భారతదేశం మారుతోందని ప్రపంచమంతా గుర్తించిందని చెబుతూ గత 10 ఏళ్లలో భారత్ సాధించిన అభివృద్ధి వేగాన్ని చూసి ప్రపంచం మొత్తం ఆశ్చర్యపోతోందని ప్రధాని నరేంద్ర మోదీ తెలిపారు. మాస్కోలో భారతీయులను ఉద్దేశించి ప్రసంగిస్తూ జీ-20 సదస్సును విజయవంతంగా నిర్వహించామని గుర్తు చేశారు.
“పదేళ్లలో 40 వేల కి.మీ. ఎయిర్‌పోర్ట్‌ల సంఖ్యను రెట్టింపు చేశాం. రైల్వే లైన్లను ఎలక్ట్రిఫికేషన్ చేశాం. ప్రపంచంలోనే అత్యంత ఎత్తైన రైల్వే బ్రిడ్జి నిర్మించాం. అభివృద్ధిలో 140 కోట్ల మంది ప్రజల భాగస్వామ్యం ఉంది. టీ20 వరల్డ్ కప్ గెలిచి దేశం సంబరాలు చేసుకుంది” అని ప్రధాని వివరించారు. భారత్ ఘనతను ప్రపంచం గుర్తించక తప్పని పరిస్థితికి తెచ్చామని స్పష్టం చేశారు.
దేశంలోని ప్రతీ ఒక్కరిలో ఆత్మవిశ్వాసం నింపుతున్నామని చెబుతూ ఆత్మవిశ్వాసం భారత దేశానికి అతిపెద్ద ఆయుధం అని తెలిపారు. మన ఆర్థిక వ్యవస్థ ప్రపంచంలోనే పటిష్ఠమైనదని అంటూ భారత్‌ను మూడో ఆర్థిక శక్తిగా నిలబెడతానని ఈ సందర్భంగా వాగ్దానం చేశారు. ‘ఏ దేశానికీ సాధ్యంకాని విధంగా చంద్రయాన్ ప్రయోగం చేపట్టి విజయం సాధించాం. చంద్రుని దక్షిణధ్రువంపై అడుగుపెట్టిన తొలి దేశంగా గుర్తింపు పొందాం. దేశం మారుతోందని ప్రపంచమంతా గుర్తిస్తోంది. విదేశాల్లో ఉంటున్న భారతీయులు దేశాన్ని చూసి గర్విస్తున్నారు’ అని ప్రధాని చెప్పుకొచ్చారు.
`డిజిటల్ పేమెంట్లలో సరికొత్త రికార్డ్లను సృష్టించాం. స్టార్టప్‌ల్లో ప్రపంచంలోనే మూడో స్థానానికి చేరుకున్నాం. 2014లో వందల్లో ఉన్న స్టార్టప్‌లు నేడు లక్షల్లోకి చేరాయి. భారత్ రికార్డు స్థాయిలో పేటెంట్లను సాధిస్తోంది. ప్రపంచంలో అతిపెద్ద ఆరోగ్య బీమా వ్యవస్థ భారత్‌లో ఉంది’ అని గుర్తు చేశారు. తాను ఒక్కడినే ఇక్కడికి రాలేదని, 140 కోట్ల మంది ప్రేమను తీసుకొచ్చానని మోదీ తెలిపారు. భారతదేశ మట్టి వాసనను మోసుకొచ్చినట్లు చెప్పారు. ఇటీవలే మూడోసారి ప్రధాన మంత్రిగా ప్రమాణం చేశానన్న మోదీ మూడు రెట్లు వేగంగా పనిచేయాలని అప్పుడే నిర్ణయించుకున్నట్లు చెప్పారు.
రెండు దశాబ్దాలుగా ద్వైపాక్షిక సంబంధాలను బలోపేతం చేయడంలో రష్యాధినేత పుతిన్ నాయకత్వంపై మోదీ ప్రశంసలు కురిపించారు. ఉక్రెయిన్-రష్యా యుద్ధం వేళ భారత విద్యార్థులు చిక్కుకుపోతే, వారిని కాపాడటంలో పుతిన్ సహకరించారని మోదీ గుర్తుచేశారు. ఈసందర్భంగా ఆయనతో పాటు రష్యా ప్రజలకు కృతజ్ఞతలు తెలియజేశారు.
‘భారత్-రష్యా నమ్మకమైన మిత్రులు. పరస్పర విశ్వాసం, గౌరవం ఆధారంగా ఈ స్నేహం కొనసాగుతోంది. రష్యాలో చలికాలంలో ఉష్ణోగ్రతలు ఎంత మైనస్‌లోకి పడిపోయినా సరే, మన రెండు దేశాల మధ్య బంధం ఎప్పుడూ ప్లస్‌లోనే ఉంటుంది. అది మన స్నేహాన్ని ఆహ్లాదంగా ఉంచుతుంది. ఇప్పటివరకు నేను ఆరుసార్లు రష్యాలో పర్యటించాను. పుతిన్‌తో 17 సార్లు భేటీ అయ్యాను. ఇక ఉన్నత విద్యకోసం భారతీయులు రష్యా వస్తున్నారు. ఇక్కడ మరో రెండు కాన్సులేట్ కార్యాయాలు ప్రారంభిస్తాం’అని మోదీ ప్రకటించారు.

More Stories
వందల మొబైల్ ఫోన్లు పేలడంతో బస్సు ప్రమాదం?
అమెరికా గుప్పిట్లో పాక్ అణ్వాయుధాలు
కశ్మీర్ రాజ్యసభ ఎన్నికల్లో ఎన్సీని అడ్డుకున్న బీజేపీ