ఈడీ కొత్త ఛార్జిషీటులో 37వ నిందితుడిగా కేజ్రీవాల్

ఈడీ కొత్త ఛార్జిషీటులో 37వ నిందితుడిగా కేజ్రీవాల్
ఎక్సైజ్ పాలసీకి సంబంధించిన మనీ లాండరింగ్ కేసులో ఎన్‌ఫోర్స్‌మెంట్ డైరెక్టరేట్ కొత్త ఛార్జిషీటు దాఖలు చేసింది. ఈ కేసులో 38 మందిని నిందితులుగా పేర్కొనగా, ఢిల్లీ ముఖ్యమంత్రి అరవింద్ కేజ్రీవాల్‌ పేరును 37వ నిందితుడుగా చేర్చింది. ఛార్జిషీటు ప్రకారం, ఈ కేసులో కేజ్రీవాల్‌ను కీలక నిందితుడిగా ఈడీ పేర్కొంది. 
 
గోవా ఎన్నికల్లో ముడుపుల సొమ్ము వినియోగించిన విషయం ఆయనకు తెలుసునని వివరించింది. అరవింద్ కేజ్రీవాల్‌కు, మరో నిందితుడు వినోద్ చౌహాన్‌కు మధ్య జరిగిన వాట్సాప్ ఛాట్ వివరాలను ఛార్జిషీటులో ఈడీ ప్రస్తావించింది. గోవా ఎన్నికల సందర్భంగా కె.కవిత వ్యక్తిగత సహాయకుడు రూ.25.5 కోట్ల సొమ్మును వినోద్‌ ద్వారా ఆమ్ ఆద్మీ పార్టీకి పంపాడని, అరవింద్ కేజ్రీవాల్‌తో వినోద్‌కు మంచి సంబంధాలున్నాయనే విషయం వారి మధ్య జరిగిన ఛాటింగ్‌తో స్పష్టమవుతోందని ఈడీ పేర్కొంది.
 
మరోవంక, తన బెయిల్‌ పిటిషన్‌ను అత్యవసరంగా విచారించాలని ముఖ్యమంత్రి అరవింద్‌ కేజ్రీవాల్‌ చేసిన విజ్ఞప్తిని బుధవారం ఢిల్లీ హైకోర్టు తిరస్కరించింది. ట్రయల్‌ కోర్టు బెయిల్‌ ఆర్డర్‌ను సవాల్‌ చేస్తూ ఈడీ హైకోర్టును ఆశ్రయించగా మధ్యంతర స్టే విధించిన విషయం తెలిసిందే. ఈడీ పిటిషన్‌పై కేజ్రీవాల్‌ ఇచ్చిన సమాధానం అర్ధరాత్రి అందిందని, దీనిపై కౌంటర్‌ దాఖలు చేసేందుకు సమయం కావాలని ఈడీ తరఫున అదనపు సొలిసిటర్‌ జనరల్‌ ఎస్‌వీ రాజు హైకోర్టుకు తెలిపారు. 
 
ఈ మేరకు జస్టిస్‌ నీనా బన్సల్‌ కృష్ణ కేసు విచారణను వాయిదా వేశారు. మంగళవారం రాత్రి 11 గంటలకు కేజ్రీవాల్‌ సమాధానానికి సంబంధించిన కాపీ ఇచ్చారని, కౌంటర్‌ అఫిడవిట్‌ సిద్ధం చేసేందుకు సమయం లేదని ఏఎస్‌జీ తెలిపారు.  కేజ్రీవాల్‌ తరఫున సీనియర్‌ న్యాయవాది అభిషేక్‌ మను సింఘ్వీ వాదనలు వినిపించారు. మంగళవారం మధ్యాహ్నం ఒంటిగంటకు కాపీని ఇన్వెస్టిగేషన్ ఆఫీస్ కి పంపినట్లు సింఘ్వీ తెలిపారు.
 
కేజ్రీవాల్‌కు మంజూరైన బెయిల్‌పై హైకోర్టు స్టే విధించిందని, ఈ కేసు విచారణ అత్యవసరమని పేర్కొన్నారు. కేజ్రీవాల్‌ స్పందనపై కౌంటర్‌ అఫిడవిట్‌ దాఖలు చేసేందుకు ఈడీకి అర్హత ఉందని జస్టిస్‌ కృష్ణ వ్యాఖ్యానించారు. ఈ మేరకు కేసు విచారణను ఈ నెల 15వ తేదీకి వాయిదా వేశారు. ఢిల్లీ మద్యం పాలసీ కేసులో మార్చి 21న ఈడీ అరెస్టు చేసిన విషయం తెలిసిందే. మద్యం పాలసీ కేసులో వచ్చిన సొమ్మును గోవా ఎన్నికలకు ఆమ్‌ ఆద్మీ పార్టీ ఉపయోగించిందని ఈడీ ఆరోపించింది.అయితే, సాక్ష్యాధారాలను చూపడంలో, సొత్తును రికవరీ చేయడంలో ఈడీ విఫలమైందని కేజ్రీవాల్‌ తరఫు న్యాయవాదులు పేర్కొన్నారు. ఈ క్రమంలో ప్రత్యేక కోర్టు కేజ్రీవాల్‌కు గత నెలలో బెయిల్‌ మంజూరు చేసింది. ఆ తర్వాత ఈడీ ఢిల్లీ హైకోర్టును ఆశ్రయించడంతో మధ్యంతర స్టే విధించింది. జూన్ 26న సీబీఐ అరెస్ట్ చేయగా.. కోర్టు ఆయనను 29 వరకు సీబీఐ కస్టడీకి పంపింది. సీబీఐ అరెస్టును సవాల్‌ చేస్తూ పిటిషన్‌ దాఖలు చేయగా.. ప్రస్తుతం హైకోర్టులో పెండింగ్‌లో ఉన్నది.