మోదీకి రష్యా అత్యున్నత పౌర పురస్కారం

మోదీకి రష్యా అత్యున్నత పౌర పురస్కారం

* బాంబులు, తుపాకులు, బుల్లెట్ల మధ్య శాంతి చర్చలు సఫలం కావు
 
రష్యా పర్యటనలో ప్రధాని నరేంద్ర మోదీకి విశిష్ట గౌరవం దక్కింది. ఆ దేశ అత్యున్నత పురస్కారం ‘ది ఆర్డర్‌ ఆఫ్‌ సెంయిట్‌ ఆండ్రూ ది అపోస్టల్‌’ను ప్రకటించింది. ఈ అవార్డును ఆ దేశ అధ్యక్షుడు వ్లాదిమిర్‌ పుతిన్‌ మంగళవారం ప్రధాని మోదీకి ప్రదానం చేశారు.  రష్యా-భారత్ మధ్య ద్వైపాక్షిక సంబంధాల విస్తరణతో పాటు బలోపేతానికి మోదీ చేసిన కృషికి గుర్తింపుగా అత్యున్నత పురస్కారంతో గౌరవించినట్లు తెలిపారు. అయితే, రష్యా పురస్కారం ప్రకటించడంపై ప్రధాని మోదీ సోషల్‌ మీడియా వేదికగా స్పందించారు. 
 
రష్యా ప్రభుత్వం ది ఆర్డర్ ఆఫ్ సెయింట్ ఆండ్రూ ది అపోస్టల్ పురస్కారం అందించడం తనకు దక్కిన గౌరవంగా భావిస్తానని తెలిపారు. 
ఈ సందర్భంగా రష్యా ప్రభుత్వానికి కృతజ్ఞతలు తెలుపుతున్నట్లు పేర్కొన్నారు. అవార్డు 140 కోట్ల మంది భారతీయులకు అంకితమిస్తున్నట్లు ట్వీట్‌ చేశారు. ఈ అవార్డు అందుకొన్న తొలి భారతీయ నేత మోదీనే.

కాగా, రష్యా, ఉక్రెయిన్‌ యుద్ధానికి స్వస్థిపలికి శాంతి చర్చలు జరపాలని ప్రధాని నరేంద్ర మోదీ పిలుపునిచ్చారు. బాంబు దాడులు, తుపాకీ కాల్పుల మధ్య శాంతి చర్చలు సఫలం కాబోవని తేల్చిచెప్పారు. భారత్‌ ఎప్పుడూ శాంతి వైపే ఉంటుందని పుతిన్‌తోపాటు యావత్‌ ప్రపంచానికి తేల్చిచెప్పారు. ఇదే సమయంలో భారత్‌, రష్యా ద్వైపాక్షిక బంధం సరికొత్త శిఖరాలను అధిరోహించాలని ఆకాంక్షించారు.

కొత్త తరం భవిష్యత్తు కోసం శాంతి చాలా అవసరమని ప్రధానిర మోదీ అభిప్రాయపడ్డారు. బాంబులు, తుపాకులు, బుల్లెట్ల మధ్య శాంతి చర్చలు సఫలం కావని పేర్కొన్నారు. శాంతి పునరుద్ధరణ కోసం భారత్ అన్ని విధాలుగా సహకరించడానికి సిద్ధంగా ఉందని తెలిపారు. గ

గత ఐదేళ్లలో ప్రపంచం అనేక సవాళ్లను ఎదుర్కోవాల్సి వచ్చిందని చెబుతూ అందులో మొదటిది కరోనా మహమ్మారి కాగా, రెండోది పలు దేశాల మధ్య ఘర్షణలని పేర్కొన్నారు. రష్యా అధ్యక్షుడు పుతిన్తో చర్చలు సందర్భంగా ప్రధాని మోదీ ఈ వ్యాఖ్యలు చేశారు. రానున్న కాలంలో భారత్- రష్యాల మధ్య సంబంధాలు మరింత బలపడతాయని తాను విశ్వసిస్తున్నానని తెలిపారు.

భారత్‌లో 6 హైపవర్‌ అణు విద్యుత్‌ కేంద్రాలు 

భారతదేశానికి చాలాకాలంగా అణుఇంధన రంగంలో సహకారాన్ని అందిస్తున్న రష్యా.. మనదేశంలో మరో ఆరు హై-పవర్‌ అణువిద్యుత్‌ కేంద్రాల నిర్మాణంలో సహకరించడానికి ముందుకొచ్చింది. దీంతోపాటు లో-పవర్‌ అణువిద్యుత్‌ కేంద్రాల ఏర్పాటు అంశాన్ని కూడా పరిశీలిస్తున్నట్టు ఆ దేశ అణు ఇంధన సంస్థ రోసాటోమ్‌ సీఈవో అలెక్సీ లిఖచేవ్‌ వెల్లడించారు.

మంగళవారంనాడు.. రష్యాలోని ఆటమ్‌ పెవిలియన్‌ సందర్శనకు వెళ్లిన భారత ప్రధాని మోదీ, రష్యా అధ్యక్షుడు పుతిన్‌కు ఆయనే దగ్గరుండి ఆ పెవిలియన్‌ను చూపించారు. చిన్న చిన్న ట్రాపికల్‌ న్యూక్లియర్‌ పవర్‌స్టేషన్లను స్థానిక పరిస్థితులకు అనుగుణంగా నిర్మించుకోవడంలో భారత్‌కు సహకారం అందించేందుకు.. ఇందుకు అవసరమైన నిర్మాణ భాగాలను నేరుగా ఢిల్లీకి సరఫరా చేసేందుకు రష్యా సిద్ధంగా ఉందని ఈ సందర్భంగా ఆయన ప్రధాని మోదీకి తెలిపారు.

అలాగే.. భారతదేశంలో నాలుగో తరం అణుసాంకేతిక పరిజ్ఞానాలను అభివృద్ధి చేయాలని రోసాటోమ్‌ కోరుకుంటున్నట్టు అలెక్సీ చెప్పారు. భారతదేశంలో ‘ఫ్లోటింగ్‌ న్యూక్లియర్‌ పవర్‌ ప్లాంట్ల(ఎ్‌ఫఎన్‌పీపీ)’ అభివృద్ధిపై కూడా రష్యా ఈ ఏడాది ఏప్రిల్‌లో ఆసక్తి చూపింది. ఫ్లోటింగ్‌ న్యూక్లియర్‌ పవర్‌ ప్లాంట్‌ అంటే.. ఓడలపై నిర్మించే అణువిద్యుత్‌ కేంద్రాలు. అమెరికా 1960ల్లోనే ఈ తరహా పవర్‌ప్లాంట్‌ను ఒకదాన్ని నిర్మించింది.

“రష్యా సహకారం కారణంగా భారత పౌరులు ఇంధన కొరతను ఎదుర్కోకుండా కాపాడగలిగాం. సోమవారం పుతిన్ తో జరిగిన సమావేశంలో ఉక్రెయిన్-రష్యా యుద్ధంలో పరస్పర అభిప్రాయాలను పంచుకున్నాం. శాంతి పునరుద్ధరణ కోసం భారత్ అన్ని విధాలుగా సహకరించడానికి సిద్ధంగా ఉంది” అని ప్రధాని మోదీ తెలిపారు.

రష్యా పర్యటనలో ఉన్న ప్రధాని మోదీ మాస్కోలో ఉన్న యుద్ధ స్మారకం వద్ద పుష్పగుచ్చం ఉంచి యుద్ధవీరులకు నివాళులర్పించారు. ‘ధైర్యవంతులకు గంభీరమైన నివాళి! మాస్కోలో యుద్ధ స్మారకం వద్ద ప్రధాని మోదీ అమరులకు నివాళులర్పించారు. శౌర్యం, త్యాగం, ధైర్యానికి సెల్యూట్ చేశారు’ అని విదేశాంగ మంత్రిత్వ శాఖ ప్రతినిధి రణధీర్ జైస్వాల్ ఎక్స్లో పోస్ట్ చేశారు.