కన్ఫర్మ్‌ రైల్ టికెట్‌ లేకుండా ప్రయాణం చేస్తే భారీ జరిమానా

కన్ఫర్మ్‌ రైల్ టికెట్‌ లేకుండా ప్రయాణం చేస్తే భారీ జరిమానా

దేశంలో అతిపెద్ద రవాణా వ్యవస్థలో భారతీయ రైల్వే ఒకటి. దేశవ్యాప్తంగా నిత్యం లక్షలాది మందిని గమ్యస్థానాలకు చేరుస్తూ వస్తున్నది. రైలు ప్రయాణానికి ముందస్తుగా టికెట్‌ బుక్‌ చేసుకునేందుకు అవకాశం ఉంది. చాలామంది తమ ప్రయాణానికి నెల నుంచి రెండునెలల ముందుగానే టికెట్లను బుక్‌ చేసుకుంటుంటారు. 

అయితే, అత్యవసర సమయాల్లో ప్రయాణం కోసం తత్కాల్‌ టికెట్లను సైతం రైల్వే జారీ చేస్తూ వస్తుంది. కొన్ని సందర్భాల్లో పలువురు టికెట్లు దొరకని సందర్భాల్లో వెయిటింగ్‌ టికెట్‌తోనే స్లీపర్‌, ఏసీ క్లాస్‌లో ప్రయాణిస్తుంటారు.  దీంతో ఆయా క్లాస్‌లో ప్రయాణించే వారికి ఇబ్బంది కలుగడంతో పాటు భద్రత విషయంలో రైల్వేశాఖకు ఇబ్బందికరంగా మారింది. 

వాస్తవానికి ఒక క్లాస్‌ టికెట్‌ కొనుగోలు చేసి మరో క్లాస్‌లో ప్రయాణించడం కూడా నేరమే. తాజాగా ఈ విషయంలో రైల్వేశాఖ కీలక నిర్ణయం తీసుకున్నది. వెయిటింగ్ టికెట్‌తో స్లీపర్, ఏసీ క్లాస్‌లో ప్రయాణిస్తూ పట్టుపడితే కఠిన చర్యలు తప్పవని రైల్వేశాఖ హెచ్చరించింది.  టికెట్‌ కన్ఫర్మ్‌ కాకుండా ఏసీ, స్లీపర్‌ కోచ్‌లో ప్రయాణిస్తే జరిమానాతో పాటు కఠిన చర్యలు తీసుకుంటామని స్పష్టం చేసింది. ఈ మేరకు తాజాగా రైల్వేశాఖ కఠిన నిబంధనలను తీసుకువచ్చింది. 

ఇకపై వెయిటింగ్‌ టికెట్‌తో ప్రయాణం స్లీపర్‌ కోచ్‌లో ప్రయాణం చూస్తూ దొరికితే రూ.250, ఏసీ కోచ్‌లో ప్రయాణం పట్టుబడితే రూ.440 జరిమానా విధించడంతో పాటు ఆ తర్వాత స్టేషన్‌ నుంచి అమలయ్యే ఛార్జీలను కలిపి వసూలు చేయనున్నారు. జరిమానా, ఛార్జీలు చెల్లించడంలో విఫలమైనా, నిరాకరించినా రైల్వేచట్టంలోని సెక్షన్‌ 137 ప్రకారం కేసు నమోదు చేసి చట్టపరమైన చర్యల కోసం రైల్వే ప్రొటెక్షన్‌ ఫోర్స్‌కు బదిలీ చేసే అవకాశం ఉంటుంది.