్తవానికి, మరింత ఎక్కువ పెట్టుబడులను రాబట్టేందుకు కేంద్రం ఆర్థిక సంస్కరణలను వేగవంతం చేయాలని భావిస్తున్నది. గత పార్లమెంట్‌ సమావేశాల సమయంలో రాష్ట్రపతి ద్రౌపది ముర్ము ఉభయ సభలను ఉద్దేశించి మాట్లాడుతూ మోదీ 3.O ప్రభుత్వం సంస్కరణలను వేగవంతం చేయనుందని చెప్పారు.
పెట్టుబడులు రాబట్టడం ద్వారా వృద్ధిరేటు, ఉపాధి అవకాశాలను పెంచేందుకు ప్రభుత్వం వ్యూహం సిద్ధం చేస్తున్నది. అయితే, ఏ రంగంలో ఏ స్థాయిలో సంస్కరణలు అవసరమో ఆయా రంగాల నిపుణుల నుంచి అభిప్రాయాలను సేకరించాలని ప్రధాని మోదీ భావించినట్లు తెలుస్తున్నది. 

2047 నాటికి మోదీ సర్కారు భారత్‌ను అభివృద్ధి చెందిన దేశంగా తీర్చిదిద్దాలని లక్ష్యంగా పెట్టుకున్నది. సాధారణ బడ్జెట్ ద్వారా అభివృద్ధి చెందిన భారతదేశానికి ప్రభుత్వం రోడ్‌మ్యాప్‌ను సిద్ధం చేయాలని.. ఇందుకోసం ప్రత్యేకంగా మౌలిక సదుపాయాల రంగంలో ప్రత్యేక కృషి అవసరమని భావించారు.

ఇక భేటీలో అభివృద్ధి చెందిన భారతదేశానికి సంబంధించిన రోడ్‌మ్యాప్‌పై నిపుణుల నుంచి ప్రధాని సూచనలు కూడా తీసుకోనున్నారు. ఆర్థికవేత్తలతో పాటు వివిధ రంగాలకు చెందిన నిపుణులు సైతం పేద, మధ్య దిగువ మధ్యతరగతి ఉపశమనం కల్పించాలని డిమాండ్ చేస్తున్నారు.

దాంతో ఆదాయపు పన్ను, గృహ రుణాల విషయంలో మధ్యతరగతి, దిగువ మధ్యతరగతి వర్గాలకు ఊరట కల్పించాలని ప్రభుత్వం యోచిస్తోంది. పేదల కోసం కొత్త పథకాన్ని ప్రారంభించే యోచనలో ఉన్నట్లు తెలుస్తున్నది. మధ్యతరగతి, దిగువ మధ్య తరగతులకు అందించాల్సిన ఉపశమనంపై సైతం నిపుణుల అభిప్రాయాలను తీసుకోనున్నట్లు తెలుస్తోంది.