రష్యా సైన్యంలోని భారతీయుల విడుదలకు పుతిన్ ఆమోదం

రష్యా సైన్యంలోని భారతీయుల విడుదలకు పుతిన్ ఆమోదం
భారత్‌కు భారీ దౌత్య విజయం లభించింది. రష్యా సైన్యంలో పనిచేస్తున్న భారతీయులను విడుదల చేసేందుకు ఆ దేశ అధ్యక్షుడు వ్లాదిమిర్‌ పుతిన్‌ సమ్మతించారు. వెంటనే వారిని ఆర్మీ విధులను వెనక్కి రప్పిస్తామని, స్వదేశానికి పంపించడానికి ఏర్పాట్లు చేస్తామని ఒప్పుకున్నారు. 
 
ఈమేరకు సోమవారం సాయంత్రం ప్రధాని మోదీకి ఇచ్చిన ప్రైవేట్‌ విందులో పుతిన్‌ మాట ఇచ్చినట్లు సమాచారం. రెండు రోజుల పర్యటన నిమిత్తం ప్రధాని మోదీ సోమవారం సాయంత్రం మాస్కో చేరుకున్నారు. ఈ సందర్భంగా మాస్కో శివార్లలోని నోవో-ఒగార్యోవో అధికార నివాసంలో మోదీని పుతిన్‌ సాదరంగా ఆహ్వానించారు.

ఈ క్రమంలో రష్యా సైన్యంలో భారతీయుల విషయాన్ని ప్రధాని మోదీ ప్రస్తావించారు. దీనికిగాను వారిని విడుదల చేస్తామని పుతిన్‌ హామీ ఇచ్చారని అధికారిక వర్గాల సమాచారం. కాగా, ఉక్రెయిన్‌తో జరుగుతున్న యుద్ధంలో భారత్‌ నుంచి తీసుకెళ్లిన యువకులను రష్యా తన సైన్యంలో చేర్చుకున్నది. 

ఈ క్రమంలో ఇద్దరు భారతీయులు మృతి చెందారు. తమను ఉద్యోగాల పేరుతో మోసం చేసి సైన్యంలో చేర్చారని సుమారు రెండు డజన్ల మంది ఆరోపిస్తున్నారు. తమను సైన్యం నుంచి విడిపించి స్వదేశానికి తీసుకెళ్లాలని గత కొంత కాలంగా వారు వేడుకుంటున్నారు. ఈ నేపథ్యంలో ప్రధాని మోదీ.. పుతిన్‌తో విందు సందర్భంగా ఈ విషయాన్ని ప్రస్తావించారు.

ఉక్రెయిన్‌తో యుద్ధం నేపథ్యంలో భారత్ నుంచి పౌరులను తీసుకెళ్లి రష్యా సైన్యంలో బలవంతంగా చేర్చినట్టు సెంట్రల్ బ్యూరో ఆఫ్ ఇన్వెస్టిగేషన్ (సీబీఐ) ఆపరేషన్‌లో వెలుగులోకి వచ్చింది. రాజస్థాన్‌కు చెందిన మొయినుద్దీన్ చిప్పా, క్రిస్టినా అనే వ్యక్తులు మానవ అక్రమ రవాణా ద్వారా రష్యా సైన్యంలోకి యువకులను పంపినట్టు తేలింది.
 
మంచి జీవితం, విద్య, భారీ జీతాలతో ఉద్యోగాలు పేరుతో యువతను రష్యాకు తీసుకెళ్లి.. ఆ యువకులు అక్కడకు చేరుకున్న తర్వాత వారి పాస్‌పోర్టులు లాక్కుంటారు. అనంతరం రష్యా తరఫున ఉక్రెయిన్‌తో యుద్ధంలో చేరేలా బలవంతం చేస్తారు. ఈ క్రమంలోనే యుద్ధంలో పాల్గొన్న కొందరు యువకులు తీవ్రంగా గాయపడి.. కొందరు ప్రాణాలు కోల్పోయారు. దీంతో రష్యా ఉక్రెయిన్ యుద్ధంలో చిక్కుకున్న యువకులను భారత్‌కు తీసుకొచ్చేందుకు కేంద్రం ప్రయత్నిస్తోంది. తాజాగా, మోదీ రష్యా పర్యటనలో ఈ అంశాన్ని ప్రధానంగా లేవనెత్తారు.