బీజేపీలో చేరిన ఢిల్లీ ఆప్ ఎమ్మెల్యే

బీజేపీలో చేరిన ఢిల్లీ ఆప్ ఎమ్మెల్యే
ఢిల్లీలోని ఛత్తర్పూర్ నియోజకవర్గానికి చెందిన ఆమ్ ఆద్మీ పార్టీ ఎమ్మెల్యే కర్తార్ సింగ్ తన్వర్, ఢిల్లీ మాజీ మంత్రి, పటేల్ నగర్ మాజీ ఎమ్మెల్యే రాజ్ కుమార్ ఆనంద్, మరో మాజీ పటేల్ నగర్ ఎమ్మెల్యే వీణా ఆనంద్ బుధవారం ఢిల్లీలోని పార్టీ ప్రధాన కార్యాలయంలో సీనియర్ నాయకుల సమక్షంలో భారతీయ జనతా పార్టీలో చేరారు.

దక్షిణ ఢిల్లీలోని సయ్యద్-ఉల్-అజైబ్ వార్డుకు చెందిన ఆప్ కౌన్సిలర్ ఉమేద్ సింగ్ ఫోగట్, మరో ఇద్దరు ఆప్ సభ్యులు కూడా ఈ సందర్భంగా బీజేపీలో చేరారని, వారికి స్వాగతం పలికేందుకు బీజేపీ జాతీయ ప్రధాన కార్యదర్శి అరుణ్ సింగ్ కూడా హాజరయ్యారని ఢిల్లీ బీజేపీ అధ్యక్షుడు వీరేంద్ర సచ్ దేవ్ తెలిపారు. మరో ఆరు నెలల్లో ఢిల్లీ అసెంబ్లీ ఎన్నికలు జరుగనున్న సమయంలో వారి చేరికలు ప్రాధాన్యత సంతరింప చేసుకున్నాయి.

ప్రధాని నరేంద్ర మోదీ నాయకత్వం, పనితీరుతో స్ఫూర్తి పొంది ఆప్ నేతలు బీజేపీలో చేరుతున్నారని, ఆప్ లో పనిచేయడం నియంతృత్వం కింద పనిచేయడం లాంటిదని వీరేంద్ర సచ్ దేవ్ వ్యాఖ్యానించారు. ఆప్ లో అవినీతి తారాస్థాయికి చేరిందని ధ్వజమెత్తారు. 2015లో ఛతర్పూర్ నుంచి తొలిసారి ఎమ్మెల్యేగా గెలిచిన కర్తార్ సింగ్ తన్వర్ 2020లో మళ్లీ ఆప్ నుంచి పోటీ చేశారు. 2014లో ఆప్ లో చేరకముందు ఆయన బీజేపీలో ఉన్నారు. ఆయన తిరిగి పార్టీలో చేరడాన్ని బీజేపీ నేతలు ‘హోమ్ కమింగ్ ‘గా అభివర్ణించారు.

రాజ్ కుమార్ ఆనంద్ 2020లో ఆప్ టికెట్ పై రిజర్వ్డ్ సీటు అయిన పటేల్ నగర్ నుండి ఎమ్మెల్యేగా ఎన్నికయ్యారు. అనంతరం, ఆయన ఢిల్లీ ప్రభుత్వంలో సాంఘిక సంక్షేమ మంత్రి అయ్యారు. పార్టీ అవినీతికి పాల్పడుతోందని, దళితులను విస్మరిస్తోందని ఆరోపిస్తూ ఏప్రిల్ 10న హఠాత్తుగా ఆయన మంత్రి పదవికి రాజీనామా చేశారు. 

ఒక నెల తరువాత, మే 5వ తేదీన బీఎస్పీలో చేరారు. 2024 లోక్ సభ ఎన్నికలలో న్యూఢిల్లీ స్థానం నుండి బీఎస్పీ తరఫున పోటీ చేసి, బీజేపీ అభ్యర్థి చేతిలో ఓడిపోయాడు. ఫిరాయింపుల నిరోధక చట్టం కింద జూన్ 14న అసెంబ్లీ స్పీకర్ ఆయనపై అనర్హత వేటు వేశారు. రాజ్ కుమార్ ఆనంద్ భార్య వీణా ఆనంద్ 2013లో పటేల్ నగర్ నుంచి ఆప్ ఎమ్మెల్యేగా ఎన్నికయ్యారు. ఆమె 2024 లోక్ సభ ఎన్నికలకు ముందు ఈ ప్రాంతంలో చురుకైన ఆప్ నాయకురాలిగా ఉన్నారు.