కేజ్రీవాల్‌కు మధ్యంతర బెయిల్‌ .. అయినా జైల్లోనే

కేజ్రీవాల్‌కు మధ్యంతర బెయిల్‌ .. అయినా జైల్లోనే
మద్యం పాలసీ కేసులో ఢిల్లీ ముఖ్యమంత్రి అరవింద్‌ కేజ్రీవాల్‌కు సుప్రీంకోర్టు మధ్యంతర బెయిల్‌ మంజూరు చేసింది. లిక్కర్‌ స్కామ్‌ కేసులో తనను ఎన్‌ఫోర్స్‌మెంట్‌ డైరెక్టరేట్‌ అరెస్ట్‌ చేయడాన్ని సవాల్‌ చేస్తూ కేజ్రీవాల్‌ సుప్రీంకోర్టులో పిటిషన్‌ వేసిన విషయం తెలిసిందే. ఈ పిటిషన్‌పై విచారణ జరిపిన జస్టిస్‌ సంజీవ్‌ ఖన్నా ధర్మాసనం సీఎంకు మధ్యంతర బెయిల్‌ మంజూరు చేసింది. 
 
ఈ సందర్భంగా సుప్రీం ధర్మాసనం కీలక నిర్ణయం తీసుకుంది. ఈ కేసు పూర్తిస్థాయి విచారణ కోసం ఐదుగురు సభ్యుల విస్తృత ధర్మాసనానికి బదిలీ చేస్తూ తీర్పు ఇచ్చింది.  ఈ కేసులో ఢిల్లీ సీఎం కేజ్రీవాల్‌కు రౌస్‌ అవెన్యూ కోర్టు గత నెల 20న బెయిల్‌ మంజూరు చేసిన విషయం తెలిసిందే. అయితే, ట్రయల్‌ కోర్టు తీర్పును ఎన్‌ఫోర్స్‌మెంట్‌ డైరెక్టరేట్‌ తీవ్రంగా వ్యతిరేకిస్తూ గత నెల 21న ఢిల్లీ హైకోర్టును ఆశ్రయించింది.కేజ్రీవాల్‌ బెయిల్‌ దరఖాస్తును వ్యతిరేకించేందుకు దర్యాప్తు సంస్థకు పూర్తి అవకాశం ఇవ్వలేదని హైకోర్టుకు తెలియజేశారు. కేజ్రీవాల్‌కు బెయిల్‌ మంజూరు చేస్తూ ట్రయల్‌ కోర్టు ఇచ్చిన తీర్పుపై స్టే విధించాలని కోరారు. ఈ క్రమంలో విచారణ చేపట్టిన న్యాయస్థానం.. ట్రయల్‌ కోర్టు ఇచ్చిన బెయిల్‌ ఉత్తర్వులపై స్టే విధించింది. 

ఇక బెయిల్‌పై ఢిల్లీ హైకోర్టు మధ్యంతర స్టే ఇవ్వడాన్ని సవాల్‌ చేస్తూ సర్వోన్నత న్యాయస్థాన్నా ఆశ్రయించారు. దీనిపై శుక్రవారం విచారణ చేపట్టిన సుప్రీం ధర్మాసనం తాజాగా మధ్యంతర బెయిల్‌ మంజూరు చేస్తూ తీర్పు ఇచ్చింది. అయితే, సుప్రీం బెయిల్‌ మంజూరు చేసినప్పటికీ కేజ్రీవాల్ జైల్లోనే ఉండాల్సి ఉంటుంది. 

ఇదే కేసులో కేజ్రీవాల్‌ ప్రస్తుతం సీబీఐ కస్టడీలో ఉన్న విషయం తెలిసిందే. తిహార్‌ జైలులో ఉన్న అరవింద్‌ కేజ్రీవాల్‌ను జూన్‌ 21న సీబీఐ అరెస్టు చేసిన విషయం తెలిసిందే. కోర్టు మూడు రోజుల కస్టడీకి ఇచ్చింది. మళ్లీ జూన్‌ 29న ఆయనను సీబీఐ రౌస్‌ అవెన్యూ కోర్టులో హాజరుపరుచగా కోర్టు 14 రోజుల జ్యుడీషియల్‌ కస్టడీ విధించింది. 

ఆ తర్వాత ఈ నెల 12 వరకూ కేజ్రీవాల్‌ కస్టడీని కోర్టు పొడిగించింది. ప్రస్తుతం తీహార్‌ జైలులో సీబీఐ కస్టడీలో ఉన్నారు. ఈ క్రమంలో కేజ్రీవాల్‌ సీబీఐ అరెస్టును ఢిల్లీ హైకోర్టులో సవాల్‌ చేశారు. ప్రస్తుతం విచారణ కొనసాగుతోంది. 2021-22 సంబంధించిన మద్యం పాలసీ కేసులో మార్చి 21న అరవింద్‌ కేజ్రీవాల్‌ను ఈడీ అరెస్టు చేసింది.